Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలలోని హుండీలను ఏటీఎం మిషన్లలా వాడుకుంటోంది

– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్

రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలలోని హుండీలను ఏటీఎం మిషన్లలా వాడుకుంటోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

కాణిపాకం గుడిలో అభిషేకం రుసుము రూ.700 ఉంటే దాన్ని రూ.5వేలకు పెంచడం అన్యాయం. వెంటనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఆ ఆలయ ఈవోకు సంబంధం లేకపోయినప్పటికీ ఆయనను బలిపశువును చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అభిషేకం రుసుము పెంచితే అనవసరంగా ఆయనను ఇరికించారు. ప్రతి దేవాలయానికి ఒక పాలక మండలి ఉంటుంది. వారు చేసిన తీర్మానాన్నిప్రభుత్వం, ఎండోమెంట్ శాఖలు, అంగీకరిస్తేనే అది అమలులోకి వస్తాయి.

ఇందులో ఈవో స్వతహాగా ఏ విధంగా రుసుము పెంచగలడు?. చేయని తప్పుకు ఈవో శిక్ష అనుభవించారు. దేవాదాయ శాఖ మంత్రి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు దేవాదాయశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ప్రతి గుళ్లల్లోనూ దేవాలయాలలోని దేవుళ్లనుండి భక్తులను దూరం చేసేట్లు ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. ఇతర ఏ మతాల్లోనూ ఇలా ఉండదు. ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి జిల్లాలో దేవాలయాలలోని హుండీ ఆదాయాన్ని దేవాలయంవారే తీసుకొండని జీవో ఇచ్చారు. ఇలా వాడుకోమనడం అన్యాయం. అన్నప్రసాదానికి, క్యూలైన్ లు బాగుచేయడానికి, దేవుడికి కిరీటాలు తయారు చేయటానికి, ఆలయ పునరుద్ధణకు వాడాల్సిన భక్తుల హుండీ ఆదాయంతో దేవాలయాలలోని కార్యాలయాలకు ఏసీలు, ఫర్నీచర్ లు ఏర్పాటు చేసుకోవడమేంటి?

ఇలా జీవో విడుదల చేయడం వింతగా ఉంది. శ్రీశైలం లో 14 రకాల సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ అస్తమాన సేవలకు లక్ష రూపాయలు ఛార్జ్ చేయడం మరీ అన్యాయం. దేవాలయాల ఆదాయాన్ని అకౌంట్లకు మార్పిడి చేయడం జరుగుతోంది. ఇలా మార్పిడి చేసి దోచుకుంటున్నారు.

దుర్గమ్మ గుడిలో ఇదివరకు అంత్రాలయ దర్శనం ఉచితంగా ఉండేది. రూ.500 లు దర్శనాలకు పెట్టారు. 5 శ్లాట్ లలో పది గంటలు గంటకి 2 వేల మందిని అనుమతిస్తాం. గత ప్రభుత్వాలు ఉచిత దర్శనాలు పెడితే నేటి ప్రభుత్వం ప్రతి ఒక్కటి వ్యాపార ధోరణి అవలంబిస్తోంది. టీడీపీ ప్రభుత్వం సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం కేటాయిస్తే.. వైసీపీ ప్రభుత్వం మరీ వ్యాపార ధోరణి అవలంబిస్తోంది. దుర్గమ్మ గుడిలో అన్నదానానికి బ్రేక్ పెట్టడం మరీ అన్యాయం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అన్నప్రసాదం 50వేల నుంచి 60వేల వరకు మాత్రమే సరఫరా చేయగలం.

దసరా ఉత్సవాలకు భారీగా జనం వస్తారని అన్నప్రసాదానికి బ్రేక్ పెట్టడం అన్యాయం. భక్తులకు చాలామందికి అన్నప్రసాదంలో భాగస్వామ్యులవ్వాలని ఉంటుంది. అమ్మవారి సేవలో తరించే భాగ్యం కలగాలని కోరుకుంటుంటారు. వారిచేత అన్నప్రసాదాన్ని కంటిన్యూ చేయకుండా ఆపేయడం అన్యాయం. ప్రభుత్వం బయటవారిని ఇన్వాల్వ్ చేయక, ప్రభుత్వం చేయలేక చేతులెత్తేసింది. తిరుపతిలో రోజుకి రూ.2,40,000 గో గ్రాసం కింద ఖర్చు పెడుతున్నట్లు ప్రకటించారు. ఎన్ని గోవులున్నాయి? గోవుకు ఎంత ఖర్చుపెడుతున్నారో లెక్క తేలాలి. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో రూ.5,60,000 మంది తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుంటే.. 21లక్షల మంది అన్నప్రసాదంలో భోంచేశారనడం పొంతన లేదు.

2 సార్లే భోజనాలు పెడతారు. భక్తులు 4సార్లు తిన్నట్లు లెక్కలు చెబుతున్నారు. తిరుమలలో కూడా శ్లాట్ సిస్టమ్ పెట్టి దోచుకుంటున్నారు. 50 శాతం సామాన్యదర్శనాలు ఉంటే 50శాతం కమర్షియల్ దర్శనాలు పెట్టడం మరీ అన్యాయం. సామాన్య భక్తులకు దేవుడిని దూరం చేస్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలలోని ఆదాయాన్ని ప్రభుత్వం దోచుకుతింటోంది. స్వరూపానందస్వామే ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

హిందుత్వంపై దాడులు జరుగుతున్నా చర్యలు శూన్యం. సామాన్య భక్తులకు దేవాలయాల్లో దర్శనభాగ్యం సులువు చేయాలని సీఎంకు విన్నవిస్తున్నాం. సీఎం దేవుడిమీద నమ్మకం ఉందంటారు. మరి నమ్మకం ఉన్నవారు ఇలా దేవుడి నుండి సమాన్య భక్తులకు దూరం చేసే పద్దతి మార్చుకొని దేవుడి గుళ్లో సమాన్య భక్తులకు అవకాశం కల్పించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ సీఎంను కోరుతున్నానని తెలిపారు.

LEAVE A RESPONSE