Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ వద్ద గోడు వెళ్ళబోసుకున్నామన్న కక్షతో రూ.30 లక్షల పరిహారం నిలుపుదల!

• మృతి చెందిన కానిస్టేబుల్‌ భార్యను వేధించిన వైసీపీ సర్కారు
• మంజూరైన ఇంటిని తొలగించారని ఆవేదన
• బతుకుదెరువు కోసం పోతే భూమి కబ్జా
• నామినేటెడ్ పదవుల కోసం పోటెత్తిన నేతలు
• అర్జీలు స్వీకరించిన మంత్రి ఫరూక్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి

మంగళగిరి: కానిస్టేబులైన తన భర్తను దారుణంగా చంపడంతో.. యువగళం పాదయాత్రలో నేటి మంత్రి నారాలోకేష్ ను నాడు కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నందుకు.. అప్పటి నాయకులు, పోలీసు అధికారులు తమను ఎస్పీ ఆఫీసుకు పిలిపించి లోకేష్ ను ఎందుకు కలిశారంటూ నిలదీసి తమపై కక్షగట్టారని నంద్యాలకు చెందిన శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు రావాల్సిన బెన్ఫిట్స్ రూ. 30 లక్షల పరిహారం.. స్పెషల్ కేసు కింద పరిగణించి కల్పిస్తామన్న ఉద్యోగం ఇవ్వకుండా అడ్డుకున్నారని.. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆమె ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఫరూక్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. అలాగే, పలువురు అర్జీ దారుల నుండి వారు వినతులు స్వీకరించారు.

• అనంతపురం టౌన్ కు చెందిన కృష్ణవేణి విజ్ఞప్తి చేస్తూ.. గత టీడీపీ గవర్నమెంట్ లో తమకు టీడ్కో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు అవ్వగా.. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి రెండు విడతల్లో రూ. 50 వేలు కట్టామని.. తరువాత ప్రభుత్వం మారడంతో.. తమకు ఇళ్లు మంజూరై డబ్బులు కట్టిన ఇంటిని కూడా రాకుండా చేశారని.. తమకు డబుల్ బెడ్ రూమ్ హౌస్ ఇప్పించి ఆదుకోవాలని ఆమె వేడుకున్నారు.
• అల్లూరి జిల్లా, ముంచింగిపుట్టు మండలం దొరగూడ గ్రామానికి చెందిన సర్పంచ్ లక్షణ్, అలాగే కించాయి పుట్టు పంచాయతీకి చెందిన పలువురు గిరిజనులు తమ గ్రామంలో విద్యుత్, రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని… గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కూడా దారిలేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయని దయచేసి రహదారి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు.
• కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండలం వెల్దుర్తికి చెందిన కటక బీబి విజ్ఞప్తి చేస్తూ.. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్ లైన్ లో తమ పేరుమీద ఎక్కించమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని.. తమ భూ సమస్యను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
• ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం సుంకేసుల గ్రామానికి చెందిన పానుగంటి రంగయ్య విజ్ఞప్తి చేస్తూ.. వెలుగొండ ముంపు గ్రామాల్లో తమకు నష్టపరిహారం అందకుండా చేస్తున్నారని… 15 ఏళ్లుగా పోరాడుతున్నా పరిహార లిస్ట్ లో తమ పేరు మాత్రం రావడం లేదని అధికారులు చర్యలు తీసుకుని పరిశీలించి నష్టపరిహారం వచ్చేలా చూడాలని నేతలను కోరారు.
• విజయవాడ భవానీపురానికి చెందిన ఎం. సలోమీ తో పాటు పలువురు వరద బాధితులు గ్రీవెన్స్ కు వచ్చి తమకు వరద పరిహారం అందలేదని కలెక్టరేట్ కు వెళితే పట్టించుకోకపోవడంతో.. గ్రీవెన్స్ కు వచ్చామని చెప్పడంతో వెంటనే మంత్రి ఫరూక్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను తెలిపి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. బాధితులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపి వెళ్లారు.
• కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ మండలానికి చెందిన సూర్యరావుపేట మాజీ గ్రామ సర్పంచ్ విజ్ఞప్తి చేస్తూ.. మత్స్యకారులైన నిరుపేదలకు ఇచ్చిన భూమిలో మట్టి ఫిల్లింగ్ బిల్లులు రాలేదని.. అలాగే గ్రామంలో రామాలయం, స్కూల్ , బ్రిడ్జి కొరకు దాదాపు రూ. 15 లక్షల వరకు ఖర్చు పెట్టానని.. అవి అన్నీ బయట వడ్డీలకు తెచ్చి ఖర్చు పెట్టానని తాను ఇప్పుడు అప్పుల్లో ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి తన కొడుకు చదవుకు సాయం చేయాలని వేడుకున్నారు.
• తమ తండ్రికి ప్రభుత్వం 1979 లో ఇచ్చిన అసైన్ మెంట్ భూమి వేరొకరి పేరుమీదకు మారిందని.. రైతు భరోసాకు దరఖాస్తు చేయగా ఆ విషయం తెలిసిందని తమ భూమి తమకు ఉండేలా చూడాలని అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం అమలాపురం పంచాయతీకి చెందిన రేళ్ళు జగ్గారావు అతని కుటుంబ సభ్యులు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
• తాము బతుకుదెరువు కోసం వలస వెళితే తమ భూమిని కబ్జా చేశారని.. కబ్జాదారులు దస్తగిరి, జమ్మన్న, కేశన్న, తిరుమల కేశన్న ల నుండి తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం ఆలువాల గ్రామానికి చెందిన పారె ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
• తాము టీడీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ అధికారం పోయాక తమ ఇంటి స్థలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించారని.. తాను డయాలసిస్ పేసెంట్ నని తన ఇంటి ఆక్రమణను వైసీపీ నేతల నుండి తొలగించి తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని.. అలాగే తనపై ఉన్న అక్రమ కేసులు తొలగించాలని గుంటూరు జిల్లా, తాడికొండ మండలం కర్లపూడికి చెందిన వెంకాయమ్మ నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• ఏలూరు జిల్లా, కామవరపుకోట పంచాయతీలోని గిరజనులైన నాయక్ తెగకు చెందిన వారికి ఎస్టీ కుల సర్టిఫికేట్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వారి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కామవరపుకోట టీడీపీ నాయకులు గ్రీవెన్స్ లో అర్జీ అందించారు.

గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వలన ఉండాల్సిన భూమికంటే తగ్గించి చూపడం.. టీడీపీకి సానుకూలంగా ఉన్నారన్న నేపంతో అందాల్సిన సంక్షేమ పథకాలను తమకు ఇవ్వలేదంటూ కొందరూ… టీడీపీ పార్టీ కోసం కృషి నామినేటెడ్ పదవులను ఆశిస్తూ.. పెద్దఎత్తున పార్టీ నేతలు.. ఆర్థిక సమస్యలు, సీఎంఆర్ఎఫ్ సాయం కోసం, పింఛన్ల కోసం రాగా.. వీరితో పాటు పలువురు తమ సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు అందించారు.

LEAVE A RESPONSE