– బీసీ రిజర్వేషన్లపై కోర్టు విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల హడావుడి
– “న్యాయ పరిణామాలను పక్కనపెట్టి షెడ్యూల్ ప్రకటిస్తే అది బీసీల హక్కులపై బహిరంగ ఘాతం”
– 42% బీసీ రిజర్వేషన్ల అంశం Sub Judice లో ఉండగానే షెడ్యూల్ ప్రకటన అనుచితం
– ₹200 కోట్లు ఖర్చు
– ఒక్క అధికారిక నివేదిక లేదు
– షెడ్యూల్ విడుదల చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం గౌరవ న్యాయస్థానాల్లో విచారణలో కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు హడావుడిగా ముందుకు రావడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-K ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, తాజా చర్యలు ఆ స్వతంత్రతపై గాఢమైన సందేహాలు కలిగిస్తున్నాయని అన్నారు.
న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశంపై తుది తీర్పు వెలువడే వరకు స్టేటస్ కో కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. GO Ms No.9పై ఇప్పటికే హైకోర్టు మరియు సుప్రీంకోర్టుల్లో స్టే అమల్లో ఉండగా, GO 46 ఆధారంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం “Doctrine of Judicial Propriety”కు వ్యతిరేకమని, ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కులను (Article 14) ఉల్లంఘించే చర్యగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ కులగణన పేరుతో రూ.200 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి కూడా ఇప్పటివరకు అధికారిక నివేదిక విడుదల చేయకపోవడం పరిపాలనా స్వేచ్ఛాదుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలను తీసుకుంటూ, బీసీల విషయంలో మాత్రం 2024 గణాంకాలను చూపడం వివక్షతో కూడిన విధానమని చెప్పారు. డిసెంబర్ 12న తుది తీర్పు వెలువడే వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను వాయిదా వేయాలని, లేకపోతే అది బీసీల రాజ్యాంగ హక్కులపై ప్రత్యక్ష దాడిగా మారుతుందని హెచ్చరించారు. “రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ప్రజాస్వామ్యంపై దాడి. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు లోబడకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.”