Suryaa.co.in

Andhra Pradesh

ప్రధాని నిష్క్రమించగానే, ఘర్షణలకు ప్రభుత్వం పథక రచన

-పిచ్చి వేషాలు వేస్తే తీవ్రంగా పర్యవసానాలు
-ప్రతిపక్షాలు, పార్టీలోని నేతలు రక్షణ కవచంగా నిలబడాలి
-అరెస్టుకు కుట్ర చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆజాద్ కా అమృత్ ఉత్సవాలలో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రధాని పర్యటన సందర్భంగా పిచ్చి వేషాలు వేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. నా దారిలో నేను వస్తా… నా దారిలో నేను వెళ్ళిపోతానని చెప్పారు.

ప్రభుత్వ పెద్దలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే, ప్రధాని సమక్షంలోనే తాను తన రక్షణ గురించి అభ్యర్థించాల్సి ఉంటుందని అన్నారు. భీమవరం లో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీ కార్యక్రమం కాదని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నే ఈ సభకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తనకు ప్రభుత్వం, పోలీసుల నుంచి ఉన్న హానిని గుర్తించి ప్రతిపక్ష పార్టీల నాయకులు, తమ పార్టీలోని అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పని చేసేవారు రక్షణ కవచంగా నిలబడాలని కోరారు.

మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ… ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తున్న తనకు, తాడేపల్లి ముష్కరులు, ఆంధ్ర కౌరవులు, దుష్ట చతుష్టయం నుంచి పొంచిఉన్న ఆపదను గుర్తించి అన్ని వర్గాల వారు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారో లేదో కానీ తాను మాత్రం కచ్చితంగా హాజరవుతానని చెప్పుకొచ్చారు. జగన్ సభలో పాల్గొంటే సరదాగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఆయన్ని చూసి పారిపోయే జనం, తనను , ప్రధాని మోడీని మాత్రం చూడాలని అనుకుంటారన్నారు. అందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరిన రఘురామకృష్ణం రాజు, రెండున్నర ఏళ్ల తర్వాత నియోజకవర్గానికి వస్తున్న తనని చూడడానికి తన అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉందని అన్నారు. సభకు డ్వాక్రా మహిళలను తరలించేందుకు అధికారులు ఆపసోపాలు పడొద్దని, ఈ సభకు స్వచ్ఛందంగానే ప్రజలు హాజరవుతారని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా తన ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదని, ఒకవేళ కడితే వాటిని తక్షణమే తొలగించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసిందన్నారు.

ప్రధాని పర్యటన సందర్భంగా తన ఫ్లెక్సీలను తన అభిమానులు కడతారని, ఫ్లెక్సీలను ఎలా పిక్కుంటారో చూద్దామన్నారు. భీమవరం లో జరిగే అల్లూరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు, తమ సాటి కులస్తులు వెళ్లగా… ఆ బృందం లోని ఒకరిద్దరిని పక్కకు పిలిచి “రాజు సభ కు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీ దే నని” రిక్వెస్ట్ లాంటి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసిందన్నారు. తమ కులస్తులు అల్లూరి స్ఫూర్తితో పని చేస్తారా?, ఆయన్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న రూథర్ఫర్డ్ స్ఫూర్తితో పని చేస్తారా? అన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు.

అల్లూరి ని అన్యాయంగా కాల్చి చంపిన రూథర్ఫర్డ్ ను బ్రిటిష్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పాలన కంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ పాలనే నయమనిపించేలా ఉందన్నారు. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తాను ప్రత్యేక హెలికాప్టర్ లో రావడానికి అనుమతించాలని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అయినా ఇంతవరకు కుంటి సాకులు చెబుతూ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

ప్రత్యేక హెలికాప్టర్లో రావడానికి అనుమతి ఇస్తే, తాను వచ్చి… ప్రధాని ప్రసంగం పూర్తి అయిన వెంటనే తిరిగి వెళ్ళిపోతానని చెప్పారు. ప్రధాని ప్రసంగించి భీమవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్ళిపోగానే, సభాస్థలిలో రెండు వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టించి, ఆ వైషమ్యాలకు కారణం తానేనని కేసులు పెట్టేంచెందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారన్న ఆయన , ఆ రోజు కాకుండా 5వ తేదీ తర్వాత ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. అల్లూరి పై గౌరవంతో నైనా, అభినవ రూథర్ఫర్డ్ లు తమ కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు.

ప్లీనరీ లకు ప్రజలు రావడం లేదు
తమ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు ప్రజలు హాజరు కావడం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యమంత్రి సభలకే కాదని, ప్లీనరీలో కూడా ప్రజలు వచ్చే పరిస్థితి లేదన్నారు. సత్తెనపల్లిలో రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేసిన కూడా, ప్రజలు ముఖము చాటేశారని పేర్కొన్నారు. సత్తెనపల్లి ప్లీనరీలో రికార్డింగ్ డాన్స్ ఏర్పాటుచేసిన వీడియోను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఇక ప్లీనరీ సమావేశాలకు తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించిన మట్ట వెంకటేష్ అనే నాయకున్నీ, పోలీస్ అధికారి బూటు కాళ్లతో తన్నడం దారుణమన్నారు. ఇదేనా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మట్ట వెంకటేష్ సదరు పోలీస్ అధికారి పై ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేస్తే అతను జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

రేపో మాపో థియేటర్లు మూత
రాష్ట్ర ప్రభుత్వం బుక్ మై షో ద్వారా టికెట్ల ను విక్రయించడానికి నిరసిస్తూ, ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో సినిమా థియేటర్లను మూసివేశారని, రేపో, మాపో రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు మూసివేయడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలు ఓటు వేసింది… సినిమా థియేటర్ల నిర్వహణ కోసమా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు టర్నోవర్ 1200 కోట్ల రూపాయలు అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి 100 నుంచి 120 కోట్ల రూపాయలు మాత్రమే పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. సినిమా థియేటర్ల కంటే ఇసుక, మద్యం పై నే ఆదాయం అధికంగా వస్తుందని, అటువంటి వాటిని పర్యవేక్షించడం పై కంటే శ్రద్ధను, సినిమా థియేటర్లపై ప్రదర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

సుప్రీం మార్గదర్శకాలను పాటించరా?
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు తక్షణమే బెయిలు మంజూరు చేయాలని కోరుతున్నారని, అయితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించరా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వాదనలు విన్న మూడు నెలల వ్యవధిలో తీర్పు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆరు నెలల లోపు ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తమ వాదనలు ముగిసి ఆరు నెలలు కావస్తోందనీ, అయినా ఇప్పటివరకు తీర్పు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై తమ తరపు న్యాయవాది హైకోర్టుకు లేఖ కూడా రాశారని పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు పై తాను వేసిన పిటిషన్ ఎలాగో కొట్టివేస్తారని తనకు తెలుసని చెప్పారు. హైకోర్టులో కొట్టివేస్తే తాను సుప్రీంకోర్టును ప్రజల పక్షాన ఆశ్రయిస్తానని తెలిపారు.

ప్రకటనల్లో 83 లక్షలు… ఇచ్చేది 43 లక్షలకా?
అమ్మ ఒడి పథకం రాష్ట్రంలోని 83 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నట్లుగా సాక్షి దినపత్రికలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుంటూ, కేవలం 43 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 43 లక్షల మంది విద్యార్థులకు కూడా నిజంగానే అందజేస్తున్నారన్నదానిపై పారదర్శకత లేదని చెప్పారు. ఇక 55 వేల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని అంద చేయలేకపోతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడిపోతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మందా ?… లేకపోతే ఒక జిల్లాలో నే 55 వేల మంది విద్యార్థులకు ఇవ్వలేకపోతున్నారా? అంటూ ప్రశ్నించారు.

తాను ఉదారంగా డబ్బులు ఇవ్వాలని అనుకుంటే, దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు అడ్డుకోవాలని చూస్తున్నారని… వారు ఏం పీక్కుంటావో పీక్కో వాలని ముఖ్యమంత్రి పరుష పదజాలంతో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ భాషనే విద్యార్థులు నేర్చుకోవాలా? అంటూ నిలదీశారు. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి వారివి ఏమైనా పీకాడా?… పీక్కో గలడా?? అంటూ ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంటర్మీడియట్ పుస్తకాల ముద్రణకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద 18 కోట్ల రూపాయలు లేకపోవడం విడ్డూరంగా ఉందని, పుస్తకాల ముద్రణ బాధ్యతలను టిటి డి కి అప్పగించాలని చూసిందని పేర్కొన్నారు.

అయితే ఇటీవలే పదవీకాలం పొడిగించబడిన టిటిడి ఈ వో ధర్మారెడ్డి మాత్రం, ఈ ప్రతిపాదనను తిరస్కరించారన్నారు. గతంలో 9 10 వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, తాను ఎలాగో ముఖ్యమంత్రి విద్యార్థులకు ట్యా బులు ఇవ్వలే డని భావించానని, తన నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వమ్ము చేయలేదని ఎద్దేవా చేశారు. ఇక అమ్మ ఒడి పథకం లో భాగంగా 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి, బాత్ రూమ్ క్లీనింగ్, స్కూలు నిర్వహణ నిమిత్తమని రెండువేల రూపాయల కోత విధిస్తున్నారని తెలిపారు. మరి ఎన్ని ప్రైవేటు పాఠశాలల బాత్రూమ్లను క్లీన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరో వెయ్యి రూపాయలు కట్ చేసి పుస్తకాలను ముద్రిస్తే బాగుంటుంది… కదా అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

మోడీ ప్రసంగాన్ని జగన్ అనువదిస్తాడేమోనని ప్రజల ఆందోళన
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రధాన మంత్రి మోడీ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అనువ ది స్తారో నని , ఆయన భాషా ప్రావీణ్యం గురించి తెలిసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రధాని మోడీ హిందీలో ప్రసంగిస్తారని ఆయన ప్రసంగాన్ని తెలుగులో మీరే అనువదించాలని తనకు వ్యక్తిగతంగా కొన్ని వందల మంది ఫోన్లు చేసి కోరారన్నారు. అయితే తనకు అంత పెద్దగా హిందీ రాదని, ఆయన ప్రసంగాన్ని పురంధరేశ్వరి లాంటివారు అనువదించే అవకాశం ఉందని చెప్పానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త తెలుగు భాషా పదాలను కనిపెడుతున్నందుకు ఆయనకు వీరతాళ్ళు వేయాల్సిందేనని చెప్పారు.

పీవీ, ముళ్ళపూడికి నివాళులు
బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను కొనియాడుతూ రఘురామకృష్ణంరాజు ఘనంగా నివాళులర్పించారు. అలాగే సినీ రచయిత ముల్లపూడి వెంకటరమణ కు కూడా రఘురామకృష్ణంరాజు నివాళులు అర్పిస్తూ ఆయన మాటలు రాసిన ముత్యాల ముగ్గు చిత్రంలోని డైలాగులను వల్ల వేశారు.

LEAVE A RESPONSE