అసెంబ్లీ నా-జ్ఞాపకాలు
(శ్రీపాద శ్రీనివాస్)
అది 2004…ఏప్రియల్ 18, రాత్రి 10 గం. కావొస్తోంది
ప్రకాశం జిల్లా దర్శి, తల్లూరు, చీమకుర్తి, మర్రిపూడి, పొదిలి, కనిగిరి నుండి నెల్లూరు జిల్లా పామూరు, దుత్తలూరు… మీదుగా వైఎస్సార్ గారి ” జైత్రయాత్ర” ఉదయగిరి చేరుకుంది. నైట్ హాల్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో..!
నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర అనంతరం, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్ చేపట్టిన యాత్రే జైత్ర యాత్ర.
మొత్తం జైత్రయాత్ర నిర్దేశిత లక్ష్యం 5500 కి.మి … 168 అసెంబ్లీ .. 38 పార్లమెంట్ నియోజక వర్గాలను 20 రోజుల్లో కవర్ చేసే విధంగా రూపొందించబడి ఏప్రియల్ 5 వ తేదీ, 2004 నాడు తెలంగాణ లోని ” చేవెళ్ల” నుండి ప్రారంభం కాబడింది.
నాటి జైత్రయాత్రలో వైఎస్సార్ గారి టీమ్ లో ఆయన వ్యక్తిగత కార్యదర్శి రవిచంద్ గారితో నేను ఉన్నాను.
అక్కడ ఎన్నికల పోటీ హోరహోరీగా జరుగుతోంది.
అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కంభం విజయరాం రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ పక్షాన మేకపాటి చంద్రశేఖర రెడ్డి పోటీ చేస్తున్నారు.
అయితే ఆ రోజు ( ఏప్రిల్ 18, 2004) నాడు మా నైట్ హాల్ట్ శిబిరం (ఉదయగిరి) నుండి 20 కిమీ దూరంలో వున్న ” దుత్తలూరు” కు నేను ప్రయాణం అయ్యాను. అదికూడా వైఎస్ కాన్వాయ్ లోని కారును తీసుకుని.
అప్పటికి అక్కడ (ఉదయగిరి) స్థానిక పెద్దలు నాకు చెప్తూనే వున్నారు. ఈ రాత్రి వేళలో దుత్తలూరు వెళ్లొద్దు. రాజకీయ పరంగా సున్నితమైన ప్రాంతం. పైగా టీడీపీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం అని.
అయినా సరే నేను వాళ్ల మాట వినకుండా దుత్తలూరులో వుంటున్న నా స్నేహితుడు కాకర్ల మధుసూదనరెడ్డిని చూద్దామని బయలు దేరాను. నా మిత్రుడు దుత్తలూరు మండల తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షుడు కూడా!
నేను దుత్తలూరు చేరుకునేటప్పుటికి రాత్రి 11 కావొస్తోంది. నేరుగా నా మిత్రుని ఇంటివద్ద కారును అపాను. నా మిత్రుడు అప్పుడు ఇంటి దగ్గర లేడు.
సరిగ్గా ఆ సమయంలో…ఆ ప్రాంతంలోనే వున్న టీడీపీ క్యాడర్ నన్ను అనుమానాస్పదంగా చూస్తూ ఘర్షణకు దిగే ఉద్దేశంతో అన్నట్టుగా కోపంగా నాదగ్గరకు రాసాగారు.
ఆ క్షణంలో బిత్తర పోవడం నా వంతు అయ్యింది.
వారందరి ఆగ్రహానికి కారణం అంతకు ముందు రోజు కాంగ్రెస్ – టీడీపీ వర్గాలు ఘర్షణపడి పరస్పరం దాడులు చేసుకున్నాయి.
నా కారు మీద కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు వున్నాయి. నేను కారును ఆపించింది టీడీపీ నాయకుని ( నా మిత్రుడు) ఇంటి ముందు.
ఇంత రాత్రి పూట కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ నాయకుని ఇంటిమీద దాడి చేయడానికి వచ్చారేమో అని అక్కడ వారు భావించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
సరిగ్గా అప్పుడే ఇంటి వద్దకు చేరుకున్న నా మిత్రుడు మధుసూదన రెడ్డి అక్కడ వారిని శాంతింపచేసి, నన్ను అక్కడ నుండి పంపేశాడు.
అసలు యవ్వారం ఇక్కడే ప్రారంభం అయ్యింది.
నేను తిరిగి ఉదయగిరికి వెళ్తూ వెళ్తూ, దుత్తలూరు సెంటర్ లోని ” పద్మజా ఫిల్లింగ్ స్టేషన్” లో నా వెహికల్ కి పెట్రోల్ కొట్టిద్దామని ఆగాను.
కానీ ఆ బంక్ వాళ్ళు నా వాహనానికి పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ బంక్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాం రెడ్డి బంక్. నా వాహనానికి కాంగ్రెస్ జెండాలు ఉండటంతో వారికి నామోషీ వచ్చింది. కాస్త రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడారు అక్కడ సిబ్బంది నాతో.
దానితో కాస్త మాట మాట పెరిగి, వ్యాపారాన్ని వ్యాపారంగా చేసుకోక రాజకీయలు ఏంటి ఇక్కడ కూడా అంటూ కాస్త నేను అక్కడ వారిపై ఆరవసాగాను..
సరిగ్గా అదే సమయంలో తన ప్రచారం ముగించుకుని అటువైపుగా వచ్చారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యే అయిన కంభం విజయరాం రెడ్డి గారు.
మా ఘర్షణ అంతా విన్నారు.. నేను దుత్తలూరుకు వచ్చిన నేపథ్యం, నా మిత్రుని ఇంటివద్ద నుండి ఇక్కడ వరకు జరిగిన విషయాన్ని ఆయనకు కాస్త కోపంతోనే చెప్పాను.
“అయినా ఇదెక్కడ పద్దతి సార్… మిత్రుని చూడటానికి వస్తే రాజకీయాలను అంటగట్టి అవమానిస్తారా? నన్ను ముట్టడి చేసే ప్రయత్నం సరైనదేనా?
నేను “జక్కంపూడి” మనిషిని ఇలాంటి వాటికి భయపడను. అంటూ కాస్త ఆవేశంతో “నా ఊత పదాన్ని” వాడేసాను.
ఈలోపుగా నా మిత్రుడు ” మధుసూదన రెడ్డి” అక్కడికి చేరుకుని ” విజయరాం రెడ్డి” గారి చెవిలో ఏదో చెప్పాడు.
కొన్ని క్షణాల తరువాత “విజయ రాం రెడ్డి” గారు నా భుజం మీద చెయ్యి వేసి….
” స్వామి…నీకు అంత కోపం ఎందుకు? నువ్వు “జక్కంపూడి” మనిషివే.. ఎవరు కాదు అన్నారు ఇప్పుడు చెప్పు. ప్రస్తుతం నువ్వు మంచి ఆకలి మీద వున్నట్టు వున్నావు. ముందు కాస్త చెయ్ కడుక్కో. ఇద్దరం కాస్త తిండి తిందాం అంటూనే…
తన అనుచరులు, పెట్రోల్ బంక్ సిబ్బంది వైపుతో పాటు నా మిత్రుని వైపు కూడా కాస్త కోపంగా చూస్తూ.. మన ఊరు వెతుక్కుంటూ వచ్చిన వారి పట్లా ఇలాగేనా వ్యవహరించడం? ఏదైనా ఉంటే కడుపు నింపి మాట్లాడుకోవాలి అంటూ చివాట్లు పెట్టసాగారు.
ఈలోపు ఆయన తెప్పించిన బోజనాన్ని తినడం ముగించి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యాను. అప్పటికే నా వెహికిల్ లో పెట్రోల్ ట్యాంక్ నింపించి సిద్దం చేయించారు విజయరాo రెడ్డి గారు.
“బాగా పొద్దు పోయింది స్వామి. ఉదయగిరి చేరుకునే వరకు మరో వాహనంలో నా వాళ్ళు నీకు తోడుగా వస్తారు. నువ్వు జాగ్రతగా వెళ్ళు… అయితే ఒక్క మాట స్వామి… నువ్వు వైఎస్సార్ గారి మనిషివి. ఆ విషయం ఇక్కడ ప్రస్తావించకుండా, ఎక్కడో వున్న ” జక్కంపూడి” మాటను ప్రస్తావించావు. అంటే నువ్వు అభిమానించే వారి విషయంలో ఎంత కమిట్మెంట్ చూపుతావో నాకు అర్దం అయ్యింది. ఈరోజు నుండి నువ్వు మాకు కూడా ఆప్తుడివే అంటూ” కంభం విజయ రాంరెడ్డి గారు నవ్వుతూ సాగనంపారు.
అప్పటినుండి ఇప్పటి వరకు నెలకి ఒక్కసారైనా ఫోన్ లో ఒకరి యోగ క్షేమాలను ఒకరం తెలుసుకుంటూ వుంటాం. రాజకీయ అంశాలపై మాట్లాడుకుంటూ వుంటాం.
ఫిబ్రవరి, 2025 రాజమండ్రిలో జరిగిన నా నాలుగో పుస్తకం ” అంతరంగం” ఆవిష్కరణకు తన పరివారంతో వచ్చి కంభం విజయరాంరెడ్డి గారు నన్ను ఆశీర్వదించి… ఈ విషయాలన్నీ తన స్పీచ్ లో చెప్పడం కూడా జరిగింది.