Suryaa.co.in

Editorial

‘నరక’దారి!

– అది మెట్ల మార్గమా? మృత్యుమార్గమా?
– స్వామిని చూడకుండానే స్వర్గానికి
– పులి పంజాకు బలవుతున్న పసి ప్రాణాలు
– మెట్ల మార్గంలో ఇప్పటికిది రెండో విషాదం
– అనుభవాలు నేర్పని గుణపాఠాలు
– గతంలోనే బాలుడిపై పులి పంజా
– ఇకపై అలాంటివి జరగవన్న ఈఓ ధర్మారెడ్డి
– అప్పుడు బతికి బయటపడ్డ బాలుడు
– ఇప్పుడు పులిపంజాకు తలవాల్చిన చిన్నారి
– టీటీడీ-ఫారె స్ట్‌ వైఫల్యానికి భక్తులు బలి
– పరామర్శలో కనిపించని టీటీడీ ఈఓ, చైర్మన్‌
– భక్తుల భద్రత టీటీడీ బాధ్యత కాదా?
– రాత్రివేళ మెట్ల మార్గం మూసివేతకు మీనమేషాలెందుకు?
– కరుణాకర్‌రెడ్డికి సెంటి‘మంట’
– చైర్మన్‌గా బాధ్యత తీసుకున్న రెండోరోజే బాలిక బలి
( మార్తి సుబ్రహ్మణ్యం)

తిరుమల వెంకన్న మెట్ల మార్గం పసివాళ్ల పాలిట మృత్యుమార్గంగా పరిణమించింది. అది నడక దారి కాదు. నరక దారిలా మారింది. టీటీడీ-ఫారెస్ట్‌ అధికారుల జమిలి నిర్లక్ష్యం, భక్తుల నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ‘ఇకపై అలా జరగదని’ హామీ ఇచ్చిన తర్వాత కూడా..భక్తుల చావుకేకలు కొండపై ఇంకా ప్రతిధ్వనిస్తుండటం, టీటీడీ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. మొన్న కౌశిక్‌ అనే బాలుడు పులి పంజాకు బతికి బయటపడితే.. ఇప్పుడు లక్షితఅనే బాలికను పులి బలి తీసుకుంది.

ముఖం లేని కన్నబిడ్డను చూసి.. తల్లడిల్లిన తల్లి హృదయానికి తగిన దెబ్బ, నయం కావడానికి ఎన్నేళ్లు పడుతుంది? అసలు తిరుమల మెట్ల ద్వారంలో క్రూరమృగాలు సంచరిస్తున్న విషయం భక్తులకు తెలిసినా, టీటీ డీ-ఫారెస్ట్‌ దొరలకు తెలియకపోవడమే బాధ్యాతారాహిత్యం.

తాజాగా లక్షిత అనే చిన్నారి జీవితాన్ని చిరుత చిదేమిసిన ఘటన, ‘టీటీడీ మాటలరాయుళ్ల’ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. చిన్నారి లక్షిత కనిపించని రోజు నుంచి.. ఆసుపత్రి నుంచి నెల్లూరుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేంతవరకూ అటు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, కొత్త చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.. భూతద్దం వేసినా కనిపించకపోవడం మరో దారుణం. కనీసం కన్నబిడ్డ కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న ఆ కుటుంబానికి టీటీడీ చైర్మన్‌, ఈఓ పరామర్శ కూడా దక్కకపోవడం మరో విషాదం.

‘ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని’ కౌశిక్‌ను పులి ఎత్తుకెళ్లిన ఘటనలో ఈఓ ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. పులిని పట్టుకున్నప్పుడు ఆయన అక్కడికి వెళ్లారు. తలిదండ్రులకు ధైర్యం చెప్పారు. కానీ తాజా గుండెకోత ఘటనలో ధర్మారెడ్డి.. అసలు ఆ పరిసర ప్రాంతాల్లోనే కనిపించకపోవడం ఆశ్చర్యం.

బహుశా.. ఈ విషాదానికి ముఖం చెల్లక.. భక్తులకు ముఖం చూపించలేక ఈఓ ధర్మారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లకపోయి ఉండవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి మెట్ల మార్గంలో ఈ బలిదానాలు ఇంకెన్నాళ్లు? ఇంకెన్ని ప్రాణాలు మెట్లపాలయితే టీటీడీ స్పందిస్తుంది? భ క్తుల ప్రాణాలకు బాధ్యతఎవరిది?స్వామివారికి నిలువుదోపిడీ ఇచ్చేందుకు.. కానుకలు సమర్పించేందుకు మెట్లు ఎక్కుతున్న భక్తులు, అంతదూరం నుంచి వచ్చేది.. విగతజీవులుగా మారేందుకా? స్వామివారిని చూడకుండానే స్వర్గానికి పంపేస్తారా? అసలు అది నడక దారా? నరక దారా? ఇవీ.. ఇప్పుడు వెంకన్న భక్తులు, టీటీడీపై సంధిస్తున్న ప్రశ్నలు.

తిరుమల వెంకన్న మెట్ల మార్గం మృత్యుద్వారంగా మారుతోందన్న ఆందోళన, భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. దారిపొడవునా ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చే పులులు, ఎలుగబంట్లు ఎప్పుడు ఎవరి జీవితాలను కబళిస్తాయో తెలియని దయనీయంపై, ఆందోళన వ్యక్తమవుతోంది. అలిపిరి మార్గంలో చిరుత పులి పిల్లలు.. వెంకన్న స్వామి కంటే ముందుగానే భక్తులకు దర్శనమిస్తున్నా, అధికారులకు పట్టకపోవడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తాజాగా నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక, నిన్న రాత్రి ఏడున్నర సమయంలో మెట్ల మార్గంలో అదృశ్యమైంది. పదిగంటలదాకా తలిదండ్రులు పాప కోసం అన్వేషించినా ఫలితం లేదు. దానితో రంగంలోకి దిగిన పోలీసులు నరసింహస్వామి ఆలయం వద్ద, ఉదయం పది గంటల ప్రాంతంలో చెట్లపొదల్లో విగతజీవిగా మారిన చిన్నారి మృతదేహం కనుగొన్నారు.

రక్తసిక్తమైన కన్నబిడ్డ మృతదే హాన్ని చూసిన తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తన బిడ్డను తనకు తెచ్చివాలన్న ఆమె రోదన కన్నీరు తెప్పించింది. ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి, టీటీడీ-ఫారెస్టు శాఖ చెరో ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.

అయితే కౌశిక్‌ అనే బాలుడిని.. అదే మెట్ల మార్గంలో చిరుత ఎత్తుకెళ్లిన వైనం, టీటీడీ-ఫారెస్టు శాఖల కళ్లు తెరిపించకపోవడం, వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. నిజానికి గాలిగోపురం నుంచి నరసింహస్వామి దేవాలయం వరకూ, మధ్యలో ఉన్న ప్రాంతంలోనే జంతువుల సంచారం ఎక్కువ అని టీటీడీ అధికారులు ఎప్పుడో గుర్తించారు. కౌశిక్‌ అనే బాలుడిని పులి ఎత్తుకెళ్లిన తర్వాత.. ఆ మార్గం వరకూ భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. అంటే భక్తుల ప్రాణాలకు భక్తులే దిక్కు అని చెప్పకనే చెప్పినట్లన్నమాట.

అసలు కాలినడక దారి చుట్టూ ఫెన్సింగ్‌ వేయిస్తామని టీటీడీ అధికారులు చెప్పి చాలాకాలం అయిపోయింది. ఇలాంటి విషాదాలు జరుగుతున్నందున, రాత్రి వేళలో నడక దారి మూసేయాలన్న స్పృహ.. టీటీడీ బోర్డుకూ లేకపోవడం, బాధ్యతారాహిత్యమేనని భక్తులు మండిపడుతున్నారు. దానిపై చైర్మన్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్న ఈఓ ధర్మారెడ్డి వ్యాఖ్యలపై, భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇవన్నీ స్వామిపై భక్తుల్లో నమ్మకం కోల్పోయే చర్యలేనని భక్తులు మండిపడుతున్నారు.

కాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న రెండోరోజే, బాలిక బలి కావడాన్ని భక్తులు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న వేళావిశేషం, బాగోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలిక బలితో ఆయన పదవీకాలం ప్రారంభమైందన్న వ్యాఖ్యలు, అటు సోషల్‌మీడియాలోనూ చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE