Suryaa.co.in

Editorial

భక్తుల చేతుల్లో ఇప్పుడూ అదే ‘ఆల్ఫా’ లడ్డు..

  • ఆల్ఫాకు హలాల్ సర్టిఫికెట్

  • హలాల్ సర్టిఫికెట్ ఉన్న కంపెనీకి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇస్తారు?

  • అదే లడ్డు.. అదే కంపెనీ.. ఈఓలు ఛేంజ్

  • నెయ్యి టెండర్లలో ఎల్-1గా కర్నాటక నందిని కంపెనీ

  • ఎల్-2గా ఢిల్లీ ఆల్ఫా కంపెనీ

  • రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు దక్కించుకున్న ఆల్ఫా

  • టెండరు విధానంలో సీవీసీ నిబంధనలకు పాతర

  • కిలో నెయ్యి 530 రూపాయలకు ఇస్తానన్న ఆల్ఫా

  • బేరసారాలతో వెనక్కి తగ్గి కిలో 475 రూపాయలకే ఇస్తానన్న నందిని

  • సీఎం సిద్దరామయ్య జోక్యంతో పట్టుదిగిన నందిని

  • కిలోకి 20 రూపాయల నష్టమైనా భక్తితో రేటు తగ్గించిన నందిని

  • అయినా ఆల్ఫాకే నెయ్యి టెండరు కట్టబెట్టిన టీటీడీ

  • ఇంకా ఆల్ఫాకు 65శాతం నెయ్యి కాంట్రాక్టు

  • ఎల్ 1గా వచ్చిన నందినికి 35 శాతమే కేటాయింపు

  • రివర్స్ టెండరింగ్ రద్దు చేసినా మళ్లీ ‘ఆల్ఫా’కే దక్కిన నెయ్యి టెండరు

  • టెండరు రద్దు చేయకుండా కొనసాగించిన టీటీడీ అధికారులు

  • కూటమి వచ్చినా లడ్డు తయారీలో మళ్లీ ఆల్ఫా కంపెనీ నెయ్యి

  • టీటీడీ బాసులు చంద్రబాబును అప్రతిష్ఠపాలుచేస్తున్నారా?

  • ధర్మారెడ్డి బాటలో టీటీడీ కొత్త బాసులు?

  • దేవదాయ శాఖ మంత్రి ఉన్నారా? నిద్రపోతున్నారా?

  • సోషల్‌మీడియాలో భక్తుల ఆగ్రహం

( మార్తి సుబ్రహ్మణ్యం)

అమ్మ దగ్గర కింద పడుకున్నా ఒకటే. అయ్య దగ్గర నేలమీద పడుకున్నా ఒకటేనన్నది సామెత. జగన్ పాలనలో గొడ్డు-పందిమాంసం ఆయిల్‌ను… తిరుమల శ్రీవారి లడ్లలో కలుపుతోందన్నది, దాన్ని టీటీడీకి సరఫరా చేస్తున్న ఆల్ఫా కంపెనీపై ఉన్న ప్రధాన ఆరోపణ. మరిప్పుడు అదే ఆల్ఫా కంపెనీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. అంటే అమ్మ దగ్గర కింద పడుకున్నా ఒకటే. అయ్య దగ్గర నేలమీద పడుకున్నా ఒకటేనన్నది సామెత టీటీడీ టెండరుకూ వర్తిస్తుందన్నమాట. ఏ రాయైతే ఏమిటి.. పళ్లు రాలగొట్టుకోవడానికి?! ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది.

కర్నాటక మిల్క్ ఫెడరేషన్.. కెఎంఎఫ్. వాటి ఉత్పత్తుల పేరు నందిని. ఇది కర్నాటక రైతుల సహకార సొసైటీ. అంటే కర్నాటక ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఆవునెయ్యిలో నందిని ఒక బ్రాండ్. ఆవు నెయ్యి నాణ్యతలో దానిని మించిన కంపెనీ లేదు. తిరుమల శ్రీవారి భక్తులకు ఇచ్చే లడ్డులో వాడే ఆవునెయ్యిని.. కొన్ని దశాబ్దాల పాటు, ఆ నందిని కంపెనీయే సరఫరా చేసేది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తాము అడిగిన కమిషన్లు ఇవ్వదన్న కారణంతో ప్రభుత్వ సంస్థ అయిన నందినీని పక్కన పెట్టి, రివర్స్ టెండరింగ్ పేరుతో, తమకు నచ్చిన ‘ఆల్ఫా’ కంపెనీని తెచ్చారు. అంటే.. ఇప్పుడు లడ్డుల్లో గొడ్డు-పందిమాంసం ఆయిల్ అంటూ.. నానా రచ్చ చేస్తున్న వివాదానికి సూత్రధారి, అదే ఆల్ఫా కంపెనీ అన్నమాట. ఇదంతా కొండమీద వెలిగిన ‘రెడ్డిరాజ్యం’ ఉన్నప్పటి కథ.

మరి సర్కారు మారి కూటమి కొలువు దీరిన తర్వాతయినా, టీటీడీ బాసులు ‘ఆల్ఫా’ను మెడబట్టి గెంటేయాలి కదా?.. కానీ అలా జరగలేదు. పైగా అదే ఆల్ఫాకు నెయ్యి టెండరు రివర్సుటెండరింగ్ ద్వారా, పువ్వుల్లో పెట్టి అప్పగించారు. నిజానికి అప్పటికే టెండరు నోటీసు ఇచ్చినప్పటికీ, దానిని రద్దు చేసే అధికారం టీటీడీకి ఉంది. అంటే.. ధర్మారెడ్డి బాటలో శ్యామలరావు సాబ్ కూడా నడిచారన్నమాట.

సూటిగా ఒక్కముక్కలో చెప్పాలంటే.. జగన్ జమానాలో ఆవు నెయ్యి టెండరును కారుచౌకగా దక్కించుని, లడ్లలో వాడిన నెయ్యిలో గొడ్డు-పంది కొవ్వు- మైదా కలిపారన్న ‘ఆల్ఫా ఘనత’ను ఏ నివేదికయితే తేల్చిందో.. అదే ఆల్ఫా కంపెనీ టీటీడీకి ఇప్పుడూ అదే నెయ్యి సరఫరా చేస్తుందన్నమాట. ఆ ప్రకారంగా ఇప్పుడు భక్తులు తింటున్న లడ్ల మాటేమిటి? అదే అపచారం.. అదే కిరాతకం ఇంకా కొనసాగుతోందన్నమాటే కదా?

అంటే.. టీడీ డీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వ్యూహాత్మకంగా మోసం చేస్తున్నారా? మళ్లీ అదే కంపెనీ నేతిని 65 శాతం వాడుతూ, చంద్రబాబు ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారా? లడ్లలో అపచారం బయటపెట్టిన చంద్రబాబును అప్రతిష్ఠపాలు చేయడమే టీటీడీ అధికారుల లక్ష్యమా? ‘మరి మీ హయాంలోనూ అదే నెయ్యి వాడుతున్నారు కదా’ అని, తెలివిగా రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రం అందిస్తున్నారా?

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసినా, మళ్లీ అదే ఆల్ఫా కంపెనీకి కాంట్రాక్టు దక్కేలా చేశారంటే.. కొండపైన ఇంకా ధర్మారెడ్డి రాజ్యమే నడుస్తోందా? మళ్లీ కొత్తగా టెండర్లు ఎందుకు పిలవలేదు? కూటమి సర్కారులోనూ ఎల్-1గా వచ్చిన నందినీని కాదని, గొడ్డుమాంసం కలిపిన నెయ్యి సరఫరా చేస్తోందని ఆరోపణలెదుర్కొన్న అదే ఆల్ఫాకు టెండరు ఎలా కట్టబెట్టారు? అసలు దేవదాయశాఖ మంత్రి ఉన్నారా? నిద్రపోతున్నారా? ఇవీ.. భక్తప్రపంచం సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.

తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడూ లడ్డు ప్రసాదాన్ని భక్తితో ఆరగిస్తాడు. అంతేకాదు. తన తాహతుకు తగినన్ని లడ్లు కొని మరీ, తమ బంధుమిత్రులకు పంచుతుంటాడు. వారు కూడా తాము తిరుమలకు వెళ్లినంత ఆనందంతో, లడ్డును భక్తితో కళ్లకద్దుకుని ఆస్వాదిస్తారు.

పరాయి రాష్ట్రాలు, పరాయి దేశాల్లో అయితే బాలాజీ లడ్డు అంటే ప్రాణం పెడతారు. ముంబయి, ఢిల్లీ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే.. ఆ బాలాజీ లడ్డు ఇచ్చిన భక్తుడిని దేవుడిలా భావిస్తారు. అంత పరమపవిత్రమైన ఆ బాలాజీ లడ్డులో.. గొడ్డు-పంది కొవ్వు- మైదా కలిపారన్న ఆరోపణలు వినే హిందూ భక్తుల హృదయాలు, ఎంత భగ్గుమంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. హిందూ సమాజం ఆవేశంతో రగిలిపోతోంది. ఉత్తరాది-దక్షిణాది..రాష్ట్రాలు-ప్రాంతాలతో సంబంధం లేకుండా హిందువులు రోడ్డెక్కారు. జగన్ దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు.

లడ్ల తయారీలో జరుగుతున్న ఈ అపచారాన్ని బయటపెట్టింది ఎవరో కాదు. స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు. ఆ నివేదిక కూడా అదే చెప్పింది. విచిత్రంగా ఇంకా ఇప్పటికీ అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ఫా కంపెనీకే, నెయ్యి కాంట్రాక్టు కొనసాగిస్తున్నారన్న వార్త, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలుచేస్తోంది.

పాలకులు మారినా, అధికారులదే రాజ్యమన్న సిద్ధాంతమే ఇప్పుడు కొండపైనా రుజువయింది. ఎల్ 1గా వచ్చిన కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందినికి కాకుండా, ఎల్-2గా వచ్చిన ఆల్ఫా కంపెనీకే మళ్లీ ఆవునెయ్యి కాంట్రాక్టు కొనసాగించడం ద్వారా.. టీటీడీ అధికారులు, ప్రభుత్వ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసినట్టయింది.

నిజానికి ఆవు నెయ్యి కోసం గత ఆగస్టులో టె ండరు ప్రకటన విడుదల చేశారు. ఆ మేరకు కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని ఎల్-1, ఆల్ఫా కంపెనీ ఎల్-2గా వచ్చాయి. కిలో ఆవునెయ్యిని నందిని కంపెనీ 475 రూపాయలు కోట్ చేస్తే, ఆల్ఫా కంపెనీ 530 రూపాయలకు కోట్ చేసింది.

కానీ అధికారులు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేసింది. అక్కడే కథ అడ్డం తిరిగి, కొత్త కథ మొదలయింది. రివర్స్ టెండరింగ్‌లో ఆల్ఫా కంపెనీ కిలో నెయ్యి రేటును, 450 రూపాయలకే ఇచ్చేందుకు అంగీకరించింది. దీనితో కర్నాటక నందిని కంపెనీ వెనక్కి తగ్గింది. ఈ విషయం తెలుసుకున్న కర్నాటక సీఎం సిద్దరామయ్య, అధికారులను పిలిచి వారితో చర్చించారు.

స్వామివారి ప్రసాదంలో మన రాష్ట్ర రైతులు తయారుచేసిన నెయ్యి ఉండటం మన అదృష్టమని నచ్చచెప్పి.. బేరసారాల సందర్భంగా రేటు తగ్గించయినా, లడ్లలో మన రాష్ట్ర నెయ్యినే వాడేలా చూడాలని ఆదేశించారు. దానితో నందిని కంపెనీ అధికారులు కూడా 450 రూపాయలకే తాము కూడా నెయ్యి సరఫరా చేస్తామని అంగీకరించారు. అయితే టీటీడీ అధికారులు మాత్రం.. ఎల్-2గా వచ్చిన ఆల్ఫా కంపెనీకే కాంట్రాక్టు కట్టబెట్టారు.

తర్వాత మళ్లీ టీటీడీ అధికారులే మనసు మార్చుకుని, ఎల్-1గా వచ్చిన నందినీ కంపెనీకి 35 శాతం మేరకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు ఇస్తూ… ఫైల్ నెంబర్ టిటిడి-34022(31)/160/2024- ప్రొక్యూర్‌మెంట్‌సెక్షన్-టీటీడీ పేరుతో రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ఆరకంగా ఆల్ఫాకు 65 శాతం, నందినికి 35 శాతం సరఫరా కాంట్రాక్టు సర్దుబాటు చేశారన్నమాట. సీవీసీ నిబంధనల ప్రకారం.. రేటు తగ్గించిన ఎల్-1కే కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉండగా, ఎల్-2కు కేటాయించిన టీటీడీ అధికారుల అజెండా ఏమిటన్నది సుస్పష్టం.

పోనీ టీటీడీ బాసులు పెద్దమనుసుతో ఇచ్చిన ఈ ఆల్ఫా కంపెనీ ఏమైనా, నెయ్యి ఉత్పత్తి చేస్తుందా అదీ లేదు. ఆల్ఫా అనేది ఒక ట్రేడింగ్ కంపెనీ. నె య్యి తయారుచేసే డైరీఫాం కంపెనీల నుంచి కొనుగోలు చేసి, దానికి తన కంపెనీ బ్రాండ్ తగిలించి, వ్యాపారం చేస్తుందన్నమాట. మరి నెయ్యి ఉత్పత్తి చేసే ప్రతిష్టాత్మక నందినికి కాకుండా.. ఎక్కడె క్కడి కంపెనీల నుంచి నెయ్యి సేకరించే ఆల్ఫాకు , 65 శాతం సరఫరా కాంట్రాక్టు ఎలా ఇచ్చారో ఇప్పటి టీడీటీ అధికారులే సెలవివ్వాలి. పైగా నందిని అనేది పక్కనే సరిహద్దులో ఉన్న కర్నాటక కంపెనీ. నె య్యి ట్యాంకర్లు అవసరమైతే, గంటల వ్యవధిలో తిరుమలకు తరలించవచ్చు. అదే ఢిల్లీలోని ఆల్ఫా కంపెనీ తన లారీలను ఎప్పుడు పంపిస్తే, ఎప్పుడు తిరుమలకు వస్తాయన్న కనీస స్పృహ-విజ్ఞానం కూడా, టీటీడీ బాసులకు లేకపోవడమే వింత. పైగా ఇది యుపీలో మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సన్నిహితుడైన కంపెనీ అని చెబుతున్నారు.

పోనీ.. ఆల్ఫా కంపెనీ సరఫరా చేసే నెయ్యిలో.. గొడ్డు-పంది కొవ్వు ఉందని, గుజరాత్ ల్యాబ్ నిర్ధారించిన తర్వాతయినా టీటీడీ బాసులు మేల్కొని.. దాని కాంట్రాక్టు రద్దు చేయకపోవడమే ఆశ్చర్యం. లడ్ల తయారీలో జరుగుతున్న కిరాతకాలను స్వయంగా చంద్రబాబు బయట ప్రపంచానికి చెప్పేంతవరకూ, టీటీడీ బాసులకు అది తెలియకపోవడం ఒక దుర్మార్గమైతే.. తెలిసిన తర్వాత కూడా, వాటి కాంట్రాక్టు రద్దు చేయకపోవడం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనం.

ఇంకో దారుణమేమిటంటే.. తిరుమల లడ్లలో నెయ్యి సరఫరా చేస్తున్న ఆల్ఫా అనే కంపెనీకి, హలాల్ సర్టిఫికెట్ ఉండటం. మాంసం తయారుచేసి, వాటిని ఎగుమతి చేసే కంపెనీలకే హలాల్ సర్టిఫికెట్ ఇస్తుంటారు. మరి అలాంటి హలాల్ సర్టిఫికె ట్ ఉన్న ఆల్ఫా కంపెనీకి, హిందువులు భక్తితో పూజించే తిరుమల ప్రసాదం తయారీకి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇచ్చారన్నదే ప్రశ్న.

అంటే దీన్ని బట్టి.. ప్రభుత్వ ప్రతిష్ట ఎలా మంటకలిసినా టీటీడీ బాసులకు అనవసరమన్నమాట. ఇలాంటి దారుణాలు బయటకు వస్తే, ప్రభుత్వ ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతింటుందని భయపడి, దిద్దుబాటుకు దిగలేదంటే.. చంద్రబాబునాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సిద్ధమయినట్లు కనిపిస్తూనే ఉంది. అంటే.. అంతా అనుకున్నట్లు.. ఇప్పటికీ కొండపై ధర్మారెడ్టి రాజ్యమే నడుస్తోందా?!

కాగా తాజా పరిణామాల నేపథ్యంలో.. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏం చేస్తున్నారంటూ, సోషల్‌మీడియాలో హిందువులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రిగారు పనిచేస్తున్నారా? నిద్రపోతున్నారా? టీటీడీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదా? లేదా పట్టించుకోరా? ఆ రెండూ కాకపోతే టీటీడీలో జోక్యం చేసుకునేంత సీన్ లేదా? ముందు ఆ ఆల్ఫా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయించండి సార్.. అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

కాగా దీనికి సంబంధించి చంద్రబాబునాయుడు బయటపెట్టిన రహస్యాన్ని, జాతీయ-రాష్ట్ర స్థాయి మీడియా దృష్టికి వెళుతున్న టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, టీటీడీ నేత, బలిజనాడు క న్వీనర్ డాక్టర్ ఓవి రమణ.. టీటీడీలో జరుగుతున్న ఇలాంటి అకృత్యాలను ఈఓ, జేఈఓ దృష్టికి తీసుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీటీడీ వ్యవహారాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న రమణ.. గతంలో పర్చేంజికమిటీలో కూడా పనిచేశారు. నిజానికి ఆల్ఫాకు నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడాన్ని ఆయన తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. లడ్డు తయారీలో బటర్ ఎలా వాడతారని రమణ గతంలోనే నిలదీసిన విషయం తెలిసిందే.
Supply-Order-KMF-35-1-1-1
Supply-Order-KMF-35-1-2

LEAVE A RESPONSE