Suryaa.co.in

Andhra Pradesh

ఆ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే అధికార పార్టీ పరిమితం

-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పని మాటలు చెప్పినట్లుగా తప్పుడు ప్రచారం
-ప్రతిపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికే ఈ కుట్ర… ప్రతిపక్ష నేతలు అప్రమత్తంగా ఉండాలి
-జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల అంటేనే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎక్కువ అభిమానం
-ప్రభుత్వ ఉద్యోగులకు 31 వేల కోట్ల రూపాయల బకాయిలు పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
-హవ్వ…సోదరుడికి ఉద్యోగం వస్తే… అందురాలికి పెన్షన్ కట్ చేస్తారా?
-మూడు రాజధానుల పేరిట కర్నూల్, విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం… అమరావతిలో రోడ్లను తవ్వేశారు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి మొదలుకొని నెల్లూరు జిల్లా వరకు అధికార వైకాపా సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితం అవుతుందని నరసాపురం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో ఈ విషయం తేటతెల్లమయింది. టిడిపి జనసేన కూటమి, అధికార వైకాపా, కాంగ్రెస్ పార్టీల పేరిట సర్వే నిర్వహించగా, ప్రస్తుత పాలకులకు పట్ల ప్రజలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు . సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అధికార వైకాపా… కడప, చిత్తూరు జిల్లాలతో పాటు అనంతపురంజిల్లా లోను ఒకటి రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితి రోజుకింత దిగజారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అధికార వైకాపాను వీడిన వారిలో ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో నలుగురు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే నని గుర్తు చేశారు. వైకాపా పరిస్థితి రోజుకింత దిగజారుతుండడం వల్లే, శాసనసభ్యులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారన్నారు . ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు, డబ్బులు కూడా పని చేయమని ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. అధికార పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వని చంద్రబాబు నాయుడు
రాష్ట్రం లో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనని మాటలు అన్నట్లుగా తమకు తామే సింహాలుగా చెప్పుకునే వారు విస్తృత ప్రచారం చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనుకొని తొందరపడి ప్రతిపక్ష నాయకులు ఒకరిని మరొకరు ఒక మాట అనుకుంటే, ప్రతిపక్షాల మధ్య ఉన్న ఐక్యత దెబ్బతింటుంది. దానికోసమే పక్కా ప్రణాళికతో, కిషన్ రెడ్డి అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేశారు. ఇటువంటి కుట్రల పట్ల ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు అప్రమత్తంగా ఉండాలి. కిషన్ రెడ్డి చెప్పని మాటలను, చెప్పినట్లుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానిస్తూ, అందులోని తాత్పర్యాన్ని ఆయన తన మాటల్లో వెల్లడించారు. దీనితో, ఈ కుట్ర కోణం స్పష్టం అయ్యింది. ఈ కుట్ర బాగోతం వెనుక ఎవరు ఉన్నారన్నది సుస్పష్టం .

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ప్రకటించడం వల్లే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు ఎటువంటి మద్దతును ప్రకటించలేదు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయ్యింది కాబట్టి, రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ ఓటమి ఓటమిపాలవుతుందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వక్ర భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉంది. రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి 35.8% ఓట్లు లభించగా, కాంగ్రెస్ పార్టీకి 6.68% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి రెండు శాతం, ఎంఐఎంకు 18 శాతం ఓట్లు లభించాయి. అధికార బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే ఒక్క శాతం తక్కువ ఓట్లు బిజెపికి లభించాయి.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసి పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి 22.5 % ఓట్లు లభించాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 6.68% ఓట్లు లభించిన కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీ ఎన్నికల్లో 22.5 % ఓట్లు లభించాయంటే, 16% ఓట్లు పెరిగినట్లు స్పష్టం అవుతుంది. ఈ 22.5 % ఓట్ల పెరుగుదలను క్రెడిట్ ను చంద్రబాబు నాయుడుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇస్తున్నారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఓట్ల శాతం గురించి చెప్పకుండా, ఓడిపోయిందని చెప్పడాన్ని పరిశీలిస్తే… ఇవేమైనా పేకాట లెక్కలా?? అంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలన్న ఆయన, అయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు.

ఏ పార్టీకి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించలేదు. కానీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతానికి, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతానికి తేడా తెలుసుకోకుండా ఎవరో మాట్లాడమన్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడితే, ఆయన క్రెడిబిల్టే దెబ్బతింటుంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 6.68% ఓట్లు మాత్రమే వచ్చాయని రాష్ట్ర ప్రజలకు ఏమైనా తెలుసా?, 6.6 8 శాతం నుంచి 22.5% ఓట్లకు ఎదిగిన పార్టీని ఓడిపోయిందని పేర్కొనడం పెద్ద బూతు అవుతుందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత, మా పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. అందుకే ఫ్లాష్ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలోనూ ఖచ్చితమైన నిర్ణయం వెలువడనప్పటికీ, ప్రజాభిప్రాయం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలిసిపోయిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

సకాలంలో జీతాలు అందక ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం
సకాలంలో జీతాలు అందక అనంతపురం జిల్లాకు చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసపూరిత విధానాలతో, తడిగుడ్డతో గొంతు కోసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్నారు . నా చావుతోనైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చివరి నిమిషంలో ఆయన ఆసుపత్రిలో ప్రాణపాయస్థితి నుంచి బయటపడినట్టు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. మల్లేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లితండ్రుల తర్వాత గురువే దైవం అని భావించే ఈ సమాజంలో, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా 31 వేల కోట్ల రూపాయలు బకాయి పడిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే, అందులో రెండు లక్షల మంది పై చిలుకు ఉపాధ్యాయులే ఉంటారు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను పెట్టుకొని, సకాలంలో జీతాలు చెల్లించకపోతే వారి పరిస్థితి ఏమిటి.

ఇళ్ల నిర్మాణ రుణాలు, ఇతర బ్యాంకు రుణాలకు వారు నెలసరి వాయిదాలను ఎలా చెల్లిస్తారు.. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల వంతు వచ్చింది. ఇకపై ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తకముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి, ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఒకవైపు కాంట్రాక్టర్లు, మరొకవైపు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, కుదిరితే అధికార పార్టీ నేతలు హత్యలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా వై ఏపీ నీడ్స్ జగన్ అనే స్లొగన్స్ తో అధికార పార్టీ నేతలు వీధుల్లో తిరుగుతున్నారు. రాష్ట్రంలో హక్కుల కోసం పోరాడే పరిస్థితులు లేవు. భయం భయంగా తమకు రావలసిన బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు. ఎల్లకాలం పరిస్థితి ఇలాగే ఉండదు. మనసులో భయాన్ని పెట్టుకొని బ్రతుకు వెళ్ళదీస్తున్న వారు సమయం వచ్చినపుడు సరైన గుణపాఠం నేర్పుతారని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

వేల కోట్లు ఉన్న జగనే చెల్లికి చిల్లి గవ్వ ఇవ్వనప్పుడు… తమ్ముడికి ఉద్యోగం వస్తే అంధురాలైన అక్కకు పెన్షన్ నిలిపివేస్తారా?
వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి చెల్లికి చిల్లి గవ్వ ఇవ్వనప్పుడు, తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని అంధురాలైన అక్కకు పెన్షన్ నిలిపివేయడం సమంజసమేనా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సరోజ అనే అంధురాలి సోదరుడికి ఉద్యోగం వచ్చిందని, వికలాంగుల కోటాలో ఆమెకు ఇచ్చే పెన్షన్ నిలిపివేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరి షర్మిలకు ఎందుకు గొడవ వచ్చింది?. ఆస్తిలో అన్నయ్య తనకు వాటా ఇవ్వడం లేదని ఆమె మరొక పార్టీ పెట్టుకున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వనప్పుడు, సోదరుడికి ఉద్యోగం వచ్చిందని చెప్పి, ఒక అంధురాలికి పెన్షన్ నిలిపివేయడం దారుణం. సోదరుడి కంటూ ఒక కుటుంబం ఉంటుంది. అంధురాలైన ఆమెని చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదా?, సోదరుడిగా?? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు .

కడప జిల్లాలో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఎంతోమంది వికలాంగుల కోటా లో ఎటువంటి అంగవైకల్యం లేకుండానే పింఛన్లు పొందుతున్నారు. ఈ విషయాన్ని నేను గతంలో రచ్చబండలో చర్చించాను. రాజకీయం, వ్యవసాయం చేసుకునే ఎంతోమందికి చెవులు సరిగ్గా వినిపించడం లేదన్న కారణంగా వికలాంగుల కోటాలో పింఛన్లు ఇస్తున్నారు. ఈ సర్టిఫికెట్లను సంపాదించడానికి వైద్యులకు కొంత, పింఛన్లు ఇవ్వడానికి వాలంటీర్లకు కొంత వారు నగదు ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. చక్కగా చెవులు వినబడుతున్న వారికి పింఛన్లు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒక అంధురాలికి పింఛన్ నిలుపుదల చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయింది. సరోజ ఆత్మహత్యకు పింఛన్ నిలుపుదలే కారణమా?, ఇంకా ఏమైనా కారణం ఉందా? అని విచారిస్తామని పేర్కొనడం సిగ్గుచేటు. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి. దిక్కుమాలిన నియమావళి తో ఒక అమ్మాయి నిండు జీవితాన్ని బలి తీసుకోవడం దారుణమని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. మీ పాపాలకు శాపాలు ఉంటాయి.

48 గంటలు గడవకముందే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపు పొద్దున్నే రోడ్డెక్కి ఇంకా ఆయన చాలా విషయాలు చెబుతారు. ఇలా పార్టీలో ఎంతోమంది ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం అడ్వాన్సులు కట్టమని అడుగుతున్నారట. మునిగిపోయే ఈ పార్టీకి అడ్వాన్సులు కట్టి మోసపోవద్దని రఘురామ కృష్ణంరాజు సూచించారు. జగన్మోహన్ రెడ్డి చెబితే ఎన్నో కేసు ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాలలో వేశారు. ఒక వ్యక్తిని విశ్వసించి ఆయన వేయమన్న కేసులన్నీ వేసిన రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టుంది. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి పై ఎన్ని కేసులు వేస్తారో చూడాలి. వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే వైయస్ షర్మిల అంటేనే రామకృష్ణారెడ్డికి ఎక్కువ అభిమానం. తెలంగాణలో ఆమె పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, వెళ్లి కలిసి అభినందించిన వారిలో రామకృష్ణారెడ్డి ఒకరు. అటువంటి రామకృష్ణారెడ్డి రేపు ఆంధ్రాలో షర్మిల తో కలిసి పాదయాత్ర చేస్తారేమోననే వాదనలు వినిపిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే చంద్రబాబు నాయుడుదే బాధ్యతట
నాలుగేళ్ల తర్వాత గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దే బాధ్యత అని పేర్కొనడం హాస్యాస్పదంగా అనిపిస్తుందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టు కు ఏమి జరిగినా, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయిన చంద్రబాబు నాయుడు దే బాధ్యత అని పేర్కొనడం, ప్రస్తుత పాలకుల బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు దే బాధ్యత అని పేర్కొనే వారిని ఏమనగలమని ప్రశ్నించారు. గతంలో వరదలకు పొలాలు నీట మునిగినప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో పొలాల్లోకి వెళ్లి పంటను పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నీట మునిగిన పొలాలని పరిశీలించడానికి ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసుకొని, రెడ్ కార్పెట్ పరిపించుకోవడానికి ప్రజలు గమనిస్తున్నారన్నారు. సకాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

రోడ్లను తవ్వేశారు… పనులను నిలిపివేశారు
మూడు రాజధానుల ఏర్పాటు పేరిట కర్నూలు, విశాఖపట్నం నగరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అమరావతిలో వేసిన రోడ్లను తవ్వేశారు. అభివృద్ధి పనులను నిలిపివేశారు. విశాఖపట్నంలో 450 కోట్ల రూపాయల ప్రజాధనంతో పర్యాటక శాఖ భవనం పేరిట ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నా రు. మూడు రాజధానుల ఏర్పాటు పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను నిరసిస్తూ అమరావతి ఐక్యవేదిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు నేను హాజరవుతానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసి, చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇదే అంశంపై ఆగస్టు ఏడవ తేదీన తాను పార్లమెంట్లో మాట్లాడినట్లుగా గుర్తు చేశారు. వన్ నేషన్, వన్ కానిస్ట్యూషన్ వన్ ఫ్లాగ్ అని పార్లమెంటులో పేర్కొన్నానని చెప్పారు. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్న మోడీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

LEAVE A RESPONSE