Suryaa.co.in

Andhra Pradesh

పేదల క్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

-ప్యాపిలీలోని వెంగళాంపల్లి మీదుగా పిబిజి వరకు రూ.కోటితో కొత్త రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన
-డోన్ నియోకవర్గంలో ఇప్పటివరకూ దారే లేని చోట్ల చిట్టచివరి ఊళ్లకూ కొత్త రోడ్లు
-నియోజకవర్గ వ్యాప్తంగా 71 గ్రామాల్లో ట్యాంకులు నిర్మించి ఇంటింటికి మంచినీరు
-మంత్రి బుగ్గన చేతులమీదుగా రాష్ట్రోపాధ్యాయ సంఘం నూతన కాలెండర్ ఆవిష్కరణ
-వెన్నుపూస రవీంద్రారెడ్డిని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపు
-మార్చి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నేపథ్యంలో పోస్టర్ ఆవిష్కరించిన బుగ్గన

ప్యాపిలీ, నంద్యాల, డిసెంబర్, 29; ప్రజా క్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆయన సొంత నియోజకవర్గం డోన్ లోని ప్యాపిలీ మండలంలో గురువారం పర్యటించారు. ప్యాపిలీలోని వెంగళాంపల్లి మీదుగా పి.బి.జి వరకు కోటి రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు.

3.కి.మీ మేర వేయబోయే ఈ రోడ్డుకు భూమి పూజ నిర్వహించారు. ఎవరి కర్తవ్యం వారు సక్రమంగా నిర్వర్తించడం దేశ సేవతో సమానమని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. డోన్ నియోకవర్గంలో ఇప్పటివరకూ ఎప్పుడూ దారి లేని చోట్ల కూడా చిట్టచివరి ఊళ్లకూ రహదారులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా 71 గ్రామాల్లో ట్యాంకులు నిర్మించి ఇంటింటికి మంచినీరు అందించే బృహత్ కార్యక్రమం త్వరలోనే పూర్తవుతుందని మంత్రి తెలిపారు.

సౌమ్యుడు వెన్నుపూస రవీంద్రారెడ్డిని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆర్థిక మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు. ఎంతో మందికి సాయం చేసి, ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల రెడ్డి అని, ఆయన కుమారుడు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తారని మంత్రి పేర్కొన్నారు. ప్రజా సేవలో, అధికారంలో ఉన్న నాయకులకు ఓర్పు, సహనం కూడా చాలా ముఖ్యమన్నారు. మార్చి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నేపథ్యంలో తొలి పోస్టర్ ను ఈ సందర్భంగా బుగ్గన ఆవిష్కరించారు.

అనంతరం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మంత్రి బుగ్గన చురకలంటించారు. కరెంట్ బిల్లులు, రహదారుల బిల్లులు, చివరికి కోడిగుడ్ల బిల్లులు సహా రూ.40కోట్ల బకాయిలను గుదిబండగా గత ప్రభుత్వం పెట్టిపోయిందన్నారు. రూ. 10 వేల కోట్లు పసుపు కుంకుమలుగా ఎన్నికల ముందు పంచడం కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా అప్పులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2వేలకు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. మాఫీ చేయవలసిన మహిళల వడ్డీలు కూడా చేయకుండా వదిలేసి గత ప్రభుత్వం అన్ని విధాల పూర్తిగా విఫలమైందన్నారు.

LEAVE A RESPONSE