– ఎదుటివాడు పడిపోవాలని కోరుకునే వాడు ఎక్కువ కాలం నిలబడలేడు
– కమ్యూనిస్టుల పతనం ఎవరో వాళ్లపై కుట్రలు చేయడం వల్ల కాదు
– కాలం మారుతున్నా తామూ మారాల్సిన అవసరం లేదని అనుకోవడం వల్ల…
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ముందుకు వెళ్లిపోయారు. కమ్యూనిస్టులు మాత్రం పాత నినాదాల దగ్గరే నిలిచిపోయారు. ఈ ప్రపంచంలో ఒకడు, ఇంకొకడు పడిపోవాలి అని కోరుకునే స్థితిలో ఉన్నాడంటే, వాడు ఇప్పటికే మానసికంగా కిందకి దిగిపోయినట్టే. ఎందుకంటే అతని ఆలోచన తన బలాన్ని పెంచుకోవడం మీద కాదు. ఎదుటివాడి బలహీనత కోసం ఎదురు చూడడంపైనే ఉంటుంది.
అలా ఎదురు చూస్తూ ఉండే వాడు తాను ఎలా ఎదగాలి. ప్రజలను ఎలా గెలవాలి? కాలానికి ఎలా అనుగుణంగా మారాలి అనే విషయాలపై ఆలోచించడమే మానేస్తాడు. అందుకే ముందు పతనం అయ్యేది అతడే.
ఈ సూత్రానికి రాజకీయాల్లో ప్రపంచవ్యాప్తంగా కనిపించే అతి స్పష్టమైన ఉదాహరణ కమ్యూనిస్టులు.
భారతదేశాన్ని తీసుకుంటే ఈ విషయం సంఖ్యలతోనే అర్థమవుతుంది. 2004 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలకు కలిపి దాదాపు 59 సీట్లు వచ్చాయి. అందులో CPI(M) ఒక్కదానికే 43 సీట్లు వచ్చాయి. అప్పట్లో కేంద్ర రాజకీయాల్లో వాళ్ల మాటకు విలువ ఉండేది.
కానీ ఆ తర్వాత వాళ్లు చేసిందేమిటి? కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను దింపాలి అనుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీని దింపాలి అనుకున్నారు.
కానీ “మేము ఎలా గెలవాలి” అనే ఆలోచన మాత్రం చేయలేదు. దాని ఫలితం ఏమైంది అంటే.. 2014 లో CPI(M) సీట్లు 9కి పడిపోయాయి. 2019 లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. 2024 లో కూడా పరిస్థితి మారలేదు. ఒకప్పుడు 40కి పైగా సీట్లు ఉన్న పార్టీ, 20 ఏళ్లలో రాజకీయంగా అంచులకి చేరిపోయింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆలోచనా విధానానికి వచ్చిన శిక్ష.
ఇదే కథ ప్రపంచ చరిత్రలో మరింత పెద్ద స్థాయిలో జరిగింది. సోవియట్ యూనియన్ను తీసుకుంటే, 1917 అక్టోబర్ విప్లవం తర్వాత ప్రపంచానికి కమ్యూనిజం ప్రత్యామ్నాయమని ప్రకటించింది. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రజల అవసరాలు, స్వేచ్ఛలు, జీవన ప్రమాణాలపై దృష్టి పెట్టకుండా పాశ్చాత్య ప్రపంచాన్ని ఎలా ఓడించాలి? క్యాపిటలిజాన్ని ఎలా కూల్చాలి అన్న ఆలోచనలకే పరిమితమైంది.
చివరికి 1991 డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ అధికారికంగా కూలిపోయింది. ఆ రోజుతో ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్టు ప్రయోగం ముగిసింది. ఇది బయట శత్రువుల వల్ల కాదు, లోపలి ఆలోచనా పతనం వల్ల.
1989 నుంచి 1991 మధ్య తూర్పు యూరప్ మొత్తం ఇదే దృశ్యాన్ని చూసింది.
1989 నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలిపోయింది.
ఆ ఒక్క సంఘటన యూరప్‌లో కమ్యూనిజానికి ముగింపు గంటలా మారింది. పోలాండ్‌లో 1989లో, హంగేరీలో 1989లోనే, చెకోస్లోవేకియాలో 1990లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కూలిపోయాయి.
అక్కడ కూడా సమస్య ఒకటే. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనే దానికంటే, ఇతర వ్యవస్థలు ఎలా ఓడిపోవాలి అనే ఆలోచన ఎక్కువైంది.
ఇటలీని తీసుకుంటే అక్కడి కమ్యూనిస్టు పార్టీ ఒకప్పుడు యూరప్‌లోనే అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీ. 1976లో ఇటలీ కమ్యూనిస్టు పార్టీకి సుమారు 34 శాతం ఓట్లు వచ్చాయి. కానీ కాలానికి అనుగుణంగా మారలేకపోయింది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత కూడా పాత సిద్ధాంతాలతోనే కొనసాగింది. చివరికి 1991లో ఆ పార్టీ అధికారికంగా రద్దయ్యింది. కొత్త పేర్లతో, కొత్త రూపాలతో రాజకీయాల్లో కొనసాగడానికి ప్రయత్నించారు కానీ అసలు కమ్యూనిస్టు పార్టీ అక్కడితో ముగిసిపోయింది.
ఫ్రాన్స్‌లో కూడా ఇదే కథ. 1950లలో ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీకి 20 శాతం పైగా ఓట్లు వచ్చేవి.
1981 తర్వాత క్రమంగా పతనం మొదలైంది. 2002 ఎన్నికల్లో 5 శాతం కంటే తక్కువకు పడిపోయింది. 2017, 2022 ఎన్నికల నాటికి 2 నుంచి 3 శాతం ఓట్లకే పరిమితమైంది.
ఇక్కడ ఒకే ఒక మినహాయింపు కనిపిస్తుంది, అది కూడా పూర్తిగా మారినందుకే. చైనా కమ్యూనిస్టు పార్టీ. 1978లో డెంగ్ జియావోపింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో చైనా ఒక నిర్ణయం తీసుకుంది. ఇతరులు పడిపోవాలి అన్న ఆలోచన కంటే, తమ ప్రజలు బాగుపడాలి అన్న దిశగా మారింది.
మార్కెట్‌ను అంగీకరించింది. పెట్టుబడులను అనుమతించింది. అందుకే ఆ పార్టీ నిలిచింది. కానీ అది కూడా పాత కమ్యూనిజం కాదు. పూర్తిగా మారిన రూపం.
ఇవన్నీ కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కమ్యూనిస్టుల పతనం ఎవరో వాళ్లపై కుట్రలు చేయడం వల్ల కాదు. అధికారంలో ఉన్నవాళ్లు పడిపోవాలి అనే ఆలోచనకే తమ రాజకీయాన్ని పరిమితం చేయడం వల్ల. ప్రజలను గెలవాలనే తపన లేకపోవడం వల్ల. కాలం మారుతున్నా తామూ మారాల్సిన అవసరం లేదని అనుకోవడం వల్ల.
చరిత్ర ఒకే పాఠం చెబుతుంది. జీవితంలోనైనా, రాజకీయాల్లోనైనా, ఎదుటివాడు పడిపోవాలని కోరుకునే వాడు ఎక్కువ కాలం నిలబడలేడు. నిజమైన విజయం అనేది ఇతరుల పతనం వల్ల రాదు. ప్రజల విశ్వాసం వల్ల వస్తుంది. ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయిన సిద్ధాంతాలన్నీ చివరికి ఇదే గతి పొందాయి. కమ్యూనిస్టుల కథ అదే.
– అయ్యల సోమయాజుల సుబ్రమణ్యం