– హోంమంత్రి వంగలపూడి అనిత
-వైసీపీ సోషల్మీడియా దుష్ప్రచారంపై ఆగ్రహం
విజయవాడ: రాష్ట్రంలో గణేష్ మండపాల అనుమతులకు సంబంధించి ఎలాంటి రుసుములు లేవని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ సోషల్మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విధించిన రుసుమును కూడా తమ ప్రభుత్వం ఎత్తివేసిందని వెల్లడించారు.
2022లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి జీవో ఇచ్చింది. మేము ఆ జీవోలో ఉన్న దానిని చెప్పామంతే. కానీ, సింగిల్ విండో విధానంలోనే గణేష్ మండపాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ జీవోలో ఉన్న అంశాలను సీఎం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాలను మేము 10 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాం. గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. మైక్ పర్మిషన్ కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.