-లింగాలవలస లో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
-వర్షంలోనూ సాగిన గడపగడపకూ మన ప్రభుత్వం
శ్రీకాకుళం: అల్పాదాయ వర్గాల ఆనందమే తమ ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం అంపోలు-2 సచివాలయం పరిధిలోని లింగాలవలసలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుసుకుని, తద్వారా ఏమయినా తప్పులు ఉంటే దిద్దుకుని, పాలన సంబంధ నిర్ణయాల్లో మార్పులు అవసరం అయితే చేసుకుని, ఏడాది పాటూ దీనిని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అంతేకాదు ఈ గ్రామం నన్నెంతో ప్రేమించినటువంటి గ్రామం. ఇక్కడి వారంతా నన్నొక బంధువుగా చూసుకుంటారు. ఇక్కడి వ్యవసాయానికి వంశధార నీళ్లు ఇచ్చాం.అదేవిధంగా లిఫ్టు ఇరిగేషన్ స్కీంలు కూడా ఇంప్లిమెంట్ చేశాం. ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పాలన చేస్తోంది. రాజ్యాంగంలో చెప్పిన విధంగా అందరి అవసరాలు తీర్చే విధంగా, బీద వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేవిధంగా చర్యలు చేపడుతూ, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నాం. వైఎస్సార్సీపీ కి ఓటు వేయమని అడిగే ముందే ఇవన్నీ చెప్పాం.. చెప్పిన మేరకు మూడేళ్ల కాల వ్యవధిలో తొంభై అయిదు శాతానికి పైగా హామీలు అమలు చేశాం. సంక్షేమ పథకాలు అమలు చేసి మూడేళ్లు అవుతుంది కనుక మీ అభిప్రాయం ఏంటన్నది తెలుసుకునేందుకే గడపగడపకూ మన ప్రభుత్వం అనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం దిద్దాం. పథకాలు అందుకున్న చాలా మంది ఏ పథకం ద్వారా ఎంతొచ్చింది.. ఏ మేరకు లబ్ధి చేకూరింది అన్నవాటిపై కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండడం లేదు. యాభై ఇళ్లకో, వంద ఇళ్ల కో పనిచేసే వలంటీర్లు దృష్టి సారించి గ్రామీణ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. పథకాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. అదేవిధంగా పథకాల అమలులో లంచగొండితనంకు తావేలేదు. దీనిని చాలా మంది అంగీకరించలేరు కానీ ఇదే వాస్తవం. లక్షా 65 వేల కోట్ల రూపాయలు కేవలం పథకాల అమలుకే మూడేళ్ల కాల వ్యవధిలో వెచ్చించాం. ఇవన్నీ అంగీకరించలేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ధరలకు సంబంధించి అసత్య ప్రచారం నిర్వహిస్తోంది. ఒక్కసారి ధరల విషయమై పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూడండి. అక్కడ ఏ మేరకు ధరలున్నాయో ఒక్కసారి అడిగి చూడండి.
మన దేశానికి అవసరం అయ్యే వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఫారెన్ ఎక్సైంజ్ ద్వారానే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ధరలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. అదేవిధంగా పెట్రో, డీజిలు రేట్లు దేశమంతటా పెరుగుతున్నాయి. ఇవి కూడా బయట నుంచి వచ్చేవే. ఈ ధరలు కూడా ఒక్కసారి మిగతా ప్రాంతాలతో పోల్చి చూడండి. మాకు ఓటేసినా వేయకపోయినా అన్ని కుటుంబాలకూ అన్నీ వర్తింప జేస్తున్నాం. అంటే సంక్షేమ పథకాల అమలులో వివక్షకు తావే లేదు. ఒకప్పుడు ఇక్కడి కూలీలు పనుల కోసం ఉపాధి కోసం పట్టణానికి వెళ్లేవారు. క్యారేజీలు కట్టుకుని ఉదయం ఇంటికే బయలు దేరేవారు. కానీ ఈనాడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తున్నాను. దేని వల్ల మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎవరి వల్ల మన పిల్లలు మంచి చదువులు, ఉన్నత చదవులు చదువుకోగలుగుతున్నారు? అన్నవి గుర్తించాలి. ప్రతి పథకం వెనుకా సామాజిక దృక్పథం ఉంది.
అమ్మ ఒడి ద్వారా 15 వేలు ఇస్తున్నామంటే బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండే విధంగా, కుటుంబ పరిస్థితుల కారణం చదువు అర్ధంతరంగా మానేయకుండా ఉండేవిధంగా చేసిన ఏర్పాటు. ఈ పథకాన్ని ఇప్పటికే మూడేళ్ల పాటు అమలు చేశాం. ఆ రోజు మాకు ఓటేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరువాత ఇచ్చిన మాట తప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి నిధులు విడుదల చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం బాగుంటుందన్న ఒకే ఒక్క ధ్యేయంతో ఇవాళ మహిళ ల పేరిట ఇంకా చెప్పాలంటే ఇల్లాలి పేరిట పట్టా ఇచ్చి, ఇల్లు కట్టుకునేందుకు తగినంత ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు.
వీటన్నింటిపై మహిళా సమాఖ్యలు సంబంధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రజలతో మాత్రమే ప్రభుత్వాలు అధికారంలో రావడం సాధ్యమన్నవిషయాన్ని అంతా గుర్తించాలి.అటువంటి ప్రజలకు మంచి చేసే, మేలు చేసే ప్రభుత్వాలకు సంబంధించి పథకాల అమలు విషయమై ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రజలకు అవగాహన అన్నది కల్పిస్తూనే ఉండాలి. ప్రజా చైతన్యంతోనే ప్రజా స్వామ్య స్ఫూర్తితోనే మంచి పాలన, మంచి పాలకుల రాక అన్నది సాధ్యం కనుక ఎప్పటికప్పుడు వారితో మమేకం అయి పనిచేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిదే. అందుకే మేం ఏనాడూ మాయమాటలు చెప్పలేదు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు మాత్రం డ్వాక్రా రుణాలకు సంబంధించి ఇచ్చిన మాట తప్పారు. ఐదేళ్ల పాటూ డ్వాకా రుణ మాఫీ అన్న విషయాన్నే మరిచిపోయారు. కానీ మేం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పథకాల అమలుకు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అదేవిధంగా విద్యా దీవెన పథకం కింద ఫీజు రీ యింబర్స్మెంట్ చేస్తున్నాం.
సామాజిక పింఛను ఆ రోజు వెయ్యి రూపాయలు ఇస్తే ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నాం. వీటన్నింటిపై కార్యకర్తలు కూడా ఇంటింటికీ తిరిగి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. నిజ జీవితంలో కష్టాలు తీర్చడం, కన్నీళ్లు తుడవడం అన్నది అంత సులువు కాదు. వాల్ పోస్టర్లతో చెప్పినంత సులువు కాదు. గ్రామ సచివాలయాలను వినియోగించుకోవాలి. పథకాల వెనుక ఉన్న ఐడియాలజీని వివరించాలి. నిజ జీవితం వేరు సినిమా వేరు, అది మీరు తెలుసుకోవాలి, ఓ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబం హాయిగా బ్రతికేందుకు మీరు ప్రభుత్వం సహాయం తప్పక అవసరం. అందుకే ఇన్ని పథకాలను అమలు అన్నది తప్పనిసరి” అని అన్నారు. అనంతరం గ్రామంలో తన దృష్టి కి వచ్చి తాగునీటి సరఫరా, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంకు సంబంధించి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపిపి గోండు రఘురాం, ఎమ్మార్వో, ఎంపిడివో, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ , సర్పంచులు గోండు జయరాం, పీస గోపి, యల్లా నారాయణ, మార్పు పృథ్వి, పీస శ్రీహరి, అరవల రామ కృష్ణ, సుంకాన సురేష్, కొయ్యనా నాగభూషన్, వైయస్ఆర్‌సీపీ నాయకులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు