Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాపాలే మాకు శాపాలుగా మారాయ్‌

– వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

అంజనాపురం: పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం అంజనాపురం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంజనాపురంలో ఒక డయేరియా మరణం కూడా సంభవించలేదని, మంచినీటి బోరులో మురుగునీరు కలిసి నీరు కలుషితమై 18 డయేరియా కేసులు నమోదు అయ్యాయని ఒక ప్రాథమిక నివేదిక అందిందని మంత్రి తెలిపారు. మేం అధికారంలోకి వచ్చే సమయానికి వైద్య శాఖలో 2,500 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉన్నాయి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని అయిదేళ్ళ కాలంలో 10,30,575 మంది అతిసార బారిన పడ్డారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మీరుగాని మీ మంత్రులు గాని ఆ ప్రదేశాన్ని సందర్శించడం కానీ, బాధితులను పరామర్శించడం కాని, వారికి వైద్య సహాయం అందించడం గాని చేశారా? ఇప్పుడొచ్చి శవ రాజకీయలు ఎందుకు చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఆస్తి పంపకాల విషయాలను డైవర్ట్ చేయటానికి ఇలా శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ఈ విషయం తెలిసే వెంటనే పై అధికారులకు తెలియజేయకపోవడం బాధ్యత రాహిత్యంతో వ్యవహరించడంతో నోటీసులు అందించాం. గత రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి అంజనాయపురం కాలనీలో డోర్ టు డోర్ సర్వే చేసి వైద్య సేవ అందిస్తున్నారని మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ తెలిపారు. కాగా, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మంత్రి పర్యటనలో కలెక్టర్ పి.అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు, తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE