– మీ ఇంటిని అర్థరాత్రి వేళ జేసీబీలతో కూలిస్తే.. మీకు బాధ ఉండదా?
– అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీన వర్గాలపై దాడే
– మణికంఠ తల్లిదండ్రులకు కూడా లేఖ రాస్తాం
– జగన్ రెడ్డి అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారుః
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలహీన వర్గాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి గారి ఇంటిని అర్థరాత్రి వేళ నిబంధనలకు విరుద్ధంగా కూల్చడాన్ని, కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు జగన్ రెడ్డికి అయ్యన్న కుటుంబ చరిత్ర తెలుసా? వారి తాత, తండ్రి సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి, అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
అయ్యన్నపాత్రుడు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకున్నారు. బలహీన వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అర్థరాత్ర వేళ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇంటిని కూల్చడాన్ని ప్రజలందరూ గమనించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. జగన్ రెడ్డి తన అవినీతిని ప్రశ్నించిన వారందరిపై దాడులు చేసి.. ఇబ్బందులకు గురిచేసిన విధానాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు.
ఐపీఎస్ ఆఫీసర్ వీఎన్ మణికంఠ, ఆర్డీవో గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఎమ్మార్వో జయకి రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉందా? నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మిస్తే… 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. వీరెవ్వరికీ నిబంధనలు తెలియవా? అర్థరాత్రి, ఇంటిని కూల్చడానికి నిమిషం ముందు నోటీసు ఇవ్వడంపై సమాధానం చెప్పాలి. మణికంఠ కి చట్టాలు తెలుసా? 300ఏ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి కూల్చివేతలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ ఆదేశాలు అమలు చేసే బాధ్యత లేదా? ఆర్డీవో చెప్పారని.. తాను చేశానని మణికంఠ చెప్పడం సిగ్గుచేటు. నువ్వు ఐపీఎస్ చదువుకోలేదా? ఆర్డీవో మౌఖిక ఆదేశాలు ఇస్తే.. లిఖిత పూర్వక ఆదేశాలు అడగాల్సిన బాధ్యత లేదా? మీ సతీమణి కూడా డీసీపీగా పనిచేస్తున్నారు.
ఎమ్మార్వో జయ, ఆర్డీవో గోవిందరావు, కమిషనర్ కనకారావు, ఐపీఎస్ మణికంఠ ఇళ్లను అర్థరాత్రి వేళ జేసీబీలతో కూలిస్తే మీకు బాధ ఉండదా?
మణికంఠ తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాలో ఉంటారు. వారి ఇంటిని అర్థరాత్రి వేళ జేసీబీలతో కూలిస్తే.. మీకు బాధ ఉండదా? ఈ మూడేళ్లలో వైసీపీ నేతలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదు. మణికంఠ తల్లిదండ్రులకు కూడా లేఖ రాస్తాం. ఈ పరిస్థితే వారికి వస్తే.. వారెంత బాధపడతారో లేఖ రాస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు లేఖలు రాసి.. భవిష్యత్ లో టీడీపీ అధికారలోకి వస్తే.. వీరిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం.