Home » తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలి

తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలి

-బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి, మహానాడు : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా…  అవినీతికి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా తిరుపతి నగరపాలక సంస్థ మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో జరిగిన అక్రమాల గురించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థలో కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ శాఖలలో సుదీర్ఘకాలంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమార్కుల భరతం పట్టాలన్నారు! మాస్టర్ ప్లాన్ రోడ్లను నాసిరకం రోడ్లుగా మార్చిన ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారి జీతాల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలన్నారు.

గత ఐదు సంవత్సరాల కాలంలో నగరపాలక సంస్థకు ప్రజలు కట్టిన ఆస్తి పన్నుల నగదును ఏటీఎం కార్డు లాగా నాసిరకం ఇంజనీరింగ్ పనులకు వాడేశారని దానిపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నానన్నారు! తిరుపతి మంగళం రోడ్డులోని వినాయక సాగర్ అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేశారని కమిషన్లు దండుకున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ M.Book లను పరిశీలిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు! తిరుపతి ఇంజనీరింగ్,టౌన్ ప్లానింగ్ శాఖలో సుదీర్ఘకాలంగా తిష్ట వేసిన అవినీతి తిమింగలాల అక్రమ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని ప్రశ్నించారు.

తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలోని ఫుట్ పాత్ ల ఆక్రమణలపై చూపిస్తున్న శ్రద్ధ అక్రమ భవన నిర్మాణాలపై ఎందుకు చూపడం లేదన్నారు! నగరపాలక సంస్థలోని కొంతమంది కార్పొరేటర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై డిబిఆర్ రోడ్, మంగళం రోడ్డులలో అనుమతులకు మించి అదనపు అంతస్తులను నిర్మించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు! గరుడ వారధి కాంట్రాక్టర్ “ఆప్కాన్స్ సంస్థ” ద్వారా నగరంలో ఆబ్లికేషన్ (ఒత్తిడి చేసి) కింద “ఫ్రీ లెఫ్ట్ రోడ్లు” వేయించి నగరపాలక సంస్థ ద్వారా దొంగ బిల్లులు చేయించుకున్న ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.

నగరపాలక సంస్థ కమిషనర్ 50 డివిజన్లో పర్యటిస్తే…  అక్రమ భవన నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ లోని అవినీతి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? ఎంత లంచాలు దండుకొని అనుమతులు ఇచ్చారు? అన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు! తిరుపతి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులంతా త్వరలో 50వ డివిజన్లో పర్యటించి అక్రమ భవన నిర్మాణాల వెనక ఉన్న అవినీతి అధికారుల చిట్టాను, ఇంజనీరింగ్ పనులలో జరిగిన దొంగ బిల్లుల వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు,స్టేట్ విజిలెన్స్ అధికారులకు పంపిస్తామన్నారు! తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అవినీతి అధికారులను వెంటనే ప్రక్షాళన చేసేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సమగ్ర సమాచారంతో, సాక్షాధారాలతో నివేదికను రూపొందిస్తున్నామన్నారు.

Leave a Reply