– రోజాపై దాడి చేస్తే పోలీసులెక్కడ?
– మంత్రులకు ఇచ్చే భద్రత అంతేనా?
– బాబు బస్సుపై దాడి ఘటనలో సవాంగ్ సారు మాటలు మర్చిపోయారా?
– అప్పుడు భావస్వేచ్ఛ అయితే మరి ఇప్పుడు కాదా?
-పార్టీ ఆఫీసుపై దాడి ఘటనలో సీఎం జగన్ ‘అభిమానుల బీపీ’ వ్యాఖ్య మరిచిపోయారా?
– ఇప్పుడు పవన్ ఫ్యాన్సుకూ బీపీ వచ్చిందనుకోవచ్చు కదా?
– మరి ఇప్పుడు జనసైనికులపై కేసులెందుకు?
– ఎక్కడైనా పాలకులే పోటీ సభలు పెడతారా?
– ఏపీలో ఏ స్వామ్యం ఉంది?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో ‘లా’ ఒక్కింతయు లేదన్నది బుద్ధిజీవుల ఆవేదన. బహుశా విశాఖ సహా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అరెస్టులు, నమోదవుతున్న కేసులను చూసి సదరు ‘బుద్ధిజీవుల బ్యాచ్’ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది. ఇలాంటి అపనిందలన్నీ జగన్ పాలన నచ్చని వారివే అనుకున్నప్పటికీ.. తాజాగా విశాఖ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు- తెరవెనుక జరిగిపోతున్న నాటకాలు- పెద్దల ప్రకటనలు లోతుగా పరిశీలిస్తే.. సదరు ‘బుద్ధిజీవుల బ్యాచ్’ ఆవేదనలో అణువంత అబద్ధం లేదనిపిస్తోంది.
మూడు రాజధానులు కావాలన్నది వైసీపీ కోరిక. దానిని స్వయంగా సీఎం జగన్ కూడా ఎక్కడా దాచుకోవడం లేదు. మంచిదే. ఎవరి పార్టీ విధానాలు-వ్యూహాలు వారివి. ఇక అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్నది టీడీపీ- అమరావతి రైతుల ఆకాంక్ష. ఈపాటికే అక్కడ మోదీ-కేసీఆర్ సారూ వచ్చి శంకుస్థాపన చేశారు కాబట్టి, వారు అలా కోవడంలో తప్పేమీ లేదు.
కానీ జగన్ సర్కారు అమరావతిని చంపేస్తోంది కాబట్టి, అందుకు నిరసనగా రైతులు అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేపట్టారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు కొత్తేమీ కాదు. వైఎస్ నుంచి, చంద్రబాబు- జగన్- షర్మిల- మందకృష్ణమాదిగ, ఇప్పుడు రాహుల్‌గాంధీ వరకూ పాదయాత్రికులే. వైఎస్-జగన్ పాదయాత్ర సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు, వారికి పూర్తిగా సహకరించింది. ఎక్కడా వారి యాత్రకు నిరసనగా పోటీ పాదయాత్రలు, వారికి వ్యతిరేకంగా ఫ్లెక్సీల పంచాయితీలు పెట్టిన దాఖలాలు లేవు. నిజంగా చంద్రబాబు సర్కారు తలచుకుంటే, వైఎస్-జగన్-షర్మిల పాదయాత్రలు సజావుగా సాగేవి కావు. అదేవిధంగా కాంగ్రెస్ సర్కారు తలచుకుంటే, చంద్రబాబు పాదయాత్ర విజయవంతం అయ్యేదీ కాదు. కాబట్టి అమరావతి రైతుల పాదయాత్రను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.
కానీ కాలం మారింది. నాయకుల మనస్తత్వాలూ మారాయి. బుద్ధులూ మారిపోయాయి. అనుభవజ్ఞుల స్థానంలో అవగాహనలేని నాయకత్వాలొచ్చి పడ్డాయి. అదే ఇప్పుడు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా- సవాలుగా మారింది. ఇప్పుడు విశాఖలో కనిపిస్తున్న దృశ్యాలు వాటి ఫలితాలే. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని ఒకరు, వారిని తొక్కి నారతీస్తామని ఇంకొకరు, కుమ్మేస్తామని మరికొందరు, తలలు తెగుతాయని పాలక పార్టీ నాయకులు, మంత్రులు బహిరంగ ప్రకటనలివ్వడమే ఆశ్చర్యం.
అధికారంలో ఉంటూ, తమ ప్రభుత్వ పాలనలో ఎలాంటి సంఘటనలు జగరకుండా చూడాల్సిన పాలకపార్టీ ప్రతినిధులే…పాదయాత్రగా వచ్చేవారిని అడ్డుకోవాలని పిలుపునివ్వడమంటే, పరోక్షంగా హింసను కోరుకున్నట్లే లెక్క. సహజంగా ఎక్కడయినా, ఏ ప్రభుత్వమయినా తమ హయాంలో ఒక్క సంఘటన కూడా జరగకూడదని కోరుకుంటుంది. విధ్వంసాలు, వినాశానాలు, హత్యలు జరగకూడదని ఆశిస్తుంది. తమ పాలన ప్రశాంతంగా సాగాలని కోరుకుంటుంది. ఆ సందర్భంలో ఒక్కోసారి సొంత పార్టీ వారినే శిక్షిస్తుంటుంది. కానీ.. ఏపీ మంత్రులు- ఎమ్మెల్యేలు- అధికారపార్టీ నేతల తొడకొట్టుడు, సవాళ్లు చూస్తే వైసీపీ సర్కారు అలా కోరుకుంటున్నట్లు కనిపించడం లేదన్న నిజం, మెడపై తల ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది.
అయితే విశాఖలో విస్తరిస్తున్న భూమాఫియా, దసపల్లా భూముల వెనుక.. అధికారపార్టీ పెద్దలున్నారన్న వార్తలు- వాటి ఆధారాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో, ఆ రచ్చపై చర్చ జరగకుండా ఉండేందుకే, ఈ డైవర్షన్ స్కీమ్ అన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. అది నిజమైనా, అబద్ధమైనా కూర్చున్న కొమ్మను నరుక్కునే మేధావులు, ప్రభుత్వంలో ఉంటారా అన్నది మరో సందేహం. ఎందుకంటే.. ఏ ఘటన జరిగినా దాని బాధ్యత పాలకపార్టీలదే కదా? మరి అలాంటి అపకీర్తిని ఎవరైనా కావాలని మూటకట్టుకుంటారా? ఏమో.. ఏదైతే అదవుతుందన్న తెగింపు పాలకులలో ఉంటే చెప్పలేం!
లేకపోతే.. అసలు విపక్షాలు, ఆందోళనకారుల సభలు-ర్యాలీలు-పాదయాత్రలకు పోటీగా ఏ ప్రభుత్వమైనా సభలు, సవాళ్లు చేస్తుందా? అది తెలివైన పనేనా? ఇది గత పదేళ్ల క్రితం వరకూ ఎవరైనా చూశారా? అలా చేస్తే రెచ్చిపోయేది విపక్షాలు, ప్రజలే కదా? సహజంగా పాలకులయినా ఉద్యమకారులు-ఆందోళనకారులను పిలిచి చర్చిస్తారు. మథ్యేమార్గం సూచిస్తారు. కానీ, జగనన్న సర్కారు మాత్రం చర్చలకు బదులు రచ్చనే కోరుకుంటోందన్నది తాజా విశాఖ ఘటనతో మరోసారి తేలింది. రాజకీయాల్లో అనుభవానికి, అవగాహనారాహిత్యానికీ ఇదే తేడా!
సరే.. పాలకపార్టీలు అలా కోరుకుని ఉండవచ్చు. కానీ వాటితో సంబంధం లేని పోలీసులు చట్టాన్ని కదా పాటించాల్సింది? విశాఖలో జరుగుతున్న తతంగాన్ని ప్రేక్షకపాత్ర వహించడమో, లేదా పక్షపాతపాత్ర పోషించడమో చేస్తున్నారన్నది అందరి విమర్శ. తాజాగా పవన్ కల్యాణ్ కూడా చెప్పింది అదే. విశాఖలో వైసీపీ ప్రేరేపిత జేఏసీ సభ నిర్వహిస్తోందని పోలీసులకు తెలుసు. వైసీపీ దాదాపు లక్షమంది జనసమీకరణ లక్ష్యంతో పనిచేస్తోందనీ తెలుసు.అక్కడే అమరావతికి మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశం జరుగుతుందనీ తెలుసు. ఒకేరోజు జనసంద్రం ఒకే నగరంలో ప్రవహిస్తే ఎలా వ్యవహరించాలో పోలీసులకు తెలియనిది కాదు. ఆమేరకు ప్రత్యామ్నాయం కూడా అన్వేషించాలనీ తెలుసు.
అదేరోజు జనసేనాధిపతి పవన్, విశాఖకు రెండురోజుల కార్యక్రమాలకు వస్తున్నారనీ పోలీసులకు ముందస్తు సమాచారం ఉంది. గత మూడురోజుల నుంచీ పవన్ లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల దారుణమైన రెచ్చగొట్టే ప్రకటనల ఫలితమేమిటో, నిఘా వర్గాలకు తెలియదనుకుంటే అమాయకత్వమే. ఆవేశపరులైన జనసైనికులు, తెగిస్తే ఏమవుతుందో కూడా తెలుసు. మరి ఇన్ని తెలిసీ జేఏసీ సభకు ఎలా అనుమతించిందన్నది, బుర్ర-బుద్ధి ఉన్న వారికెవరికయినా వచ్చే సందేహం. ఇలాంటి సందేహం పెద్ద బుర్రలున్న అధికారులకు రాకపోవడమే వింత.
జనసైనికుల ఆవేశం మంత్రుల కార్లు పగలకొట్టేలా చేసింది. మంత్రి రోజా సహాయకుడి తల పగిలేందుకు కారణమయింది. అంటే నిఘా నిద్ర పోయిందని అర్ధమవుతూనే ఉంది. ఎందుకంటే పవన్ వస్తే జనం హడావిడి ఎలా ఉంటుందో తెలుసు. అన్ని తెలిసీ ఆ సమయంలో- ఆ ప్రాంతంలో ఉండే మంత్రుల భద్రత, ఏ స్ధాయిలో కల్పించాలన్న అంచనా కూడా లేకపోవడమే, రోజాపై దాడికి కారణంగా అర్ధమవుతుంది. మంత్రులకే రక్షణ కల్పించలేని పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉండటం ఎవరికి నగుబాటు? అయితే ఎయిర్‌పోర్టు వద్ద రోజానే జనసైనికులను తన హావభావాలతో రెచ్చగొట్టారని, అందుకు వారు కూడా అదే స్థాయిలో రెచ్చగొట్టిన ఫలితమే రచ్చకు కారణమన్నది మరో వాదన.
పవన్ విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత, పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఎవరిని మెప్పించేందుకు? స్వయంగా డీసీపీ స్థాయి అధికారి పవన్ వాహనంపైకి ఎక్కి, డైరక్షన్ ఇవ్వడం అవసరమా? పవన్‌కు రాజకీయ పరిజ్ఞానం లేకనో, పక్కన రాజకీయ వ్యూహకర్తలు-సరైన సలహాదారు లేరుకాబట్టి సరిపోయింది. నిజంగా పవన్ పక్కన అలాంటి వారుంటే.. ఆయన అప్పటికప్పుడు కారు దిగి, రోడ్డుపైనే బైఠాయించేవారు.ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారన్నది ప్రశ్న. పవన్‌కు అన్ని రాజకీయ ఎత్తుగడలు తెలియకపోవడం, ఆయన పక్కన కూడా అంతటి పనిమంతులు లేకపోవడం, పోలీసులు చేసుకున్న అదృష్టమే అని చెప్పాలి.
ఇక పవన్ బస చేసిన హోటల్‌లో పోలీసులు సృష్టించిన హడావిడి ఎందుకో అర్ధం కాదు. హోటల్‌లో దాగున్న నిందితులను పట్టుకునేందుకు వచ్చారన్నది కథనం. ఈ సందర్భంగా పోలీసులు తమ మాజీ బాసు గౌతం సవాంగ్, గతంలో చేసిన వ్యాఖ్యను విస్మరించకూడదు. విపక్ష నేత చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంలో కొందరు ఆయన కారుపై రాళ్లేసి, అడ్డంకులు సృష్టిస్తే అది రచ్చయింది. దానికి సవాంగు సారేమన్నారంటే.. ‘అది భావ స్వేచ్ఛ. రాజ్యాంగహక్కు’ అని సెలవిచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి సందర్భంలో స్వయంగా సీఎం సారే..‘ బీపీ వచ్చిన అభిమానులేదో చేశార’ని వ్యాఖ్యానించిన విషయాన్ని, పోలీసులు విస్మరించకూడదు. అంటే.. ఎవరు ఏదైనా చేయవచ్చు. అది వారి హక్కు అన్నది వారిద్దరి కవిహృదయం.
మరి అదే సూత్రం.. రోజా కారుపై దాడి చేసిన వారికీ వర్తిస్తుంది కదా అన్నది బుద్ధిజీవుల వాదన. సీఎం సూత్రం ప్రకారమయితే, బీపీ పెరిగిన పవన్ అభిమానులు ఏదో చేశారని సర్దుకుపోవాలి. మాజీ డీజీపీ సవాంగు సారు మాటల ప్రకారం అయితే అది భావస్వేచ్ఛ, రాజ్యాంగహక్కు అని మౌనంగా ఉండాలి. అలాకాకుండా వారిపై హత్యాయత్నం, దాడి కేసులు పెట్టడమంటే.. విశాఖ పోలీసులు.. సీఎం జగన్, మాజీ డీ జీపీ సవాంగు సారు మనోభావాలను ధిక్కరిస్తున్నట్లే లెక్క.