-సరైన గౌరవ మర్యాదలు దక్కేట్లు చేస్తాను
-మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ప్రజాప్రతినిధులకు మెరుగైన మర్యాద
-ఎంపీటీసీల సంఘం రాష్ట్ర, జిల్లాల అధ్యక్షులతో సమావేశమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్రంలో ఎంపీటీలకు సరైన గౌరవ మర్యాదలు దక్కేట్లు చూడటంతోపాటు వారి సమస్యలను సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం, ఆ సంఘం జిల్లాల అధ్యక్షులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. ఆయా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరింప చేస్తామని చెప్పారు. అలాగే ఎంపీటీసీలకు సరైన గౌరవం దక్కేలా చేస్తామన్నారు. ఈ విషయాలపై ఇప్పటికే తనతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లు ఎంపీటీసీల సమస్యలపై చెబుతూనే ఉన్నారన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలీస్తే మన రాష్ట్రంలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎక్కువ గౌరవం, మర్యాదలు దక్కుతున్నాయన్నారు. గౌరవ వేతనం, అభివృద్ధి పనులు, నిధులు, విధులు మన రాష్ట్రంలోనే బాగున్నాయని చెప్పారు.
స్థానిక సంస్థలకు ప్రకటించిన బడ్జెట్ లోని రూ.500 కోట్లల్లో ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేసినట్లు, మిగతా నిధులను కూడా త్వరలోనే విడుదల చేయిస్తామని చెప్పారు. కాగా, ఎంపీటీసీల సంఘం తరపున మంత్రికి 20 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని వారు అందచేశారు. వాటిలో ఎంపీటీసీకి 20 లక్షల చొప్పున నిధుల కేటాయింపు, ప్రోటోకాల్, గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీకి సీటు, సర్పంచ్‌ల మాదిరిగానే ఎంపీటీసీలకు డిస్ ప్లే బోర్డు ఏర్పాటు, మండల పరిషత్ సమావేశాల్లో ఉపాధ్యక్షుడికి వేదిక మీద స్థానం, గ్రామ సభల్లో ఎంపీటీసీకి వేదిక మీద సీటు, ప్రాథమిక పాఠశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం, రూ.15వేలకు వేతనం పెంపు, రేషన్ దుకాణాలపై పర్యవేక్షణ అవకాశం, వివిధ స్టాండింగ్ కమిటీల్లో ఎంపీటీసీలకు స్థానం వంటి అనేక అంశాలను మంత్రి కి వారు విన్నవించారు. గ్రామల్లో తలెత్తుకుని తిరిగే విధంగా తమను చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యుడు, కొడకండ్ల ఎంపీటిసీ, సంఘం రాష్ట్ర కార్యదర్శి అందె యాకయ్య, రవి, వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆ సంఘం జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.