Suryaa.co.in

Andhra Pradesh

రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చిన తెలుగుదేశం పార్టీ పేదల పక్షం

-కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో కన్ను, మిన్నూ కానకుండా విర్రవీగుతున్న వైకాపా ధనికపక్షం
-నడమంత్రపు సిరితో కనకపు సింహాసనం ఎక్కిన జగన్ మోహన్ రెడ్డి ఎలా పేదల పక్షం అవుతారు?
-తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అధికారం చేజారిపోతుందన్న నిజాన్ని గ్రహించి నిరాశ, నిస్పృహలతో సమయ సంధర్బాలు కూడా తెలియకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు, పల్నాడు జిల్లా, క్రోసూరులో పాఠశాల విద్యార్ధులకు ‘కిట్లు’ పంపిణీ చేస్తూ.. ఆ చంటిబిడ్డల సభలో ప్రసంగిస్తూ.. రాబోయే ఎన్నికలు “పేదలు-పెత్తందారులకు మధ్య” జరుగుతున్న ఎన్నికలని నొక్కి చెప్పడం హాస్యాస్పదం. ఆయన ఉపన్యాసం వింటున్న ఆ బిడ్డలకు ఓటు కూడా లేదన్న ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరం. ఎన్ని కుప్పిగంతులు వేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆయన ఆశ అడియాశగానే ఉంటుంది తప్పితే, సఫలీకృతం కాదని ముఖ్యమంత్రి గ్రహించాలి.

నిజమే..రాబోయే ఎన్నకలు పేదలకు – పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలే. కానీ, పేదవాడికి కూడు, గుడ్డ, నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయాలతో పెట్టిన పార్టీ తెలుగుదేశం. తన తండ్రి ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాన సంపాదించిన కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి పెట్టిన పార్టీ జగన్ గారి వై.ఎస్.ఆర్.సి.పి. తన తండ్రి ముఖ్యమంత్రి కాక ముందు అంతంత మాత్రంగా ఉన్న ఆయన ఆర్ధికస్థితి, తన తండ్రి ముఖ్యమంత్రి కావడంతో అకాశానికి ఎలా అంటింది? ఉండటానికి ఆనాడు సరైన ఇళ్లు కూడా లేని ముఖ్యమంత్రికి, ఈనాడు బెంగళూరులో 29 ఎకరాల్లో కట్టిన ఆ రాజప్రసాదం ఎక్కడిది? 64 రూములతో హైదరాబాద్ లోటస్ పాండ్ లో నిర్మించిన బంగ్లా ఎక్కడిది?

ఇడుపులపాయ ఎస్టేట్ లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన రాజమహల్ ఎక్కడిది? పులివెందులలో కట్టిన మేడ మీకెక్కడిది? ప్రస్తుతం ముఖ్యమంత్రి దంపతులు నివసిస్తున్న తాడేపల్లి రాజకోట ఎక్కడిదని ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నా. ఆనాడు ఏ వ్యాపారం లేని మీరు ఈనాడు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారు? మీ అవినీతి పరంపర ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మీరు అంబానీలను, అదానీలను, టాటాలను కూడా ఆర్ధికస్థితిలో వెనక్కు నెడతారనడంలో ఆశ్చర్యం లేదు.

ఆనాడు కాళ్లకు బాటా చెప్పులు వేసిన మీరు, ఈనాడు మీ కాళ్లకు రూ.1.40 లక్షల ఖర్చు చేసే చెప్పులున్నాయంటే మీరెంత ధనికులో కదా!. మీరు త్రాగే మంచినీటి బాటిల్ రూ.4,500 ఖరీదట. అంతటి ధనవంతులా మీరు ముఖ్యమంత్రి గారు.? మీ చేతికి పెట్టిన గడియారం రూ.2 కోట్ల ఖరీదట కదా. అబ్బో మీరు ధనవంతులకే ధనవంతులుగా ఉన్నారు. మరి మీరెలా పేదల పక్షం? నడమంత్రపు సిరితో కనకపు సింహాసనం ఎక్కిన మీరు ఎలా పేదల పక్షం అవుతారు? రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చిన తెలుగుదేశం పార్టీ పేదల పక్షం. రూ.25 లకే రెండు చేనేత చీరలిచ్చి దళిత, అట్టడు వర్గాల మహిళల మానసంరక్షణ చేసిన తెలుగుదేశం పేదలపక్షం.

ఆ రోజుల్లోనే పేద విద్యార్ధులను విదేశాలకు పంపి వారిని ఆర్ధికంగా స్థిరపరిచిన పార్టీ తెలుగుదేశం. అందుకే తెలుగుదేశం టిడిపి పేదలపక్షం. కోట్లాది రూపాయల అవినీతిసొమ్ముతో కన్ను, మిన్నూ కానకుండా విర్రవీగుతున్న వైకాపా పార్టీ ధనికపక్షం. మీరన్నది నిజమే ఇది పేదలకు-పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నకల యుద్దమే. కానీ, అందులో పేదల పక్షం తెలుగుదేశం పార్టీ. ధనికపక్షం మీ వై.ఎస్.ఆర్.సి.పి అని గ్రహించాలి.

LEAVE A RESPONSE