-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
-రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా నారాయణ బాధ్యతల స్వీకరణ సభ
కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.గురువారం బాగ్ లింగంపల్లి లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా పి. నారాయణ బాధ్యతలు స్వీకరించిన సభలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని, తద్వారా పరిశ్రమలు మూడు షిఫ్ట్ లలో పనిచేసే పరిస్థితి నెలకొందని, దీంతో కార్మికులకు చేతి నిండా పని లభిస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
పుష్కలంగా విద్యుత్తు, నీటి వసతుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని, పెట్టుబడులు పెడుతున్నారని వినోద్ కుమార్ తెలిపారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్ర భాగాన నిలుపుతూ ప్రజలు కార్మికులు రైతులు మహిళలు విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బి ఆర్ ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.