Suryaa.co.in

Telangana

ఆశా వర్కర్ లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవి:తలసాని

ఆశా వర్కర్ లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ పాన్ బజార్ లో గల అర్బన్ ఫ్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)లో ఆశా వర్కర్ లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేశారు.

ముందుగా UPHC లో వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 ICU బెడ్స్ వార్డ్ ను ప్రారంభించారు. 33 లక్షల రూపాయల విలువ చేసే ICU బెడ్స్, ఆక్సిజన్ సిలెండర్ లు, తదితర పరికరాల అందజేసిన సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ ల అభివృద్ధి కోసం, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు కు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయినా స్వచ్చంద సంస్థలు చేయూత ను అందించడం అభినందనీయం అన్నారు.

ఇక్కడికి వచ్చే వారికోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఈ హాస్పిటల్ ను దత్తత తీసుకోవాలని వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఉపాధ్యక్షుడు భూషణ్ రెడ్డి ని కోరారు. హాస్పిటల్ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపడతామని ప్రకటించారు. కరోనా క్లిష్ట సమయంలో ఆశా వర్కర్ లు శానిటేషన్ సిబ్బంది ఎంతో సేవలు అందించారని ప్రశంసించారు. వారి సేవలు గుర్తించి దేశంలో ఎక్కడా లేని వేతనాలు అందిస్తున్న గొప్ప నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కూడా ఆశా వర్కర్ ల సేవలు ఎనలేనివని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం హైదరాబాద్ జిల్లాలో ని 1385 మంది ఆశా వర్కర్ లకు కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్ లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, కావాల్సిన పరికరాల కు సంబంధించి వారం రోజుల లో నివేదిక అందజేయాలని DM&HO వెంకట్ ను మంత్రి ఆదేశించారు.

హాస్పిటల్ ను తమ ఇంటిలా భావించి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడికి వచ్చే వారికి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, డిప్యూటీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE