– జీవో 68 రద్దు చేయాలి
– తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు డిమాండ్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తో సమావేశమయ్యారు. వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జీవో నెం.68 రద్దుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, చిన్న హోర్డింగ్ ఏజెన్సీల జీవనోపాధికి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్.రామ్ చందర్ రావు మాట్లాడుతూ 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెం.68 ప్రవేశపెట్టింది. ఈ జీవో ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతో పాటు జీహెచ్ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని తెలిపారు. ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకే ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే రూపొందించడం తీవ్ర అన్యాయం చేయడమే. చిన్న హోర్డింగ్ ఏజెన్సీలు ఇంకా పనిచేస్తున్న ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా, రాష్ట్ర ప్రభుత్వం వాటి హోర్డింగ్లను తొలగించడానికి ప్రయత్నిస్తోంది. దీని కారణంగా సుమారు 50,000 కుటుంబాల జీవనోపాధి ప్రభావితమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జీవో నెం.68ని రద్దు చేయాలని అవుట్డోర్ మీడియా ఓనర్స్ కు మద్దతుగా బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను అంగీకరించి, తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే, 21 నెలలూ అధికారంలో ఉన్నప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. హోర్డింగ్ పరిశ్రమపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని ఆపాలి. పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కోల్పోకుండా భరోసా కల్పించాలని రామ్ చందర్ రావు డిమాండ్ చేశారు.