– గవర్నమెంట్ స్కూళ్లలో మెడికల్ క్యాంప్‌లు
– బెంచీలపైనే డయేరియా బాధితులకు వైద్యం
– కలుషిత నీటిపై పవన్‌కళ్యాణ్ స్పందించాలి
– విశాఖ వచ్చిన లోకేష్, ఇక్కడికెందుకు రాలేదు?
– డయేరియా బాధితులను పరామర్శించే తీరిక లేదా?
– మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్
గుర్ల: డయేరియాతో అతలాకుతలమవుతున్న విజయనగరం జిల్లా గుర్ల సందర్శించిన మాజీ మంత్రి, వైయస్సార్సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు, ఆ వ్యాధి బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు.
విజయనగరం జిల్లాలో డయేరియాతో 11 మంది మృతికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరోపించారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, డయేరియా మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవాలని ఆయన డిమాండ్ చేశారు.
గవర్నమెంట్ స్కూళ్లలో మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారని, బెంచీలపైనే డయేరియా బాధితులకు వైద్యం చేస్తున్నారని ప్రస్తావించిన ఆయన, ప్రభుత్వం కనీసం బెడ్స్ కూడా ఏర్పాటు చేయని స్థితిలో ఉందా అని నిలదీశారు. డయేరియా బాధితుల పట్ల ప్రభుత్వ తీరు దారుణమని దుయ్యబట్టారు.
పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ ఆదే«శాల మేరకు గుర్ల మండలంలో పర్యటించామన్న మాజీ మంత్రి, డయేరియా పీడిత గ్రామాల్లో దేశం ఉలిక్కిపడే పరిస్థితులున్నాయని వెల్లడించారు. దాదాపు 500 మంది వ్యాధితో బాధ పడుతున్నా, వారికి మెరుగైన వైద్య సేవలందించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చూపుతోందని ఆక్షేపించారు.
గుర్ల స్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కనీస సదుపాయాలు కల్పించలేదని దుయ్యబట్టారు. కనీసం 10 బెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో, బెంచీలపైనే రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారని తెలిపారు. ఇది అత్యంత దారుణమని అన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు మనబడి కింద ఆ స్కూల్‌ను అభివృద్ధి చేశారని గుర్తు చేసిన సీదిరి అప్పలరాజు, ఆ స్కూల్లో ఆ సదుపాయాలు కూడా లేకుండా ఉండి ఉంటే, పరిస్థితి ఏమిటని ప్రస్తావించారు.
నాడు–నేడు ఆస్పత్రులు కార్యక్రమంలో పీహెచ్‌సీలను కూడా పూర్తిగా మార్చామని, అయినా డయేరియా బాధితులకు ఎందుకు మెరుగైన వైద్య సేవలందించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా మద్యం, ఇసుక మాఫియా నుంచి బయటకు వచ్చి, ప్రజల బాగోగులపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి సూచించారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, ప్రజల ఇబ్బందులు గమనించాలని కోరారు. ఈ ప్రాంతంలో సరఫరా అవుతున్న కలుషిత నీటిపై డిప్యూటీ సీఎం స్పందించాలని, వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. మరోవైపు విశాఖలో పర్యటించి, రాజకీయాలు మాట్లాడిన మంత్రి నారా లోకేష్, గుర్ల మండలానికి ఎందుకు రాలేదని, డయేరియా బాధితులను పరామర్శించే తీరిక కూడా ఆయనకు లేదా? అని సీదిరి అప్పలరాజు నిలదీశారు.