Suryaa.co.in

Andhra Pradesh

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబుకు కుప్పంలో దొంగ ఓట్లు ఇప్పుడే గుర్తొచ్చాయా..?

-కుప్పంలో టిడిపి నేతలు అమరనాధరెడ్డి, పులివర్తినానిలు దౌర్జన్యాలు చేస్తున్నారు.
-కుప్పం పర్యటనలో లోకేష్ న్యాయస్ధానాల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు.
-మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కుట్రలకు తెరలేపింది.
-చంద్రబాబు రాజకీయ విలువలను దిగజారుస్తున్నారు
– టిడిపి అక్రమాలపై రాష్ర్ట ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్సి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు
మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉపఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు,అరాచకాలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎంఎల్సి లేళ్ళ అప్పిరెడ్డి, ఎంఎల్ ఏ మొండితోక జగన్మోహన్ రావులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం లేళ్ళ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో అలజడులు,ఆటంకాలు సృష్టించాలని,శాంతిభధ్రతల సమస్య నెలకొనేలా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కుప్పం మున్సిపాలిటిలో ఓటర్ కాకపోయినప్పటికి కుప్పంకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ఆయన స్వగ్రామం నారావారి పల్లె అని మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఓటర్ గా ఉన్నారని వివరించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని అన్నారు.
తమ పార్టీ ప్రజలపై నమ్మకం,ఓటర్లపై విశ్వాసంతో ముందుకు వెళ్తుందన్నారు. దొంగఓట్లు వేసుకోవడం ద్వారా, డబ్బులు పంచడం ద్వారా గెలవాలనే ఉధ్దేశంతో… ఎన్నికలలో దౌర్జన్యాలు,అరాచకాలు,హింసకు పాల్పడే కల్చర్ తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించి తద్వారా ప్రజల ఆశీర్వాదాలు కోరతామన్నారు. వారు నిండుమనస్సుతో ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకు ఉందన్నారు. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాలని చట్టాలు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.
చంద్రబాబు రాబోయే ఓటమికి సాకులు వెదుకుతున్నారని, దానిలో భాగంగా కుప్పంలో దొంగఓట్లు అంటూ కొత్తపల్లవి అందుకున్నారని అన్నారు. ఓడిపోయే సమయంలో ఇలాంటి సాకులు రెడీ చేసిపెట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందనే విషయం ప్రజలందరికి తెలుసన్నారు. ఏడు సార్లు కుప్పం నుంచి ఎంఎల్ఏ గా గెలిచిన చంద్రబాబుకు అక్కడ దొంగఓట్లు ఉన్నాయనే విషయం ఇప్పుడు గుర్తుకురావడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదుకు సంబంధించి తగిన ఆధారాలు కూడా ఎన్నికల కమీషన్ కు అందచేశామని అప్పిరెడ్డి తెలియచేశారు. కమిషన్ ను కలిసిన వారిలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE