– ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసన సభ్యుడు సామినేని ఉదయ భాను
వెలగపూడి: పులిచింతల ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రాజెక్టు ఉన్న ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని, తద్వారా ఉద్యోగుల సమస్యలను తీర్చాలని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసన సభ్యుడు సామినేని ఉదయ భాను ప్రభుత్వాన్ని కోరారు.
జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇక్కడ ఉన్న ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించారని, దానివల్ల సాధరణ స్థాయి ఉద్యోగి నుండి ఎస్ ఈ స్థాయి ఉద్యోగి వరకూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. దీనిపై సత్వరమే స్పందించి ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగ 45 టీఎంసీల సామర్ధ్యం కలిగిన ఈప్రాజెక్టును నిర్వహించేందుకు 26 మంది టెక్నికల్ సిబ్బంది ఉన్నారన్నారు.
వీరందరినీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ పద్దతిలో తీసుకున్నారని గుర్తుచేశారు. వీరికి ఇచ్చే రోజుకు రూ. 450 నుండి రూ. 500 వేతనాలు సరిపోని పరిస్థితి నెలకొందన్నారు. ఈక్రమంలోనే నిర్వహణా లోపాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇటీవలికాలంలో గేటు కొట్టుకుపోయిన సందర్భాన్ని ఆయన ఈసందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు.
దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉందని తెలిపారు. దీనిపై కూడా స్పందించి సత్వరమే కాంట్రాక్టు, ఎన్ ఎంఆర్ పద్దతిన పనిచేస్తున్న వారిని అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకు రావాలని విజ్ఞప్తిచేశారు. ఆమేరకు సత్వరమే ఉత్తర్వులు జారీచేసి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన పులిచింతల ప్రాజెక్టు నిర్వహణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.