– విదేశీ సంస్థలను వెళ్ళగొట్టి మొత్తం కేవీ రావు సంస్థలకే దారాదత్తం చేశారు
– యాంకరేజీ పోర్ట్ ను ప్రభుత్వం నిర్వహిస్తుంటే, సీపోర్ట్ మాత్రం కేవీరావు సంస్థకు ఇవ్వడం వెనుక బాబు స్వప్రయోజనాలు
– బలవంతంగా వాటాలు గుంజుకున్నారని ఎందుకు కేవీరావు ఆనాడు ఫిర్యాదు చేయలేదు?
– కేవీ రావు అనే వ్యక్తి వచ్చిన తరువాతే కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ బియ్యం రవాణా పెరిగిపోయిందని ఆనాడు పవన్ ఆరోపించారు
– బాబు ప్రభుత్వంలో ఉండటం వల్ల, అరబిందో వాటాలు తీసుకున్న తరువాత అంటూ మాట మారుస్తున్నాడు
– కాకినాడ పోర్ట్, ఎస్ఇజెడ్ పై కూటమి రాజకీయం
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు, వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుందని మాజీమంత్రి, వైయస్ఆర్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే… 2003లో తొండింగి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్ భూములను ఎపిఐఐసికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.
2005లో వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత ఈ ప్రాంతంలో ఎస్ఇజెడ్ ను ప్రతిపాదించారు. ఇందుకోసం 8120 ఎకరాలను సేకరించారు. ఎకరానికి రూ.3 లక్షలు పరిహారంగా రైతులకు చెల్లించారు. ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు వ్యతిరేకించారు.
ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో కాలుష్య కారక పరిశ్రమలను ఇక్కడకు రానివ్వను, రైతుల భూములను తిరిగి వారికి అప్పగిస్తానంటూ హామీలు గుప్పించారు. భూపోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా 2012లో ఏకంగా ఏరువాకలో సైతం పాల్గొన్నారు.
2014లో అధికారంలోకి రాగానే గతంలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరిచిపోయారు. ఎస్ఇజెడ్ ను మరింత విస్తృతం చేసేందుకు తొండంగి మండలంలో 2008లో ఎపిఐఐసికి కేటాయించిన 2094 ఎకరాలను ఎస్ఇజెడ్ కు కట్టబెట్టారు.
దీనిలో 1397 ఎకరాల అసైన్డ్ భూమి, 72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అసైన్డ్ భూమిని ఎస్ఇజెడ్ కు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవంటూ అభ్యంతరం చెప్పిన ఆనాటి సీనియర్ ఐఎఎస్ అధికారి ఠక్కర్ మాటలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. దీని నుంచే 505 ఎకరాల భూమిని దివీస్ కంపెనీకి కేటాయించారు.
చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. 2180 ఎకరాలను ఎస్ఇజెడ్ కు ఇచ్చేందుకు పలువురు రైతులు నిరాకరించారు. తమ భూములను దున్నుకునేందుకు వెళ్ళిన రైతులపై చంద్రబాబు పోలీసులను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేసి, రాజమండ్రి జైలుకు తరించారు. వారితో బాత్రూంలు కడిగించి, పలు రకాలుగా వేధించారు. కనీసం 2013 నాటి భూసేకరణ చట్టం కింద అయినా పరిహారం ఇవ్వాలన్న రైతుల కోరికను చంద్రబాబు నిరాకరించారు.
ఎస్ఇజెడ్ కు భూములను బలవంతంగా కట్టబెట్టేందుకు ఏకంగా తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించాలని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామసభల ద్వారా ఎస్ఇజెడ్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తారనే భయంతో ఆనాడు పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేష్ 73, 74 అధికారణ కింద పంచాయతీలకు ఉన్న హక్కులను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు వేరే వారికి భూములు అమ్ముకోకుండా ఉండేందుకు ఏకంగా వారి భూములను చంద్రబాబు ప్రభుత్వం నిషేద భూముల జాబితాలో పెట్టి ఆనందం పొందింది.
పాదయాత్రలో భాగంగా జగన్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎస్ఇజెడ్ భూముల బాధిత రైతులు ఆయనను కలిశారు. ఆనాడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను. వారి బాధలను విన్న జగన్ ప్రతిపక్ష నేతగా పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సంబంధించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని వాగ్ధానం చేశారు.
అధికారంలోకి రాగానే దీనిపై నా నేతృత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు .ఈ కమిటీ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పలుసార్లు చర్చలు జరిపింది. అనంతరం 2021లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాం. దాని ప్రకారం ఎస్ఇజెడ్ కు రిజిస్టర్ చేయకుండా ఉన్న 2180 ఎకరాల భూమి ని రైతులకు తిరిగి ఇచ్చివేయాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆరు గ్రామాలను తరలించాలనే ప్రతిపాదనను విరమించాలని, శ్రీరాంపురం, బండిపేట, ఉమ్మడివారికోడు, రావివారికోడు, రామరాఘవాపురం, తాటివారిపాలెం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని కమిటీ సిఫార్స్ చేసింది. అంతకు ముందు భూసేకరణలో భాగంగా స్మశానాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలను కూడా తీసుకున్నారు. సేకరించిన శ్మశాన భూములను అప్పగించాలని, 2180 ఎకరాల రైతుల భూమిని నిషేదిత జాబితా 22ఎ నుంచి తొలగించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిఫార్స్ చేశాం. వీటిని జగన్ నేతృత్వంలో కేబినెట్ ఆమోదించింది.
రైతులు తమకు తిరిగి దక్కిన భూమిని వారి అవసరాల కోసం ఇతరులకు అమ్ముకున్నారు. దాడిశెట్టి రాజా, పిఠాపురంకు చెందిన కొందరు ఈ భూములను కొనుగోలు చేసి ఉంటారు. అంతమాత్రాన రైతులను బెదిరించి భూములను లాక్కున్నారంటూ బుదరచల్లుతారా? రైతులకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బు ఇచ్చిన తరువాత కొనుగోలు చేయడం కూడా అక్రమమే అవుతుందా?
కాకినాడ సీ పోర్ట్ లో రెండు కంపెనీల మధ్య వాటాల కొనుగోలును చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి లావేదేవీలు ఎప్పుడూ జరగలేదా? కేవీ రావును బెదరించి వాటాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అలా అయితే మొత్తం వాటాలు తీసుకునేవారు కాదా? కేవలం 41 శాతం తీసుకుని, మిగిలినవి కెవి రావు చేతుల్లోనే ఉంచుతారా? నేటికీ కేవీ రావు చేతుల్లోనే సీపోర్ట్ యాజమాన్యం ఉంది. అజమాయిషీ వారిదే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు బలవంతంగా వాటాలు గుంజుకున్నారని ఎందుకు కేవీరావు ఆనాడు ఫిర్యాదు చేయలేదు?
కాకినాడ సీ-పోర్ట్ ను సైతం చంద్రబాబు కుట్రపూరితంగానే కేవీ రావుకు దక్కేలా చేశాడు. సీ-పోర్ట్ నిర్వహణకు ముందుగా విదేశీ కంపెనీలను తీసుకువచ్చి, కేవీరావు సంస్థలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత విదేశీ సంస్థలను వెళ్ళగొట్టి, మొత్తం కేవీ రావు సంస్థలకే దారాదత్తం చేశారు. యాంకరేజీ పోర్ట్ ను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంటే, సీపోర్ట్ మాత్రం కేవీరావు సంస్థకు ఇవ్వడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన కేవీ రావుకు పోర్ట్ వ్యాపారాల్లో ఎటువంటి అనుభవం లేదు. అటువంటి వ్యక్తితో ఇప్పుడు చంద్రబాబు బలవంతంగా వాటాలు తీసుకున్నారు అని ఫిర్యాదు చేయిస్తున్నాడు.
కేవీ రావుపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు మరిచిపోయారా?
కాకినాడ యాంకరేజీ పోర్ట్ నుంచి ఎక్కువగా బియ్యం ఎగుమతి అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్ లు ఈ పోర్ట్ ను తనిఖీ చేసిన తరువాత, అరబిందో సంస్థ డీప్ సీ పోర్ట్ లో వాటాలు తీసుకున్న తరువాత నుంచే పీడీఎస్ బియ్యంను ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా చేయడం ఎక్కువైందని ప్రకటనలు చేశారు. డీప్ సీ పోర్ట్ యాజమాన్యం కేవీ రావు చేతుల్లోనే ఉంది. ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు.
రాష్ట్రంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు తెలుగుదేశం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు. ఇవ్వన్నీనిజాలు అయితే, వైయస్ఆర్ సిపిపై బుదరచల్లేలా వారు అబద్దాలు మాట్లాడటం దారుణం. 2019లో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఏం మాట్లాడారో మరిచిపోయారా? కేవీ రావు అనే వ్యక్తి వచ్చిన తరువాతే కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ బియ్యం రవాణా పెరిగిపోయిందని ఆనాడు పవన్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండటం వల్ల, అరబిందో వాటాలు తీసుకున్న తరువాత అంటూ మాట మారుస్తున్నాడు.