రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గృహలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం యుగంధర్ డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అధ్యక్షతన విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభ జరిగింది. 2000 ఆగస్టు 28న బషీర్ బాగ్ కాల్పులలో విద్యుత్ అమరవీరులు రామకృష్ణ , విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాదేశాలకు లొంగి రాష్ట్రంలోని నివాస గృహాలకు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని గత వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది. అదానీ మరియు షిరిడి సాయి తదితర కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ఈ మీటర్లను వ్యతిరేకించింది. హైకోర్టులో పిటీషన్లు వేశారు.
నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాలను రద్దు చేయకపోగా స్మార్ట్ మీటర్ల ప్రక్రియను కొనసాగిస్తున్నది. విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో అదానీ సంస్థకు చెందిన మీటర్లను తెచ్చి విద్యుత్ కార్యాలయాల్లో భద్రపరుస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు, ప్రభుత్వ కార్యాలయాలలోను మీటర్లు బిగిస్తున్నారు .తదుపరి నివాస గృహాలకు మీటర్లు బిగించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారు.
మొదటి దశలో వ్యవసాయం పంపు సెట్లకు మీటర్ల పేరుతో క్రమంగా ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే ప్రమాదం ఉంది. నివాస గృహాలకు మీటర్లతో ప్రీపెయిడ్ పద్ధతి మరియు విద్యుత్ వాడే సమయాన్నిబట్టి అదనపు చార్జీలు, మీటర్ల ఖర్చును వినియోగదారులపై వేయటం తదితర రూపాల్లో భారం పడుతుంది. వేలాదికోట్ల రూపాయల ప్రజాధనం మీటర్ల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట తప్పి కేంద్ర ప్రభుత్వాదేశాలకు లొంగిపోయింది. గతంలో వ్యతిరేకించిన మీటర్లనే కొనసాగించడం వాగ్దాన భంగమే అవుతుంది. బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతోనే కేంద్రం ఈ స్మార్ట్ మీటర్లను రుద్దుతోంది.
వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తూ న్నాయి. ఆదాని, షిర్డీ సాయి తదితర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలని, బిగించిన మీటర్లను తొలగించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కె మోహన రావు, వి జి కె మూర్తి , కె శ్రీనివాస్, పి తేజ, యం మూర్తి, కె సూరయ్య తదితరులు పాల్గొన్నారు.