– ప్రణాళికా శాఖ ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ కి టీడీపీ ఎమ్మెల్యేల వినతి
– ప్రకాశం జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధుల పక్షాన వినతి పత్రం అందజేసిన గొట్టిపాటి, డోలా, ఏలూరి
_జిల్లాల పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని, ప్రభుత్వ ప్రతిపాదనలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, జిల్లా అవసరాలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని నూతన జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించాలని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు,డోలా బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి లు ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
గురువారం గుంటూరులోని ప్రణాళిక శాఖ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు మేరకు రూపొందించిన వినతిపత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ను పునర్విభజనలో అశాస్త్రీయంగా చేపట్టారని వివరించారు. పునర్విభజన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే జిల్లా మూడు ముక్కలు అవుతుందన్నారు. దశాబ్దాల ప్రకాశం జిల్లా ప్రజల కల నెరవేరదన్నారు. దీనికితోడు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన జిల్లాల విభజన తో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు విభజన ప్రక్రియ జిల్లా ప్రజలకు శాపంగా మారకూడదన్నారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ఏర్పడిన ప్రకాశం జిల్లా ఆశయానికి తూట్లు పొడిచినట్లు అవుతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో అనేక మంది మేధావులు 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటుకు పూనుకున్నారని వారు గుర్తు చేశారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలను కలిపి నాటి పెద్దలు ప్రకాశం జిల్లాకు రూపకల్పన చేశారన్నారు. 1972లో మాజీ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి పేరుతో ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారని పేర్కొన్నారు.
ఒక లక్ష్యంతో ఏర్పడిన జిల్లా ఆశించిన అభివృద్ధి ఇప్పటికి జరగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పునర్వభజన పేరుతో ప్రకాశం జిల్లా ను మూడు ముక్కలు చేయడం అత్యంత అశాస్త్రీయం, బాధాకరం అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏ ఒక్క ప్రాంతానికీ ఈ పునర్విభజన ద్వారా న్యాయం జరిగే అవకాశం లేదని ఘంటాపథంగా పేర్కొన్నారు.అశాస్త్రీయంగా చేపట్టిన విభజనతో అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వారు వివరించారు.
రాష్ట్రంలో24 మండలాతో ఉన్న అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉన్న కందుకూరును పూర్తిగా రద్దు చేయడం సరికాదని ఆ డివిజన్ ను కొనసాగించాలన్నారు.జిల్లాల విభజన పేరుతో అశాస్త్రీయంగా, హడావుడిగా రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాల ఏర్పాటు చేయడం వల్ల ఆ లక్ష్యం నెరవేరదన్నారు. ప్రభుత్వం విధానపరమైన ఆలోచనలను ఆచరణలో పెట్టాలన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పరిపాలనా వికేంద్రీకరణ జరగాలంటే రెవెన్యూ డివిజన్ల సంఖ్యను పెంచాలన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 3 రెవెన్యూ డివిజన్ల (ఒంగోలు, మార్కాపురం, కందుకూరు)లను వికేంద్రీకరణ చేసి 6 రెవిన్యూ డివిజన్లుగా విభజించాలన్నారు. జిల్లా విభజన తప్పనిపరిస్థితి అయితే ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను, మార్కాపురం కేంద్రంగా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, కందుకూరు నియోజకవర్గాలతో ఏర్పాటు చేయాలన్నారు.
మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన మార్కాపురం, దర్శి, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని వివరించారు. దీని ద్వారా అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి సమగమ్రైన అభివృద్ది ప్రణాళికతో రూపురేఖలను మార్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సౌలభ్యం పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పునర్విభజన నేపథ్యంలో జిల్లాను మూడు ముక్కలు చేయడంవల్ల ప్రకాశం జిల్లా ప్రజానీకం నుంచి పెద్ద ఎత్తున గత అనేక రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు.తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల, రెవెన్యూ డివిజన్ల ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. జిల్లాల విభజనపై పునరాలోచించి నూతన ప్రతిపాదనల కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజా సంఘాలు, అభివృద్ధిలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రకాశం జిల్లా ప్రజల పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరారు.