– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు
– బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని పార్టీ నాయకులకు ఆదేశం
– ఎన్నికల సంఘం ఇచ్చే ఓటర్ జాబితా ముసాయిదాను గ్రామస్థాయిలోనే పరిశీలించి అభ్యంతరాలను అధికారుల దృష్టికి వెంటనే తీసుకుపోవాలి
– ఎమ్మెల్సీలు ఎల్. రమణ, డా. దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ ఇంఛార్జ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
– బీఆర్ఎస్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ సీనియర్ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన కేటీఆర్, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో బీఆర్ఎస్ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాలో పేరు లేని వారు తమ అభ్యంతరాలను చెప్పుకోవడానికి తక్కువ గడువు విధించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు కేటీఆర్.
ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, ఎల్. రమణతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంఛార్జ్, జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ లతో కేటీఆర్ ఓ కమిటీ ఏర్పాటుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా ముసాయిదాలో ఏమన్న అవకతవకలు, అక్రమాలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ రోజు నుంచే గ్రామస్థాయిలో ఓటర్ల జాబితా తయారీ ప్రారంభమవుతుందని, ఈనెల 29న జిల్లాస్థాయిలో, 30వ తేదీ నుంచి మండలస్థాయిలో ఎన్నికల సంఘం అధికారులతో రాజకీయ పార్టీల సమావేశాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేదా పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశాల అనంతరం అధికారుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితాను వెంటనే సేకరించి, దాన్ని గ్రామశాఖ నాయకులకు పంపాలని సూచించారు. ఓట్లు ఉన్నాయో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఓట్లు గల్లంతైనట్లు తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆగస్టు 31వ తేదీలోగా సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికంగా అభ్యంతరాలను నమోదు చేయించాలని ఆదేశించారు.
ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను మీడియా సమావేశాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, సెప్టెంబర్ 2న ప్రచురించే తుది జాబితాలో అందరి ఓట్లు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.