– నియోజకవర్గాల సమీక్షల్లో ఇంచార్జ్ లతో టిడిపి అధినేత చంద్రబాబు
అమరావతి:- రాష్ట్రంలో ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని….పార్టీ నేతలు, ఇంచార్జ్ లు మరింత దూకుడుగా పని చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు. రానున్న ఏడాది కాలమే పార్టీకి అత్యంత కీలకమని….అలసత్వం వీడి….పార్టీ నేతలు ప్రణాళికలతో పని చెయ్యాలని చంద్రబాబు సూచించారు. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో చంద్రబాబు సమీక్షలు మొదలు పెట్టారు.
ఇందులో భాగంగా మొదటి రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీ అయ్యారు. ఆయా ఇంచార్జ్ తో ప్రత్యేకంగా(ఒన్ టు ఒన్ మీటింగ్) జరిగిన ఈ భేటీలలో పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నేతల పనితీరుపై చర్చించారు. నియోజవకర్గ స్థాయిలో పార్టీ బలోపేతం పై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఆయా నియోజకవర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇంచార్జ్ లతో మాట్లాడి సూచనలు చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చే పలు కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొనడంతో పాటు స్థానిక సమస్యలపైనా పోరాటం చెయ్యాలని సూచించారు.
మూడేళ్లలో వైసిపి ప్రభుత్వం ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్క పని చెయ్యలేదని…ప్రజల సమస్యలను జగన్ సర్కారు పూర్తిగా గాలికి వదిలేసిన అంశంపై నిరసనలు చెయ్యాలని సూచించారు. ప్రజా సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లాలలో మంత్రుల అవినీతిపైనా స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు వారికి చెప్పారు. తొలి రోజు అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతల పాడు నియోజకవర్గాలపై ఇంచార్జ్ లతో సమీక్ష చేశారు. నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీల ప్రక్రియ రానున్న రోజుల్లో కూడా కొనసాగనుంది.