* పవన్ కళ్యాణ్ ఆశయాలకు వారే వారధులు
* ఉన్నతాశయం కోసం పని చేసిన వారందరికీ గుర్తింపు
* ప్రతికూల స్థితిలో పార్టీకి అండగా నిలబడిన మీ ధైర్యం గొప్పది
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది అంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన మీరందరికి అభినందనలన్నారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం… ఆ దిశగా మనందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షుల సమావేశం శుక్రవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పార్టీ నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న పని. నాలుగు గోడల మధ్య, నలుగురు పెద్ద మనుషులు ఇచ్చిన సలహాల మేరకు పార్టీ నిర్మాణం చేపట్టలేం. సమాజానికి ఉపయోగపడే రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఆ దిశగా వేసిన అడుగుల్లో మీరందరూ భాగస్వాములు కావడం గర్వించదగ్గ విషయం. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం జెండా పట్టుకొని నిస్వార్ధంగా పని చేసిన ప్రతి ఒక్కరు ఈ రోజు మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారు, టైలరింగ్ పనులు చేసేవాళ్లు ఉన్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లినప్పుడు నాయకత్వంలో తేడాలు ఉంటాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో తేడాలు ఉంటాయి. కొన్నింటిని రాజకీయంగా, మరికొన్నింటిని సామాజికంగా ఎదుర్కొవాలి. ప్రతిపక్షాలను నిలువరించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని అప్రజాస్వామికం అని హైకోర్టు కొట్టేసింది. ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను జనసేన ఎప్పటికీ చేయదు.
మీ తెగింపు మరవలేనిది
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేయకుండా ఎన్ని వేధింపులకు గురి చేశారో మనందరికీ తెలుసు. ప్రతిస్థానం ఏకగ్రీవం కావాలని మూర్ఖ ముఖ్యమంత్రి స్థానిక నాయకత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మన కళ్లారా చూశాం. ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు మంచి పద్దతి కాదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు మీరందరూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోమని బెదిరించారు. పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి భయపెట్టారు. అయినా మీరెవ్వరూ భయపడకుండా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ రోజు మీరు చూపించిన తెగింపు మరువలేనిది. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయి. మన నాయకులపై కావాలనే కేసులు పెట్టి వేధిస్తుంటారు. ఉత్తరాంధ్రలో కూడా అలాంటి పరిస్థితిలే ఉన్నాయి. రణస్థలంలో జరిగిన యువశక్తి కార్యక్రమం వేదికగా అక్కడి యువత మాకు లీగల్ గా సపోర్టు కావాలని కోరగానే పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాదిని ఏర్పాటు చేశారు. లీగల్ ఖర్చులు కూడా పార్టీయే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఆ నిర్ణయం ఫలితం ఇస్తుంది. సమస్యలపై పోరాటడానికి యువత బయటకు వస్తున్నారు. అక్కడ మార్పు మొదలవుతోంది.
కుటుంబసభ్యులుగా భావిస్తేనే ఇలా చేయగలం
రాష్ట్రంలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టింది. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తేనే ఇలాంటి కార్యక్రమం చేయగలం. ప్రమాదవశాత్తు ఎవరైనా జనసైనికుడు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం. ఇప్పటివరకు132 మంది జనసైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించి ఆర్థికంగా ఆదుకున్నాం. అలాగే జిల్లా నాయకత్వంతోపాటు రాష్ట్ర నాయకత్వం వారి కుటుంబాన్ని పరామర్శించి మీకు మేమున్నాం అనే భరోసా నింపుతున్నాం.
కౌలు రైతుకు అండగా నిలబడ్డాం
రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసి వారికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఉగాది పర్వదినం నాడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 700 వందల మంది చనిపోయి ఉంటారు వారి కుటుంబానికి లక్ష చొప్పున ఇచ్చి ఆర్థికంగా ఆదుకుందాం అని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. చివరకు రాష్ట్రవ్యాప్తంగా లెక్కలు తీస్తే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 3 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కూడా ఎక్కడ వెనుదిరిగి చూడకుండా అందరికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి జిల్లా వెళ్తూ అక్కడ చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి పిల్లల చదువులకు అవసరమయ్యే వసతులు కల్పిస్తున్నారు.
జనవాణికి వచ్చిన స్పందన తట్టుకోలేక ఆ కార్యక్రమం పెట్టారు
గత ప్రభుత్వాల హయాంలో నాలుగైదు సమస్యలు వస్తే… జగన్ పుణ్యమా అని ఈ ప్రభుత్వంలో రోజుకో కొత్త సమస్య తలెత్తుతోంది. వాళ్లే సమస్యలు సృష్టించి ఇప్పుడు వాళ్లే పరిష్కరిస్తామంటున్నారు. సామాన్యుడి గొంతు బలంగా వినిపించాలని జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం చేస్తే దానికి వస్తున్న స్పందన తట్టుకోలేక సంవత్సరం క్రితం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. సంవత్సరం క్రితం ప్రకటించిన ఈ కార్యక్రమం వారం క్రితం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం కోసం ఇచ్చిన ట్రోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సరైన స్పందన ఉండటం లేదని ప్రజలే చెబుతున్నారు. అలాగే స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలు 98.2 శాతం పరిష్కరించామని చెబుతున్నారు. ఎక్కడ పరిష్కరించారో ఎవరికీ తెలియదు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం బెవరపేటలో ఇంటికి స్టిక్కర్ అతికించొద్దు అన్నందుకు ముగ్గురిపై దాడి చేశారు. పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 1.8 లక్షల్లో రూ.30 వేలు లంచం ఎందుకు తీసుకున్నారు అని అడిగినందుకు దాడి చేశారు. ఈ విధంగా గ్రామాల్లో దాడులకు దిగుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇసుకను దోచుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల పడిన గుంతల్లో మునిగి 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
అప్రమత్తంగా ఉండాలి
జనసైనికులు, జనసేన పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కార్యక్రమం వైసీపీ మొదలు పెట్టింది. మనందరం అప్రమత్తంగా ఉండాలి. గ్రామ, వార్డుల్లో పర్యటించి తొలగించిన ఓట్లు తిరిగి పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలి. మనం రేపటి రోజున ప్రభుత్వంలోకి రావాలి… మన నాయకుడిని గెలిపించుకోవాలి అంటే మనందరం బాధ్యతగా పని చేయాలి. ప్రతి మండలంలో నెలాఖరుకల్లా మండల కమిటీలు పూర్తి చేసుకోవాలి. సామాన్యుడు ప్రభుత్వాన్ని నిలదీయలేడు కనుక ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి అవినీతిలో కూరుకుపోయారు. వారి అవినీతిని ఎండగట్టే విధంగా మన కార్యచరణ ఉండాలి. ఒక పేద మహిళ బిడ్డ చనిపోయిన బాధలో ఉంటే వారికి వచ్చే నష్టపరిహారంలో రూ.2 లక్షలు దోచుకోవడానికి ప్రయత్నించిన మంత్రి కూడా మన గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వారందరికీ బుద్ధి చెప్పే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చి మరి మన అధినాయకుడిపై దుష్ప్రచారం చేపట్టారు. ఇప్పుడు కూడా అదే దోరణిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి మనపై విషప్రచారం చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవాలని” పిలుపునిచ్చారు.