Suryaa.co.in

Andhra Pradesh

రథం దహనంపై లోతైన విచారణ జరగాలి

– ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం: కనేకల్లు మండలం హనకనహల్ శ్రీ రాముడి రథం దహనం కేసులో 24 గంటల్లో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయడం హర్షణీయమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

రాయదుర్గంలో బుధవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. రాముని రథాన్ని ఆ గ్రామ వైసిపి నాయకుడు బొడిమల్ల ఈశ్వరరెడ్డి మరికొందరు తగులబెట్టినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. పోలీసులు ప్రధాన నిందితుడిని ఒకడిని మాత్రమే పట్టుకోగలిగారని రథాన్ని దహనం చేయడం ఒక్కరితో సాధ్యమయ్యే పనికాదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఇందులో మిగిలిన వారి పాత్రను కూడా పోలీసులు నిర్ధరించాల్సి ఉందన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా గతంలో కనేకల్లులో పనిచేసిన వివాదాస్పద హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి మంగళవారం హనకణహల్ గ్రామానికి రావడం ప్రజల్లో పలు అనుమానాలను రెకెత్తిస్తోందన్నారు. వైసీపీకి అనుకూలంగా పని చేసిన సదరు హెడ్ కానిస్టేబుల్ రథం దహనం కేసులో ముద్దాయిగా భావిస్తున్న వారికి, బంధువు అవుతారని అతన్ని హనకనహల్ గ్రామానికి ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.

మంగళవారం ఉదయం నుంచి హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి ఎవరెవరితో మాట్లాడారో, కాల్ డేటాను విశ్లేషించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి కొందరు వైసిపి నాయకులు కుట్ర పూరితంగా రాముడి రథానికి నిప్పు పెట్టినట్లు అనుమానాలున్నారు. దీని వెనుక ఎవరున్నా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కాలవ శ్రీనివాసులు కోరారు.

LEAVE A RESPONSE