– పొలానికి 2 రోజులు సాగునీరు నిలిపి, నాటకం
– ఎమ్మెల్యే నల్లమిల్లి ఆక్షేపణ
– కైకవోలులో అన్ని పొలాలు పచ్చగా ఉన్నాయ్…
కైకవోలు: కైకవోలులో పొలాలు ఎండిపోతున్నాయి అంటూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం కైకవోలు పంట పొలాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కైకవోలులో పంట పొలాలకు సాగునీరు అందడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పొలంలో టూ వీలర్ నడిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు వచ్చినప్పుడు రైతులు వీడ్ రిమూవల్ జరగాల్సి ఉందని చెప్పడంతో మూడు రోజుల క్రితం ఆ కార్యక్రమం మొదలుపెట్టించాం. ఒకవేళ వీడ్ రిమూవల్ జరగకపోయినా ఆ పొలానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడే ఆ పొలానికి సంబంధించిన రైతు చెప్పారు… కలుపు మందు కొట్టే నిమిత్తం తన పొలానికి నీరు ఆపామని. అయితే ఓ పథకం ప్రకారం ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం రెండు రోజులు డిలే చేయించి వైయఎస్ఆర్సిపి నాయకులు ఈ కార్యక్రమం నడిపించారు.
భారతదేశంలో ఆహార పదార్థాలను కాళ్లతో గాని, వాహనాలతో గాని తొక్కించకూడదు అనే సంస్కృతి ఉంది కానీ ఇటీవల వైయస్సార్సీపి నాయకుల పోకడలు విచిత్రంగా ఉన్నాయి. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మిర్చి రైతులను పరామర్శిస్తానని చెప్పి మిర్చి ని ట్రాక్టర్లతో తొక్కించడం, మామిడి రైతులను పరామర్శ పేరుతో మామిడి పండ్లను రోడ్డు మీద వేసి తొక్కించడం చూశాం… ఇక్కడ వరి నాట్లు చక్కగా ఉన్న పొలంలో ఈయన టూ వీలర్ నడపడం చూశామని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఏ విధమైన ఇబ్బంది ఈ పొలానికి లేదు… దానిలో టూ వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఒకసారి ఆలోచన చేయాలి.
రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది… అయిదేళ్ళపాటు వీడ్ రిమూవల్ కూడా చేయని పరిస్థితి నుండి.. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే సంవత్సరానికల్లా డి సిల్టింగ్ చేసి రైతాంగానికి నీటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ సంవత్సరకాలంలో అనపర్తి నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి నా పనితీరుకు కొలమానం అని తెలియజేస్తున్నాను అని అన్నారు.