– పాడి రైతులకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
– రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాడి రైతులకు 4రూపాయల ఇన్సెంటివ్
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం, రావిర్యాల గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయ డైరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర పశు సంవర్థక శాఖ, సినీమా ఫోటోగ్రఫీ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనులు, భూగర్బ శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి ప్రాంరభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీని కాపాడుకోవాలనే ధృడ సంకల్పంతో రెండు సంవత్సరములలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగానికి సంబంధించి దేశంలో పాడి పంట ఇబ్బంది వచ్చినప్పుడు పాడి పైన ఆధార పడే సన్నకారు చిన్నకారు రైతాంగానికి చేయూత నివ్వాలనే సంకల్పంతో విజయ డైరీ ప్రారంభమైనదని 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయ డైరీ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
అప్పట్లో ఒక లక్ష లీటర్ల పాలు సేకరించేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో రైతాంగాన్ని ప్రోత్సహించి ఆర్థికంగా తోడ్పాటు నందించి దేశంలో ఫ్రైవేట్ పోటీ రంగంలో విజయ డైరీ మొదటి స్థానంలో ఉందన్నారు. 2014 లో 300 కోట్ల టర్నోవర్ ఉండేదని నేడు 750 కోట్ల టర్నోవర్ తో విజయ తెలంగాణ ముందుకు వెళుతుందన్నారు. నాలుగున్నర లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు 18 పంటలకు రైతు బంధు పథకం ద్వారా 73 వేల కోట్లు, రైతు భీమా ద్వారా 1500 కోట్లు, రైతు రుణమాఫీ 21 వేల కోట్లు, 24 గంటల ఉచిత కరెంటు కోసం సంవత్సరానికి 10 వేల కోట్లు నెలకు వెయ్యి కోట్లు,పాడి రైతులకు 350 కోట్ల ఇన్సెంటివ్ అందజేయడం జరిగిందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన ఆలోచనతో రైతులను ప్రోత్సహించుటకు హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేతా విప్లవం, గులాబీ విప్లవం, పసుపు విప్లవం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేసారని అన్నారు. ఈ విప్లవాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అన్నారు.
హరిత విప్లవం: రాష్ట్రంలో 2014కు ముందు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించడం జరిగేదని, రాష్ట్రము ఏర్పడిన తరువాత 3.50 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పంటలు విస్తృతంగా దిగుబడి చేసుకోని పంజాబ్, హరియాణా రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
నీలి విప్లవం: రాష్ట్రంలోని మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీసి వాటిలో కోట్లాది చేప పిల్లలను పెంచి మత్స సంపదను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. శ్వేతా విప్లవం ద్వారా 1. 50 లక్షల లీటర్ల నుండి 4 లక్షల లీటర్ల పాలు సేకరించే స్థాయి ఎదిగిందని అన్నారు.
గులాబీ విప్లవం ద్వారా 11 వేల కోట్ల రూపాయలుతో గొల్ల కురుమల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గొర్రెలను ఇవ్వడం జరిగిందని అన్నారు. పసుపు విప్లవం ద్వారా రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వృత్తి ఏదైనా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విజయ డైరీని బలోపేతం చేసుకొని దానిపైన వచ్చిన లాభాలు రైతులకు వస్తాయని తెలిపారు. ప్రతి పాడి రైతు విజయ డైరీకి పాలు ఇచ్చే విధంగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పాడి పశువులు, ఉచితంగా నట్టల మందు, మందులు ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.
విజయ డైరీ ఉత్పత్తులు 28 వరకు సంస్థలు ఉన్నాయని, మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ,ఢిల్లీ , ముంబయిలో డిమాండ్ ఉన్నాయని తెలిపారు. ఒకవైపున సన్నకారు చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ అదేవిధంగా వేలాదిమంది యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2000 అవుట్ లెట్లు ఉన్నాయని 600 పార్లర్లు వీటిని ఇంకా పెంపొందించు కుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు. 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో ఉన్నారన్నారు. చనిపోయిన గేదెల స్థానంలో ఇన్సూరెన్స్ ద్వారా గేదెలను అందజేస్తామని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. కుల వృత్తులను ప్రభుత్వం చేయూత నిస్తుందని అన్నారు. విజయ డైరీకి సంబందించిన 14రకాల ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేశారు.
పశుసంవర్ధక సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడి పంటలతో పాటు కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు విజయ డెయిరీ నష్టాల బాటలో ఉండేదని, అప్పుడు పాలను లక్ష లీటర్ల నుండి 4 లక్షల లీటర్ల వరకు సేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. పాడి రైతులకు 4 రూపాయలు ఇన్సెంటివ్ అందించడం జరుగుతుంది అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాడి రైతులకు 4రూపాయల ఇన్సెంటివ్ అందించడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, నవీన్, జిల్లా చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, టీఎ స్ఎస్ ఎల్డిఏ సీఈఓ మంజువాణి , జిల్లా కలెక్టర్ హరీష్, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమేహన్ , ప్రజాప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.