– విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందిః ఎంపీ డా. సత్యవతి
– విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రెండో మాటే లేదని కేంద్ర రైల్వే మంత్రి స్పష్టం చేశారు
– విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలిః కేంద్ర ఉక్కు మంత్రి అపాయింట్ మెంటు కోరాం
– ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, సాధిస్తాం
– రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో వైయస్ఆర్సీపీ ఎంపీలు నిరంతర పోరాటం
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డాక్టర్ బి. సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, చింతా అనురాధ, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎన్ రెడ్డప్ప ప్రెస్ మీట్
న్యూఢిల్లీ : విశాఖ రైల్వే జోన్( దక్షిణ కోస్తా) ఏర్పాటు విషయంలో ఎటువంటి అస్పష్టత లేదని, జోన్ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇదే విషయాన్ని పార్లమెంటులో స్పష్టంగా చెప్పారని, ఇందులో మరో మాటే లేదని అనకాపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ బి. సత్యవతి స్పష్టం చేశారు.
రాష్ట్రాలకు కొత్తగా జోన్ లు ఇస్తారా.. అని నిన్న లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం వల్ల కొంత గందరగోళం, వక్రీకరణలకు అవకాశం ఏర్పడిందని, ఈ విషయంపై కేంద్ర రైల్వే మంత్రితో నేరుగా ఫోనులో కూడా మాట్లాడితే, విభజన చట్టంలో ఇచ్చిన హామీ నేపథ్యంలో, ఇప్పటికే ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదని చెప్పారని ఎంపీ సత్యవతి తెలిపారు. కొత్తగా రైల్వే జోన్ ఇచ్చేటప్పుడు రాష్ట్రాన్ని ప్రామాణికంగా తీసుకోరని, అక్కడున్న పరిస్థితులు, వనరులను బట్టే కొత్తగా రాష్ట్రాలకు రైల్వే జోన్ ఇస్తారని, అటువంటి ప్రతిపాదన లేదని మాత్రమే కేంద్ర మంత్రి తెలియజేశారన్నారు.
విభజన చట్టంలో ప్రకటించిన మేరకు, విశాఖ రైల్వే జోన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని, రాబోయే బడ్జెట్ లో కూడా దాదాపు రూ. 300 కోట్లు నిధులు కేటాయిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారని అన్నారు. ఇందులో విశాఖ, విజయవాడ డివిజన్లకు రూ. 180 కోట్లు, రాయగడ డివిజన్ కు రూ. 120 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారన్నారు.
రైల్వే జోన్ ఏర్పాటుకు ఆరు నుంచి ఏడేళ్ళు పడుతుందని, దీనికి సంబంధించి ఓఎస్డీ నియామకం, డీపీఆర్ తయారు చేయడం పూర్తయ్యాయని తెలిపారు. జోనల్ ఆఫీసు ఎక్కడ పెట్టాలి, డివిజన్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానికి సంబంధించి కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలో కూడా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి, రైల్వే జోన్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరినట్లు ఎంపీ వివరించారు. అలానే వాల్తేరు డివిజన్ ను కొనసాగించాలని కూడా కోరినట్లు తెలిపారు.
అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్లమెంటులో అటు లోక్ సభలోనూ.. ఇటు రాజ్యసభలోనూ పదేపదే వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు తమ గళాన్ని వినిపిస్తున్నారని, దీనికి సంబంధించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అపాయింట్ మెంటు కూడా కోరామని, త్వరలో ఆయన్ను మరోసారి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగింపు ఆవశ్యకతను వివరించడం జరుగుతుందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టీవ్ మైన్స్ లేకపోవడంతో, ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం సొంత గనులు కేటాయించాలని, రుణాలను ఈక్విటీలుగా మార్చాలని, ప్లాంట్ ను లాభాల్లో నడిపించేందుకు పలు ప్రత్యామ్యాయాలను సూచిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రికి లేఖలు రాశారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని కూడా ఎంపీ సత్యవతి తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు దృష్ట్యా, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా లాభాల బాటలో పయనిస్తోన్న నేపథ్యంలో, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మరోమారు కేంద్రాన్ని కోరనున్నట్లు ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభలో ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ప్రత్యేక హోదా నుంచి రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు.. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లోక్ సభలో గట్టిగా పోరాడుతున్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల ఉద్యోగస్తులతో పాటు విశాఖకు తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ గతంలోనూ, ఇప్పుడూ చాలా లాభాల్లో నడుస్తోందని, నవరత్నహోదా సాధించిందని, ఎక్స్ పోర్ట్స్ లో ఎన్నో అవార్డులు వచ్చాయని.. ఈ విషయాలన్నింటినీ పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని తెలిపారు.
మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 300 రోజులుగా కార్మికులు నిరసనలు చేస్తున్న విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా పార్లమెంటు లోపల, బయట పోరాడుతూ దీన్ని అడ్డుకుంటామని తెలిపారు.
ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్ సభలో జీరో అవర్లో కోరినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ గట్టిగా పోరాడుతూనే ఉంటామని చెప్పారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని ప్రధాని మన్మోహన్ సింగ్.. ఇప్పటి ప్రధాని మోడీ ఇద్దరూ ప్రత్యేక హోదాపై హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజీ ఇస్తే చాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడతామన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. అనాదిగా పగటి పూట పోస్టుమార్టం నిర్వహించడం వల్ల.. చాలా నష్టం జరుగుతుందని, పెరిగిన టెక్నాలజీ, సౌకర్యాల నేపథ్యంలో రాత్రి వేళల్లో కూడా పోస్టుమార్టం నిర్వహించాలని లోక్ సభ వేదికగా కేంద్రాన్ని కోరడం జరిగిందని, ఆ దిశగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. దీనివల్ల చనిపోయిన వ్యక్తుల ఆర్గాన్స్ పాడవకుండా, ఇతరులకు డొనేట్ చేయడానికి అవకాశం కూడా కలుగుతుందని చెప్పారు. అలానే పోస్టుమార్టం నివేదికల్లో డాక్టర్ల చేతి రాత అర్థంకాక ఇబ్బంది పడుతున్నారని, దాన్ని కూడా టైప్ చేసిన డాక్యుమెంటుగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు గోరంట్ల మాధవ్ తెలిపారు.
మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తనకు ఎవరితోనూ శతృత్వం లేదని, రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించేవాడినని.. రఘురామకృష్ణరాజును దూషిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. ఓ వర్గం మీడియాలో కనిపించేందుకు, రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేస్తూ రఘురామ రచ్చ చేస్తున్నాడని అన్నారు. సభలో దూషించే అవకాశమే ఉండదని, సభ్యులు ఒకరికొకరు ఎదురు పడటమే తప్పు అంటే.. ఒక్కొక్కరికీ వేర్వేరుగా గేట్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. ఎంపీలు తలారి రంగయ్య, రెడ్డప్ప లు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు.