Suryaa.co.in

Andhra Pradesh

జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు వైకాపా వీడే ఛాన్స్

-పక్క పార్టీల వైపు చూస్తున్న కృష్ణా జిల్లాలోని మాజీ మంత్రి ఒకరు
-టికెట్లకు డిమాండ్ లేదని రేట్లు తగ్గించిన వైకాపా అధిష్టానం
-175 కు 175 స్థానాలు గెలుస్తామన్న వైకాపా అధిష్టానం… ఇప్పుడు అత్యధిక స్థానాలలో గెలుస్తామంటూ కొత్తరాగం
-జగన్ ప్రభుత్వ అక్రమాలపై రామోజీరావు పోరాడిన తీరు నేటి యువత, మధ్యతరం వారికి స్ఫూర్తిదాయకం
-నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును పరిశీలిస్తే… రాష్ట్రంలో గాంధేయ మార్గంలోనూ నిరసన తెలిపే అవకాశం లేదన్నది స్పష్టం
-భీమవరంలోని విష్ణు కాలేజీ రోడ్డులో గోతులను కప్పెట్టేందుకు అవసరమైతే ఎంపీ నిధులను వినియోగించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అధికార వైకాపాను వీడే అవకాశాలు ఉన్నాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు తెలిపారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దు బాబోయ్ అంటే… మాకొద్దని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారంటే, వైకాపా మునిగిపోయే పడవని వారికి అర్థమైంది. ప్రజా తీర్పు అధికార వైకాపాకు వ్యతిరేకమని తేలడంతో, చిల్లుపడ్డ పడవ నుంచి దూకి ఒడ్డుకు చేరుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది .

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాజకీయాల పట్ల సంపూర్ణ అవగాహన ఉండి ధైర్యం కలిగిన వారు వైకాపాను వీడేందుకు సిద్ధమవుతున్నారన్నారు. వైకాపా అధిష్టానం అరాచకాలు, శాసనసభ్యులను అగౌరవపరచడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు వారిని తీవ్రంగా కలిచి వేసి, ఈ నిర్ణయానికి పురి గొల్పియాని అన్నారు .

జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా సార్ అని పిలవాల్సిందేనట…!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా సరే సార్… అని పిలువాల్సిందేనట అని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసే వారిని ఆయన అన్న… అని పిలిస్తే, ఎదుటివారు కూడా ముఖ్యమంత్రిని అన్న అని సంబోధించడాన్ని బ్యాన్ చేశారట అంటూ అపహాస్యం చేశారు . ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి అన్న అని పిలిస్తే, ఎదుటి వ్యక్తులు మాత్రం ఆయన్ని సార్ అని పిలవాల్సిందేనట. ఈ విషయాన్ని ముందుగానే ముఖ్యమంత్రి పిఎస్ రెడ్డి, పిఏ రెడ్డిలు జగన్మోహన్ రెడ్డి ని కలిసే వారికి చెబుతారట. సార్ అని పిలవకపోతే మరొకసారి మీకు కలిసే అవకాశం లభించదని చెప్పడంతో, అందరూ కూడా ముఖ్యమంత్రిని సార్ అని మాత్రమే పిలుస్తున్నట్లు తెలుస్తోంది.

రానున్న మూడు నెలలు ముఖ్యమంత్రి ఎలా కావాలంటే, అలానే పిలుస్తారు. వైకాపాను వీడే వారి సంఖ్య రోజుకింత దినదిన ప్రవర్ధమానం అవుతోంది. పార్టీలో గౌరవం లేకపోవడం, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే అడ్వాన్సు డబ్బులు డిపాజిట్ చేయమని చెప్పడం, ఎలాగో ఓడిపోతామని తెలిసి డిపాజిట్లు చెల్లించేందుకు ఎవరు ముందుకు రాకపోతే బెదిరింపులకు దిగడం వంటి సంఘటనలు పాల్పడుతున్నారు. దీనితో బ్రతికుంటే బలుసాకు తినవచ్చని శాసన సభ్యులంతా పారిపోతున్నారు. డిపాజిట్లు చెల్లించేందుకు బేరాలు రాకపోవడంతో, ఎమ్మెల్యే టికెట్ల రేట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇటీవల మూడు జిల్లాలలో వేరే సంస్థ చేత నిర్వహించిన సర్వే నివేదిక అందింది.

నా టెలిఫోన్ సర్వే ద్వారా వచ్చిన ప్రాథమిక అంచనా నివేదికకు ఆల్మోస్ట్, ఆ సర్వే సంస్థ నివేదిక సరిపోయింది. రానున్న ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓడిపోనుంది. దీనితో, పార్టీ నాయకత్వం మరమ్మత్తులు ప్రారంభించింది. ఈ సందర్భంగా పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు పార్టీయే శాశ్వతం కాదని నేను చెబుతున్నాను. అతి తక్కువ సీట్లు వస్తాయని తెలుసుకున్న తర్వాత ఇంత నియంతృత్వంగా, ప్రజాస్వామ్యానికి చాలా దూరంగా ఉండే నా ప్రస్తుత పార్టీ మనుగడ సాగిస్తుందని నమ్మకం నాకు లేదు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటామని, ఆ సర్వేలలో తేడా ఉంటే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మారుస్తూ ఉంటారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ప్రస్తుత శాసనసభ్యులలో 75 నుంచి 80 మందిని మారుస్తారట. అందులో 50 మందికి రానున్న ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వరని తెలుస్తోంది. 11 మందికి పార్టీ నాయకత్వం అప్పుడే స్థానభ్రంశాన్ని కలిగించింది. ఆ లాజిక్ ఏమిటో అర్థం కాలేదు. ఎందుకంటే, చిలకలూరిపేట నియోజకవర్గానికి, గుంటూరు నియోజకవర్గానికి మధ్య పెద్ద దూరం లేదు. చిలకలూరిపేటలో మంత్రి రజిని పనికి రాకపోతే, గుంటూరులో ఎలా పనికి వస్తారు?!. గుంటూరులో పనికి వచ్చే వ్యక్తి అయితే, చిలకలూరిపేట లోను కూడా ఆమె పనికి రావచ్చని రఘురామకృష్ణం రాజు అన్నారు.

గతంలో ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని చెప్పారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ వీక్ అయిపోయిందని స్పష్టమవుతుంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల బొమ్మనే పనిచేయాలని అనుకుంటున్నారేమో. ముగ్గురు మంత్రులకు స్థానభ్రంశాన్ని కలిగించారు. అంటే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు అధ్వానంగా ఉందని ముఖ్యమంత్రి అంగీకరించినట్లే. 11 మందిని నిన్నటికి నిన్న మార్చారంటే, ఇంకా వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పడంలో అర్థం ఉందా?, ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మంత్రులు రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ వద్దని అంటున్నారు. అయినా, వై ఏపీ నీడ్స్ జగన్ అని సోది కబుర్లు చెబుతూ వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాధించింది శూన్యమని రఘు రామ కృష్ణంరాజు విమర్శించారు

ప్రతి జిల్లాలోనూ పార్టీలో అసంతృప్తి పెల్లుబికుతుంది
ప్రతి జిల్లాలోనూ పార్టీలో అసంతృప్తి పెల్లుబికుతోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనకు తీవ్ర అన్యాయం చేశారన్నది పచ్చి నిజం. పార్టీ అధినేతను ఆళ్ల రామకృష్ణారెడ్డి గుడ్డిగా నమ్మారు. అతని సేవలు ఇంకా పార్టీకి వాడుకుంటామని, ఎవరిని వదులుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది.

మంగళగిరిలో తొలుత బోటా బోటి మెజారిటీతో నెగ్గిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆ తరువాత అప్పటి మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో నెగ్గారు. అటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి రానున్న ఎన్నికల్లో నెగ్గకపోతే, ఇంకా పార్టీ తరపున పోటీ చేసేవారు ఎవరు నెగ్గుతారన్నది ప్రశ్నార్థకమే. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజలతో కలిసి పోయే వ్యక్తి ఓడిపోతాడన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినప్పుడు, ఇంకా గెలిచేవారు ఎవరు అన్నది పార్టీ నాయకత్వమే సమాధానం చెప్పాలి.

ఎక్కడ సర్వే నిర్వహించిన, అక్కడ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయంటే, దానికి కారణం ఎమ్మెల్యేలు కాదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే, వారిని మార్చేస్తున్నానని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసే ఓటేస్తారని అన్నప్పుడు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారిని మారుస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైకాపా ఎమ్మెల్యే టికెట్ మాకొద్దంటే మాకొద్దనే వారి సంఖ్య రోజుకింత దినదినాభివృద్ధి చెందుతోంది. రానున్న ఎన్నికల్లో నా ప్రస్తుత పార్టీ కనివిని ఎరుగని రీతిలో పరాభవాన్ని చవిచూస్తోంది. ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేయాలనుకునేవారు, అడ్వాన్స్ గా డబ్బులు కట్టవద్దని, రానున్న ఎన్నికల్లో వైకాపా దారుణంగా పరాజయం చెందడం ఖాయమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ప్రభుత్వ ఖర్చే కదా అని హైకోర్టుకు వెళ్తారేమో..?!
మార్గదర్శి సంస్థ ఆస్తుల జప్తు కేసు ను న్యాయస్థానం కొట్టివేయడంతో, ప్రభుత్వ ఖర్చే కదా అని పాలకులు హైకోర్టును ఆశ్రయిస్తారేమోనంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఎక్కడకు వెళ్లినా శృంగభంగం తప్పదు. అసలు ఈ కేసులో మ్యాటర్ అన్నదే లేదు.

మార్గదర్శి సంస్థకు చెందిన 10 50 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయాలని సిఐడి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆస్తులను జప్తు కూడా చేసింది. ఆస్తుల జప్తుపై మార్గదర్శి సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం, ఈ ఆస్తుల జప్తు చెల్లదని స్పష్టం చేసింది.

అయితే ఆస్తుల జప్తు గురించి సాక్షి దినపత్రిక గతం లో మొదటి పేజీలో తాటి కాయంత అక్షరాలతో రాసి, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును చివరి పేజీలో మూడు అక్షరాలతో రాయడం విస్మయాన్ని కలిగించింది. వ్యక్తిగత కక్షతో వేధింపులకు గురి చేసిన పాలకులపై పద్మ విభూషణ్ రామోజీరావు అవిశ్రాంతంగా పోరాడారు. నీతి నిజాయితీతో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపారు. వయసు మీద పడుతున్న ఆయన చూపిన పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. యువతరం, మధ్యతరం ఆయన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. అన్యాయం జరిగినప్పుడు సరెండర్ కాకుండా ఎలా ఫైట్ చేయాలన్నది రామోజీరావు చేతల్లో చేసి చూపించారు. ఇప్పటికైనా పాలకులు కక్షపూరిత రాజకీయాలను, అక్రమ అరెస్టులను మానుకోవాలి.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసిన ఫోటోలను న్యాయస్థానం పరిశీలించి, బెయిల్ మంజూరు చేసింది. అధికారంలో ఉన్నవారు చెప్పారని అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తే అంతిమంగా పోలీసులే వాటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వై నాట్ వన్ 175 అని చెబుతున్నారని తప్పుడు సర్వేలను చూసి అందులో కొద్దిగానైనా సీట్లు రాకపోతాయా? అని భ్రమ పడే పోలీసులు అసలు విషయాన్ని గ్రహించాలన్నారు. వైకాపాకు 15కు మించి స్థానాలు వచ్చే పరిస్థితి లేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. రామోజీరావు పై, నాపై చెత్త కేసులు పెట్టారు ఇకనైనా ఇటువంటి తప్పుడు కేసులను నమోదు చేయడం మానుకోవాలని సూచించారు.

ఇంకా ఆటవిక, అనాగరిక విధానాలను కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
మరో రెండు నెలల వ్యవధిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో అధికార పార్టీ నాయకులు ఆటవిక, అనాగరిక విధానాలను కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ను టైకూన్ కూడలి వద్ద అక్రమంగా అరెస్టు చేయడం దారుణం. ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధేయ మార్గంలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈనెల 20వ తేదీన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభను తెదేపా, జనసేన శ్రేణులే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

మిత్రపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా సినిమా రంగానికి చెందిన చిన్న చిన్న నటులతో ప్రకటనలను చేయించడం కాకుండా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరిట ఆయన చేయని ప్రకటనను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇది కాస్త బూమరాంగ్ అయింది. ప్రజాస్వామ్య పరిరక్షణను కోరుకునే ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా లోకేష్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని కోరిన రఘురామ కృష్ణంరాజు, సభ సూపర్ సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజధానికి ఈ ప్రభుత్వ నాలుగేళ్ల అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 17వ తేదీన అమరావతి రైతులు నిర్వహించ తలపెట్టిన సభ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

ఈనెల 23 వ తేదీన సభ జరిగే అవకాశాలు ఉండడంతో, ఆరోజు సభలో నేను కచ్చితంగా పాల్గొంటాను. అమరావతి ఐక్యవేదిక ప్రతినిధులు తిరుపతిరావు, శివారెడ్డిలు నన్ను ఆహ్వానించారు. ఇక, అమరావతి ప్రతినిధులు దాఖలు చేసిన రిట్ పిటీషన్, ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని అడ్వకేట్ జనరల్ వాదించినట్లుగానే, సుమన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అనే న్యాయవాదులు వాదించారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ చేయాలని పట్టుబట్టారు. హైకోర్టు రిజిస్ట్రార్ కేసును ఒక బెంచ్ కు కేటాయించినప్పుడు, ఇంకొక బెంచ్ కు బదిలీ చేయమని కోరడం సమంజసం కాదు.

ఇదే విషయమై న్యాయవాదులు తమ అభ్యంతరాన్ని తెలియజేయడంతో, మెమో దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి వారికి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ కేసు పై వాదనలు కొనసాగనున్నాయి. హైకోర్టు ఆదేశాలను తూట్లు పొడిచే విధంగా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమని ఇన్ డైరెక్ట్ గా రాజధాని తరలింపు ప్రక్రియకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. ముఖ్యమంత్రి తో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శుల కోసం విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉంది.

ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి తో పాటు, అధికారులు అక్కడికి వెళ్లాలనుకోవడం ఈ సాంకేతిక యుగంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ పెద్దల చర్యలను ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి వారేమి తింగరోళ్లు కాదు. ప్రజలతోపాటు న్యాయస్థానం కూడా ఈ తరహా చర్యలను అర్థం చేసుకుంటుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

గోతులు పూడ్చడానికి కలెక్టర్ శ్రద్ధ వహించాలి
భీమవరంలోని విష్ణు కాలేజ్, డెడికేటెడ్ విమెన్స్ కాలేజ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో కాలేజీకి ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న విద్యార్థినిలు ప్రమాదానికి గురవుతున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు ప్రమాదం బారిన పడుతుండడంతో, వాళ్ల ప్రాణాల మీదకు ఎక్కడకు వస్తుందోనన్న ఆందోళన తల్లిదండ్రులలో కనిపిస్తోంది.

జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని రోడ్డుపై ఏర్పడిన గోతులను పూడ్చివేసేందుకు ప్రత్యేక నిధుల నుంచి సొమ్మును ఖర్చు చేయాలి. లేకపోతే ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు ఖర్చు చేసే వెసులు బాటు ఉంటే, ఖర్చు చేయండి. దానికి అవసరమైన అనుమతులను మంజూరు చేస్తాను. రోడ్డుపై ఏర్పడిన గోతులను పూడ్చేందుకు కలెక్టర్ చొరవ తీసుకోవాలని, ఈ విషయాన్ని నేరుగా ఆమెతో కూడా ప్రస్తావిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు .

LEAVE A RESPONSE