– పెట్టుబడి సాయం లేదు, ఇన్ పుట్ సబ్సిడీ లేదు
– ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం : చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజానాద్ ఫైర్
అనంతపురం: పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ… ప్రత్తి, అరటి, మొక్కజోన్న, మినుమలు, శెనగలు, మొక్కజొన్న, మిర్చితో పాటు ఏ పంటలకూ గిట్టుబాటు ధరలేక రైతులు రొడ్డెక్కే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.
దీనికి తోడు పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ లేకపోవడంతో సాగు భారమై అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, చంద్రబాబు మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే… ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి తరహాలో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాయలసీమ జిల్లాలకు నీరివ్వడంపై కనీస శ్రద్ధ లేని సీఎం… నీటి భద్రత గురించి మాట్లాడ్డం విడ్డూరం. ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంటే ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. విత్తనాలు రేట్లు నియంత్రించాల్సింది, పెట్టుబడులు తగ్గించాల్సింది కూడా ప్రభుత్వమే. ఎరువులు ధరల విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
కానీ చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కోసం క్యూలైన్లో నిల్చోవడంతో పాటు అధిక ధరలకు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దుస్థితి. మొక్కజొన్న పంట కొనుగోలు చేస్తామని రైతులు హామీ ఇవ్వడం తప్ప అమలు చేసిందేం లేదు. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ విధానం వల్లే అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో ఆ మాత్రమైనా వ్యవసాయం సాగవుతోంది, రైతులు బ్రతుకున్నారు. వేలాది కోట్ల రూపాయలు దుబారా ఖర్చులు చేస్తున్న మీకు.. రైతుల కోసం మాత్రం రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు రాదు. రూ.600 కోట్లు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంది.
చంద్రబాబు ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. ఉల్లి, టమోటతో పాటు చివరకి అరటి పంటను కూడా రైతులు పారబోసే రోజులు మీ పాలనలో దాపురించాయి. కిలో రెండు రూపాయలకు అరటి పళ్లు దొరికే దుస్థితి చంద్రబాబు పాలనలోనే కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ప్రతిపంట కొనుగోలులో కూడా రైతులను మోసం చేశారు. అక్కడక్కడా రెండు మూడు సెంటర్లు ఏర్పాటు చేసి ఫోటోలకు పోజు ఇచ్చి… పేపర్లలో వార్తల కోసం చేశారు.
అధికారులను ప్రశ్నిస్తే.. ఉత్తరాది ప్రాంతంలో పంట ఎక్కువ ఉందని.. పంట నాణ్యత లేదని మరోసారి సాకులు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమిది. ప్రశ్నిస్తే తిరిగి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. 18 నెలల కూటమి పాలనలో 15 దఫాలకు పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అయినా ఈ ప్రభుత్వం రైతులను ఒక్కసారీ ఆదుకున్న పాపాన పోలేదు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మంది రైతులు ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్నారు.