Suryaa.co.in

Telangana

డ్యూటీకి రాకుండా మస్టర్ పడితే వేటు

-అటెండెన్స్ పడ్డాక ఆఫీసు దాటితే ఉపేక్షించేది లేదు
-క్రమశిక్షణ, సమయ పాలన పాటించని ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు
-భూ గర్భ గనుల్లో రోజూ అధికారులు పని ప్రదేశాలు తనిఖీ చేయాలి
-కంపెనీ మనుగడ సాగాలంటే పని సంస్కృతి మరింత మెరుగుపడాల్సిందే
-సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టీకరణ

సింగరేణి భవన్: సింగరేణి లో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు.

గనులు, కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు డ్యూటీలకు రాకున్నా కూడా మస్టర్ పడుతున్నట్లు.. మరి కొందరు మస్టర్ పడి బయటకు వెళ్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలాగే భూ గర్భ గనుల్లో పని ప్రదేశాలను సంబంధిత అధికారులు రోజూ తనిఖీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

సింగరేణిలో ఉద్యోగులు, అధికారులంతా కూడా ఇకపై రోజూ తప్పనిసరిగా బయో మెట్రిక్ అటెండెన్స్ నమోదు చేసుకోవాలని.. దీనిపై ఆయా ఏరియా జీఎంలు, విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భోజన విరామం పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో మళ్లీ సీట్లలో కూర్చొని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లంచ్ బ్రేక్ లో చాలా మంది మూడు గంటల పాటు విరామం తీసుకోవడం ద్వారా తమ పనులు/ ఫైళ్లు పెండింగ్ లో ఉంటున్నాయని పలువురు సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సెక్యూరిటీ విభాగం ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు.

గతంలో సింగరేణి ఆసుపత్రులలో, డిస్పెన్సరీలలో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే మెమోలు జారీ చేసిన ఆయన ఇప్పుడు సమయ పాలనను పాటించని వారిపైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

సింగరేణిలోని ప్రతి ఉద్యోగి, అధికారి కచ్చితమైన సమయపాలన పాటించాలని, డ్యూటీలో చేరిన తర్వాత బయటకు వెళ్ళటం గాని, పని చేయకుండా కూర్చోవడం గాని చేయకూడదన్నారు. ఈ విషయంలో ఎంతటి పెద్ద వారైనా, పలుకుబడి ఉన్నవారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారని.. వారికి సంబంధించిన సంక్షేమం, ఇతరత్రా పనులను నిర్వర్తించే ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. అలాగే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులలో కొందరు ఏదో ఒక కారణం చూపి , తాము పనిచేసే కార్యాలయాలను వదిలి వరండాల్లో తిరగడం, బయటికి వెళ్లడం, కబుర్లతో కాలక్షేపం చేస్తే సంబంధిత విభాగాధిపతులపై చర్యలు ఉంటాయన్నారు. దీనిపై నిఘా విభాగం నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోకి అడుగులు పెడుతోందని.. కంపెనీ ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని.. ఇందులో ఉద్యోగులు, అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడం అత్యవసరమన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంతో పోటీ పడుతున్న మన సంస్థ మనుగడ సాగాలంటే పని గంటలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఒక క్రమశిక్షణ గల సంస్థగా సింగరేణిని రూపుదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎక్కువ మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సంస్థ పట్ల అభిమానంతో, వేరెవరో చెప్పే అవసరం లేకుండానే తమకు ఇచ్చిన పనిని అంకిత భావంతో పూర్తి చేస్తున్నారని, డ్యూటీ సమయం మొత్తం పని చేస్తున్నారని, అటువంటి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

కానీ కొందరు విధులకు గైర్హాజరవుతూ, మస్టర్ పడికూడ బయటకు వెళ్లడం లేదా డ్యూటీలో ఉండి కూడా పనిచేయకుండా ఉంటున్నారని, ఇలాంటి వారి వల్ల ఇతరులు కూడా పాడైపోయే అవకాశం ఉందనీ హెచ్చరించారు. పని సంస్కృతిని దెబ్బతీస్తే యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని.. అవసరమైతే క్రమశిక్షణ లేని ఉద్యోగులను విధుల నుంచి తొలగించడానికి వెనకాడబోమన్నారు.

కార్పోరేట్ లో 32 మంది ఆలస్యంగా…
సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఆదేశాల మేరకు సింగరేణి సెక్యూరిటీ విభాగం వారు మంగళవారం ఉదయం కొత్తగూడెంలోని సింగరేణి కార్పోరేట్ ఆఫీసులో ఉద్యోగులు విధులకు వచ్చే సమయాన్ని, భోజనానికి వెళ్లే సమయాలను రికార్డు చేశారు. ఆలస్యంగా వచ్చిన 32 మంది ఉద్యోగుల వివరాలను సంబంధిత శాఖలకు పంపించారు. ఆయా విభాగాల అధిపతులు వారిని మందలించారు. ఇకపై నిరంతర ప్రక్రియగా సమయ పాలనను నమోదు చేయడం జరుగుతుందని సీఎండీ స్పష్టం చేశారు. ఉద్యోగుల పని సంస్కృతిని పరిశీలించేందుకు అన్ని ఏరియాల జీఎంలు కార్యాలయాల్లో, గనుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE