• పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ
• అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్నీ గుర్తించాం
– ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి: ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఏర్పడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరచిన ఆందోళనలు, వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల వల్ల మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను. అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాను. మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను.
కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించాం. సమస్యల పరిష్కారంతోపాటు జీవనోపాధుల మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా ఈ కమిటీ దృష్టిపెడుతుంది. నష్ట పరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించాం. మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బ తిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించాను. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాను. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశాను. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురుచూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్ట జీవులకు భరోసా కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాము. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత, నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తాను అని తెలిపారు