Suryaa.co.in

Editorial

‘ఉక్కు’కు ఊపిరి!

– విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదన్న కేంద్రం
-ఇది పోరాట ఫలితమేనన్న తెలంగాణ మంత్రి హరీరావు
– ఆగిన ‘ఆట’లో విజేతలెవరు? పరాజితులెవరు?
– బీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసికొట్టిందా? మైలేజీ పెరిగిందా?
– అది ఆంధ్రాలో బీఆర్‌ఎస్‌ విస్తృతికి అక్కరొస్తుందా?
– ఈ క్రెడిట్‌ కేసీఆర్‌ ఖాతాలోకి వెళుతుందా?
– అడ్డుకోని ఏపీ సర్కారుపై కేంద్ర నిర్ణయ ప్రభావం ఎంత?
– ఇప్పటికే వైసీపీ సర్కారు బిడ్డింగుకు ముందుకు రాలేదన్న జనాగ్రహం
– ఉక్కు నిర్ణయంతో ఉత్తరాంధ్రలో‘ పువ్వు’ పార్టీ పరిళమిస్తుందా?
– టీడీపీ, జనసేనకు లాభమెంత?
– శాశ్వత భరోసా ఇస్తేనే ‘కమల’ వికాసం
( మార్తి సుబ్రహ్మణ్యం)

మెడపై ‘ప్రైవేటు’ కత్తి వేళ్లాడుతున్న విశాఖ ఉక్కుకు కాస్తంత ఊరట, ఊపిరి! ఇప్పట్లో విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఉండదని, కేంద్ర ఉక్కుగనుల సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ భరోసా ఇచ్చారు. ముందు ఆర్‌ఐఎన్‌ఎల్‌ను బలోపేతం చేసేందుకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అంశంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లమని ప్రకటించారు. కేంద్రమంత్రి తన ప్రకటనలో ‘ప్రస్తుతానికి’, ‘ఇప్పటికి’ అదే పదాలు ప్రత్యేకించి వాడినప్పటికీ.. ఈ నిర్ణయం విశాఖ స్టీలుకు ఊరటనే. అయితే.. ఈ నిర్ణయం తాత్కాలికమే తప్ప, శాశ్వతం కాదన్నది కేంద్రమంత్రి వాడిన ప్రస్తుతానికి అనే పదాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రకటన, తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై ప్రభావితం చేస్తాయా? లేదా? అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి ప్రకటనను, ప్రధాన పార్టీలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నాయి. ప్రధానంగా ఇది విశాఖ స్టీల్‌కు బిడ్డింగ్‌ వేస్తానన్న బీఆర్‌ఎస్‌కు, ఏపీలో రాజకీయంగా ఉపయోగపడుతుందా? అదే నిజమైతే ఏపీలో పాలక వైసీపీ అసమర్ధతను రుజువుచేస్తుందా? విశాఖపై ప్రత్యక్ష పోరాటాలు చేయని వైసీపీ-టీడీపీలకు తాజా నిర్ణయంతో వచ్చే పొలిటికల్‌ మైలేజీ ఏమిటి? ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ- జనసేన ఏవిధంగా రాజకీయంగా సొమ్ము చేసుకుంటాయన్న చర్చకు తెరలేచింది.

విశాఖ స్టీల్‌కు తెలంగాణ ప్రభుత్వం బిడ్‌ వేస్తుందని మీడియాలో రావడమే తప్ప, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ, విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ కాకుండా పోరాడతామని బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ కూడా, మూడురోజుల పాటు విశాఖలో ఉండి, కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ప్రైవేటీకరణ విధానానికి తాము వ్యతిరేకమని, అలా చేస్తే ఉద్యోగులు రోడ్డున పడతారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అదానీకి బహుమతిగా ఇచ్చేందుకే విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మరోవైపు సీనియర్‌ మంత్రి హరీష్‌రావు సైతం, ఆంధ్రా పార్టీల అసమర్థత- కేంద్రంపై పోరాడలేని నిస్సహాయతను దూదేకినట్లు ఏకిపారేశారు. విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరిస్తుంటే అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ ఎదిరించకుండా, మోదీకి సాగిలపడుతున్నాయని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడలేక చతికిలపడ్డారని వెక్కిరించారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం బీఆర్‌ఎస్‌ సాధించిన నైతిక విజయమని అభివర్ణించారు. తమ పోరాటాలు, ఒత్తిళ్ల ఫలితంగానే కేంద్రం దిగివచ్చిందని హరీష్‌.. కేంద్రమంత్రి నిర్ణయాన్ని తమ పార్టీ ఖాతాలో వేశారు.

అయితే.. బీఆర్‌ఎస్‌ చర్యలు ఆంధ్రాలో ఆ పార్టీకి మేలు చేస్తాయా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌ వేస్తామని, అధికారికంగా ఏ స్థాయిలోనూ ప్రకటించని విషయాన్ని ఆంధ్రా పార్టీలు గుర్తు చేస్తున్నాయి. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారం చేసుకుని, మీడియా విశాఖ స్టీల్‌కు తెలంగాణ బిడ్‌ వేస్తుందని ఉద్యమం నడిపించాయని చెబుతున్నారు.

దానికి తగినట్లుగా, అసలు విశాఖ స్టీల్‌కు బిడ్లు వేస్తే తెలంగాణకు వచ్చే లాభమేమిటి? ఆ స్టీల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసుకుంటుందని, మరికొన్ని మీడియా సంస్థల్లో కథనాలు పోటెత్తాయి. సింగరేణి సమస్యల్లో ఉంటే, విశాఖ స్టీల్‌కు బిడ్లు వేసి ఏం చేసుకుంటారని సింగరేణి కార్మిక నేతలు కూడా మీడియా ముందుకొచ్చి గళం విప్పారు.

అయితే.. దీనివల్ల ఏపీలో బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఎలాంటి లాభం లేకపోయినప్పటికీ.. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ చేయలేని ధైర్యం.. కేసీఆర్‌ చేశారన్న ప్రశంసలు మాత్రం బీఆర్‌ఎస్‌కు దక్కుతాయని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్లు వే స్తుందని మీడియాలో వచ్చిన తర్వాత కూడా, వైసీపీ సర్కారులో స్పందన లేకపోవడం ఉత్తరాంధ్ర వాసులను ఆగ్రహపరిచింది. ముగ్గురిని మినహా అందిరనీ పార్లమెంటుకు పంపించినా, ఒక్క ఎంపీ కూడా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయని వైనాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ నిర్వహించిన ప్రెసమీట్లలో సైతం.. తాము కూడా తెలంగాణ సర్కారు మాదిరిగానే బిడ్లు వేస్తామని జగన్‌ ప్రభుత్వం ముందుకురాకపొవడం నిస్సందేహంగా వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బేనంటున్నారు.

ఇక ఈ వ్యవహారంలో బీజేపీకి రాజకీయంగా వచ్చే మైలేజీ ఏమిటన్నది ప్రశ్న. విశాఖ ఉక్కు వ్యవహారంలో మొదటి నుంచి, ప్రజల దృష్టిలో బీజేపీ ముద్దాయిగానే నిలిచింది. ప్రైవేటీకరణను బీజేపీ ఖండించలేదు. పోనీ తాము అడ్డుకుంటామని కూడా చెప్పలేదు. ఇటీవల ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మాధవ్‌ ఘోరంగా ఓడిపోవడానికి సైతం, విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అంశం ప్రధానమని విశ్లేషిస్తున్నారు. కాబట్టి, కేంద్రమంత్రి ప్రకటన- పరిణామాలు బీజేపీకి రాజకీయంగా ఏమాత్రం ఉపయోగపడవంటున్నారు. పైగా కేంద్రమంత్రి ప్రైవేటీకరణ యోచనను తాత్కాలికంగా విరమించుకున్నామని ప్రకటించడం వల్ల, బీజేపీకి ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. అదే తమ ఆలోచనను శాశ్వతంగా విరమించుకుంటున్నామని ప్రకటించి ఉంటే.. బీజేపీకి రాజకీయ ప్రయోజనం లభించి ఉండేదని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జనసేనకూ తాజా పరిణామాలు కలసిరావని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని పవన్‌ ఇప్పటిదాకా కేంద్రాన్ని హెచ్చరించింది లేదు. ఆ ప్రతిపాదన విరమించుకోకపోతే, తాము పొత్తు నుంచి వైదొలుగుతామని ప్రకటించిందీ లేదు. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో కూడా కేంద్రమంత్రులు, బీజేపీ నేతలతో ఈ అంశంపై చర్చించిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా విశాఖ.. స్టీల్‌పై ఒత్తిడి తీసుకువస్తామని ఎక్కడా చెప్పకపోవడం ప్రస్తావనార్హం.

ఇక సీపీఐ-సీపీఎం-కాంగ్రెస్‌కు తప్ప.. టీడీపీకి సైతం తాజా పరిణామాలు రాజకీయ ప్రయోజనం కలిగించే అవకాశాలు లేవంటున్నారు. ప్రైవేటీకరణను ఆపాలంటూ టీడీపీ కూడా, కేంద్రంపై ప్రత్యక్ష పోరాటాలు చేసిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.

LEAVE A RESPONSE