ఓట్లు పోనాయి.. మరేటి సేత్తాం?

- చిన్న శ్రీనుతో ఒరిగిందేమిటి?
- నాయకత్వం వద్ద చిన్న శ్రీను బలం ఎక్కువగా చూపిన యువనేతలు?
- ఆయనొస్తే విజయనగరంలో వైసీపీ భూస్థాపితం అవుతుందన్న ఆశలు
- వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని హైప్
- మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే కూడా వస్తారని అతి భరోసా
- తీరా టీడీపీ రెండు కంచుకోటలే కూలిన విషాదం
- బొత్స కోడలు, చెల్లిని ఓడించలేని చిన్న శ్రీను బలం
- స్థానిక ఎన్నికల్లో టీడీపీ కంటే 16 వేల ఓట్లు వైసీపీకి ఎక్కువ వచ్చిన వైచిత్రి
- మరి చిన్న శ్రీనుతో పార్టీకి పెరిగిన బలమేమిటని సీనియర్ల వాదన
- వద్దని ఎమ్మెల్యేలు చెప్పినా వినని పార్టీ యువ నాయకులు
- జడ్పీ చైర్మన్ పదవిని డాక్టర్ చంద్రకళకు ఇవ్వాలంటున్న సీనియర్లు
- చిన్న శ్రీను కూతురు వద్దంటూ తెగేసి చెబుతున్న ఎమ్మెల్యేలు, సీనియర్లు
- విజయనగరం జిల్లా టీడీపీలో చిన్న శ్రీను చేరిక బూమెరాంగ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన లేస్తే మనిషి కాదన్నారు. అడుగులేస్తే పంజా విప్పిన పులి అని అన్నారు. ఆయన తెలివితేటలకు విపక్షం తెల్లారాల్సిందేనన్నారు. ఆయన దెబ్బ కొడితే వైసీపీ అబ్బా అంటుందన్నారు. ఆయన టీడీపీ లోకి వస్తే, జిల్లా మొత్తం వైసీపీ తమ పార్టీలోకి క్యూ కడుతుందన్నారు. ఒక మాజీ డిప్యూటీ సీఎం, ఒక మాజీ ఎమ్మెల్యే సహా వేలమంది ‘ఫ్యాన్’ ఆపి సైకిలెక్కేస్తారని ‘మంగళగిరి’కి దగ్గరగా ఉండే కొందరు యువనేతలు, నాయకత్వం వద్ద బిల్డప్పులిచ్చారు.
తీరా ఎన్నికల ఫలితాలేమో.. ‘‘ఇంతన్నాడంతన్నాడే గంగరాజు.. ముంతమామిడి పండన్నాడే గంగరాజు’’ అన్నట్లు మారి, ‘బిల్డప్పు బాబాయ్’ అసలు బలమేంటో తెలియడంతో తెలుగుతమ్ముళ్లు తలపట్టుకున్నారు. ఆయన రాకతో పార్టీ బలం పెరగడం మాట అటుంచి, పార్టీకి కంచుకోటలయిన రెండు జడ్పీటీసీలు కొండెక్కాయంటున్నారు.
అంతోటి దానికి పక్క పార్టీ నుంచి తీసుకువచ్చి బిల్డప్పులివ్వడం ఎందుకని.. సదరు నేతకు వత్తాసుగా నిలిచిన ఆ ‘పవర్ఫుల్ యువనేత’లపై తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఈ ఘనకార్యానికేనా ఆయన కూతురుకు జడ్పీ చైర్మన్ ఇచ్చేదని ఎమ్మెల్యేలు సైతం విరుచుకుపడుతున్నారట. ఇంతకూ ఆయనెవరంటే.. విజయనగరం టీడీపీ కొత్త ఆశాకిరణం, యువధృవతార చిన్న శ్రీను. బొత్స మేనల్లుడు!.. అంతేనా? నాయకత్వం చుట్టూ ఉన్న ‘ పవర్ఫుల్ యువనేతల’ కృషి ఫలిస్తే.. ఆయనే రేపటి ఎమ్మెల్సీ కమ్ మంత్రి కూడా కావచ్చు.
ఉత్తరాంధ్రలో టీడీపీకి కంచుకోట అయిన విజయనగరం జిల్లాలో.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార టీడీపీ కంటే, దిక్కూమొక్కూ లేని వైసీపీకి 16 వేల ఓట్లు ఎక్కువ రావడం సంప్రదాయ టీడీపీ శ్రేణులను కలవరపరుస్తోంది. దీనికి తమ జిల్లాపై సరైన అవగాహన లేని యువనేతల మాట విన్న నాయకత్వమే కారణమని టీడీపీ సీనియర్లు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
వైసీపీలో ఉన్న బొత్స మేనల్లుడు చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకువస్తే.. జిల్లాలో వైసీపీ భూస్థాపితం అవుతుందని నాయకత్వానికి- మంగ ళగిరి ఆఫీసుకు దగ్గరగా ఉండే యువనేతలు నూరిపోశారట. దానితో చిన్న శ్రీనుతో సదరు యువనేతలు విశాఖలోని ఖరీదైన హోటల్లో భేటీలు వేయడం.. అప్పటికప్పుడు కుమార్తెతో సహా ఆయనను మంగళగిరికి తీసుకువెళ్లి పసుపు కండువా వేయించటం చకాచకా జరిగిపోయింది. అయితే.. అసలు కారణం.. లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అనంతర పరిణామాలన్నది టీడీపీ వర్గాల ఉవాచ. అది వేరే కథ.
అటు చిన్న శ్రీనుకు ఉన్న పబ్లిసిటీ చూసిన విజయనగరం ప్రజలు కూడా.. ఇక జిల్లాలో వైసీపీ భూస్థాపితం అవుతుందని, ఆ దెబ్బకు బొత్స చివరకు జనసేనలో చేరక తప్పని పరిస్థితి తలెత్తుందని భావించారు. ఐదు నియోజకవర్గాల్లో ఆయన చక్రం తిప్పితే, వైసీపీ తట్టుకోవడం కష్టమన్న హైప్ ఇచ్చారు.
దానికి కారణం లేకపోలేదు. బొత్స మంత్రిగా ఉన్నంతకాలం, చిన్న శ్రీను ఆ ఐదు నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన రోజులు వారు ప్రత్యక్షంగా చూసినవే. ఆయన ధాటికి బొబ్బిలి రాజులు, కెవిపి వంటి నేతల పంచన చేరాల్సిన పరిస్థితి.
సీన్ కట్ చేస్తే.. బుద్ధిలో బృహస్పతి అంటూ యువనేతలు మునగచెట్టెక్కించిన అదే చిన్న శ్రీను చేరిక వల్ల, విజయనగరం జిల్లాలో పార్టీకి ఓట్లు పెరగకపోగా.. టీడీపీ కంటే వైసీపీకి 16 వేల ఓట్లు ఎక్కువ వచ్చిన వైనం, తెలుగు తమ్ముళ్లకు భవిష్యత్తుపై ఇప్పటినుంచే బెంగ పట్టుకునేలా చేసింది.
నిజానికి చిన్న శ్రీను చేరిక తర్వాత పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే జోగారావు, సాలూరు నుంచి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సహా, ఐదు నియోజవకర్గాల్లోని తమ అనుచరులు వేల సంఖ్యలో టీడీపీలో చేరతారని, యువనేతలకు భరోసా ఇచ్చారని పారీ ్ట సీనియర్లు చెబుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించిన్పటికీ, వారిద్దరూ టీడీపీలో చేరకపోవడం టీడీపీని నిరాశ పరిచింది.
ఆ మాట కొస్తే నియోజకవర్గానికి కొద్దిమంత్రి చొప్పున మాత్రమే.. ఆయన అనుచరులు ఎమ్మెల్యేల సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారని, మెజారిటీ అనుచరులు మాత్రం వైసీపీలోనే ఉండిపోయారని టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. నిజంగా వారంతా చిన్న శ్రీనుతో పాటు చేరి ఉంటే, పార్టీకి ఈ పరాభవం తప్పేదని విశ్లేషిస్తున్నారు.
ఇక సొంత బామ్మర్ది చేరిన నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల జడ్పీటీసీతోపాటు, ఒక మున్సిపాలిటీ, 7 ఎంపీటీసీలు కూడా వైసీపీ పరమయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న శ్రీను బావమరిది అప్పలనాయుడు టీడీపీలో చేరినా, అక్కడ జడ్పీని చిన్న శ్రీను గెలిపించలేకపోగా, ఉన్న 12 ఎంపీటీసీల్లో ఏడు స్థానాలను వైసీపీ పరం చేశారంటున్నారు.
చీపురుపల్లిలో బొత్స ప్రాతినిధ్యం వహించిన రోజుల్లో చక్రం తిప్పిన చిన్న శ్రీను.. ఆ నియోజకవర్గంలోని గుర్ల, గరివిడి మండలాలను గెలిపించడంలో విఫలమయ్యారంటున్నారు. నిజానికి ఆ రెండు నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్, వైసీపీ ప్రభంజనాన్నిసైతం ఎదుర్కొని ఒక్కసారి కూడా ఓడిపోని చరిత్ర ఉన్న మండలాలని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఎమ్మెల్యే కళా వెంకట్రావు విఫలమయ్యారనున్నప్పటికీ, బలవంతుడిగా భావించి పార్టీలోకి తీసుకువచ్చిన చిన్న శ్రీను ఆ రెండు మండలాలను ఎందుకు గెలిపించలేకపోయారని సీనియర్లు లాజిక్ పాయింట్లు తీస్తున్నారు.
‘మరి చిన్న శ్రీను అంత బలవ ంతుడయితే ఆ రెండు మండలాల్లో గతంలో కంటే టీడీపీకి ఎక్కువ మెజారిటీ రావాలి. కానీ దానికి భిన్నంగా ఘోరంగా ఓడిపోయింది. పార్టీ పుట్టినప్పటి నుంచీ ఓటమి ఎరుగని ఆ రెండు మండలాలను, కనీసం నిలబెట్టలేకపోయిన చిన్న శ్రీను వల్ల మాకేంటి ఉపయోగం? ఇక ఆయనకు ఏం బలం ఉందని వీళ్లంతా ఆయనను మోస్తున్నార’’ని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
గరివిడి మండలంలో ఉన్న 20 ఎంపీటీసీల్లో వైసీపీ 11 స్థానాలు గెలుకుంది. గుర్ల మండలంలో ఉన్న 18 ఎంపీటీసీలకు వైసీపీ 9స్థానాలు గె లుచుకుంటే, ఇక చిన్న శ్రీను చేరిక వల్ల వచ్చిన లాభమేమిటని సీనియర్లు లా పాయింట్లు తీస్తున్నారు.
ఇక పార్వతీపురం జిల్లాకు పరిశీలకుడిగా వ్యవహరించిన చిన్న శ్రీను, అక్కడేమైనా అద్భుతాలు సృష్టించారా అంటే అదీ లేదని.. అక్కడ ఏకంగా జడ్పీని, వైసీపీకి ధారాదత్తం చేశారని సీనియర్లు ఎద్దేవా చేస్తున్నారు.
జడ్పీటీసీ వైసీపీ పరం కాగా, రూరల్ జడ్పీటీసీతోపాటు, ఉన్న 7 ఎంపీటీసీల్లో 3 వైసీపీ ఖాతాలోకి వెళ్లాయని గుర్తు చేస్తున్నారు. నిజంగా చిన్న శ్రీనుకు పార్టీని గెలిపించేంత సత్తా ఉంటే.. తాను పరిశీలకుడిగా వ్యవహరించిన జిల్లాలో, ఏకంగా జడ్పీ చైర్మనే ఎందుకు వైసీపీ ఖాతాలోకి వెళతుందని ఆ జిల్లా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, మక్కువ మండలాల్లో టీడీపీ ఓడిందని చెబుతున్నారు. ఇక గజపతినగరం నియోజకవర్గంలో జామి, జగపతినగరం మండలాలు వైసీపీ కైవసం చేసుకుందని టీడీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
నిజానికి రాష్ట్రంలో బలహీనమయిన మంత్రుల నియోజకవర్గాల్లో సైతం, జడ్పీటీసీలు బ్రాహ్మండమైన మెజారిటీలతో గె లిస్తే.. మాస్టర్ బ్రైన్, బృహస్పతి వంటి బిరుదులున్న చిన్న శ్రీను లాంటి ఇమేజ్ ఉన్న నేత టీడీపీలో చేరినా, ఇన్ని కీలకమైన జడ్పీటీసీలు..ఎంపీటీసీలు, ప్రధానంగా అసలు టీడీపీ పుట్టినప్పటి నుంచి ఓటమి ఎరగని మండలాల్లో పార్టీ ఎందుకు ఓడిందని టీడీపీ సీనియర్లు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు.
చిన్న శ్రీనుకు అంత బలం ఉంటే.. మేనమామ బొత్స కోడలు, చెల్లిని అక్కడ ఎందుకు ఓడించలేకపోయారు? అక్కడ వాళ్లిద్దరూ ఎలా గెలిచారు? ఎవరి వల్ల గెలిచారు? అని లా పాయింట్లు తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో రానున్న జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో చిన్న శ్రీను కుమార్తెకు.. చైర్మన్ సీటు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై టీడీపీ సీనియర్లు, పలువురు ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. ‘ఇంతోటి దానికి ఆయన కుమార్తెకు మళ్లీ జడ్పీ చైర్మన్ ఒకటా? అయినా ఆయన పార్టీలోకి వచ్చి ఏం ఉద్ధరించారని జడ్పీ చైర్మన్ ఇస్తారు? ఆయన వచ్చిన తర్వాత పార్టీ 16 వేల ఓట్లు నష్టపోయింది. మేం అధికారంలో ఉండి, జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, కొత్తగా చక్రం తిప్పుతారన్న చిన్న శ్రీను చేరినా వైసీపీకి 16 వేల ఓట్లు మా పార్టీ కంటే ఎక్కువ ఎలా వస్తాయి? అంటే దీన్నిబట్టి చిన్న శ్రీను వల్ల పార్టీకి నష్టమా? లాభమా అని ఆయనను నాయకత్వం వద్ద హీరోగా చూపించి, పార్టీలో చేర్పించిన పెద్ద నాయకులే చెప్పాలి’’ అని ఓ ప్రజాప్రతినిధి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా, జిల్లా ఇన్చార్జిగా ఉన్న హోంమంత్రి అనిత సైతం, చిన్న శ్రీనుకే దన్నుగా ఉన్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ‘పార్టీ కూడా చిన్న శ్రీను వైపే ఉందని లోకేష్ పక్కనే ఉన్న ఒక యువ నాయకుడు చెబుతున్నారు కాబట్టి నేనేమీ చేయలేనని ఆమె అంటున్నారు. మరి పార్టీ అంటే ఎవరో మాకు అర్ధం కావడం లేదని’ ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.
తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. పూసపాటిరేగ జడ్పీటీసీ డాక్టర్ చంద్రకళకు జడ్పీ చైర్మన్ ఇవ్వడం ద్వారా, కనీసం ఇప్పటికయినా పార్టీకి పనిచేసిన వారిని గౌరవించాలని, ఎమ్మెల్యేలు నాయకత్వానికి సూచిస్తున్నారు. గతంలో అక్కడ గెలిచిన కర్రోతు బంగార్రాజు, పార్టీకి అంకితభావంతో పనిచేశారని గుర్తు చేస్తున్నారు.
పైగా చిన్న శ్రీను కుమార్తె కుల ధృవీకరణ అంశం ఇంకా వివాదాస్పదంగానే ఉందంటున్నారు. మార్వాడీ అయిన ఆమె, బీసీ సర్టిఫికెట్తో ఎలా పోటీ చేస్తారని వైసీపీ కోర్టులో కేసు వేసింది. దానికి స్పందించిన కోర్టు.. దానిపై ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల తర్వాత కోర్టుకు వివరించాలని ఆదేశించింది.
కాగా గతంలో మహారాష్ట్ర హైకోర్టు ఇలాంటి కేసునే పరిష్కరించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒక బ్రాహ్మణ యువతిని ఒక దళితుడు దత్తత తీసుకుని, ఆమెకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలన్న అభ్యర్ధనను కోర్టు తిరస్కరించిందని గుర్తు చేస్తున్నారు. జన్మత: జైన్ మతానికి చెందిన మార్వాడీకి చెందిన ఆమె, తూర్పు కాపు ఎలా అవుతుందని వాదిస్తున్నారు. ‘ అసలు ఇంకా చెప్పాలంటే జైన్ అనేది కులం కాదు. అదొక మతం. ఆ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అంటే ఏకంగా మతం నుంచి కులాన్ని మార్చేస్తామంటున్నారు. సాంకేతిక అంశాలను పక్కనపెట్టి, అధికారం ఉంది కదా అని ఆమెకు బీసీ సర్డిఫికెట్ జారీ చేసిన అధికారులకు కోర్టులో శిక్ష తప్పదని’’ వైసీపీ నేతలు ఇప్పటికే మీడియా సమక్షంలో హెచ్చరిస్తున్నారు.
అందువల్ల ఇన్ని వివాదాలు ఎదుర్కొంటున్న చిన్న శ్రీను కుమార్తెకు జడ్పీ చైర్మన్ ఇచ్చి అప్రతిష్ఠ పాలయ్యే బదులు.. పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేస్తున్న బంగార్రాజు కుటుంబానికి చైర్మన్ పదవి ఇవ్వడమే, క్రమశిక్షణ గల కార్యకర్తకు పార్టీ ఇచ్చే నిజమైన గుర్తింపు అని టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
మరి నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది? చిన్న శ్రీను పక్షాన లాబీయింగ్ చేస్తున్న యువనేతలు మధ్యలో ఏ స్థాయిలో చక్రం తిప్పుతారో చూడాలి.
