– సహాయ చర్యలు ముమ్మరం చేయండి
– ఈ ఘటన నన్ను కలచివేసింది
– ప్రజలు భయపడవద్దు.. మేమున్నాం
– ప్రజలకు భరోసా కల్పించండి
– అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
– ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏరియల్ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన బయలుదేరి, వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పర్యవేక్షించారు.
పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఆయన వెంట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఏరియల్ సర్వేలో నదులు, వాగులు పొంగిపొర్లడం, లోతట్టు గ్రామాలు జలమయం కావడం, పంట పొలాలకు తీవ్ర నష్టం, దెబ్బతిన్న రోడ్లను సీఎం స్వయంగా చూశారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను కలచివేశాయి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నిత్యావసరాలు, ఆహారం, మందులు అందేలా చూడాలని ఆదేశించారు.