– ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డా.ధీరజ్ కకాడియ
అమరావతి: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ‘ప్రెస్ కౌన్సిల్ చట్టం, 1978’ కింద ఏర్పాటు అయిన సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ చట్టబద్ధమైన సంస్థని, ఇది భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటం, వార్తాపత్రికలు, వార్తా సంస్థల ప్రమాణాలను నిర్వహించడం, మెరుగుపరచడం అనే రెండు లక్ష్యాలతో ఏర్పాటు అయినట్టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ ధీరజ్ కకాడియ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన డీవో లేఖలో తెలిపారు. అంతేగాక ప్రెస్ కౌన్సిల్ సెక్రటేరియట్ సూచ్నా భవన్, సీజీవో కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీలో ఉందని దీనికి దాని తరపున పని చేయడానికి ఏ రాష్ట్ర శాఖ లేదా అధికృత/ఏ ఇతర సంస్థ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదే పేరును ఇతర ప్రెస్ సంస్థలు ప్రెస్ కౌన్సిల్ అనే పదాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఆ విధంగా వినియోగించడం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థాగత విలువను క్షీణింపజేయడమే కాకుండా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేక డొమైన్, శీర్షికను కూడా ఉల్లంఘించినట్టు అవుతుందని డాక్టర్ కకాడియా స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మరే ఇతర సంస్థ అయినా ‘ప్రెస్ కౌన్సిల్ ‘ అనే పదాన్ని ఉపయోగించడం, చిహ్నం, పేర్లు(అనుచిత వినియోగం నివారణ)చట్టం, 1950 లోని ఎంట్రీ 7(ii) తో చదవబడిన సెక్షన్ 3 ను ఉల్లంఘించడమేనని న్యాయ వ్యవహారాల శాఖ అభిప్రాయపడిందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ కకాడియా పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా “ప్రెస్ కౌన్సిల్”/లేదా దాని హిందీ సమానమైన ” भारतीय प्रेस परिषद ” అనే పేరును ఉపయోగించి ఏదైనా స్థానిక లేదా ప్రభుత్వ సంఘం/సంస్థ రిజిస్ట్రేషన్‌ను నిషేధించడానికి లేదా సరిదిద్దడానికి అవసరమైన తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.