-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేవని ఆయన అన్నారు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారాన్ని మోపడమేనని మండిపడ్డారు. పల్లె వెలుగు సర్వీసుల్లో గరిష్ఠంగా రూ. 25, ఎక్స్ ప్రెస్ లో రూ. 90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో రూ. 120, ఏసీ సర్వీసుల్లో రూ. 140 పెంచారని విమర్శించారు.
రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ. 500 కోట్లను పేదల నుండి వైసీపీ ప్రభుత్వం కొట్టేస్తుందని అన్నారు. ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణమని అన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు.