– తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం
– స్థానిక సంస్థల ఎన్నికల్లో భువనగిరి జిల్లాలో గెలిచిన బీజేపీ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లకు సత్కార కార్యక్రమం లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లుగా గెలుపొందిన బీజేపీ ప్రజాప్రతినిధులను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు గారు మాట్లాడుతూ… ఈ విజయం బీజేపీ కార్యకర్తల కష్టానికి, వారి నాయకత్వానికి, గ్రామీణాభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచే బీజేపీ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, ‘వికసిత్ భారత్’ లక్ష్యసాధనకు అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పార్టీని విస్తరించేలా.. ఈ విజయాలు బలమైన, స్థిరమైన పునాదిని ఏర్పాటు చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు రాష్ట్రశాఖ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయలేకపోయినా, పోటీ చేసిన చోట్ల బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకుల బెదిరింపులు, ఒత్తిడులు ఎదురైనా, ప్రజలు ధైర్యంగా బీజేపీకి మద్దతుగా నిలిచారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది సర్పంచులు, 1200 మంది ఉపసర్పంచులు, 10,000 మందికి పైగా వార్డు మెంబర్లు బీజేపీ తరఫున గెలుపొందారు. గతంలో బీజేపీ నగరాలకే పరిమితమైన పార్టీ అని విమర్శించినవారికి, గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న ఈ విజయాలే గట్టి సమాధానం.
2019లో బీజేపీ 163 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు “పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు” పోటీ చేసి సుమారు వెయ్యి స్థానాల్లో సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయాలు బీజేపీ కార్యకర్తల అంకితభావానికి, వారి నాయకత్వానికి మరియు గ్రామీణాభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనం.
గ్రామస్థాయి నుంచే బీజేపీ సంస్థ మరింత బలోపేతం అవుతోంది. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ప్రతి ఇంటి దాకా తీసుకెళ్లేందుకు ఈ గెలుపులు బలమైన పునాదిని వేస్తాయి. రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా గ్రామాల్లో బిజెపి బలపడుతుంది. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే పూర్తి విశ్వాసం ఉంది. రాష్ట్రంలో గతంలో అధికార పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు, పోలీసు ఒత్తిళ్లతో నామినేషన్లు వేయనివ్వకుండా చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 వేల సర్పంచుల నుంచి 2 వేల వరకు సంఖ్య పడిపోవడం, ఆ పార్టీ గ్రాఫ్ మరింత దిగజారిందనడానికి నిదర్శనం. భువనగిరి మండలంతో పాటు జిల్లాలో ప్రధాన గ్రామపంచాయతీల్లో సర్పంచులు, అధిక సంఖ్యలో ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు బీజేపీ తరఫున గెలుపొందారు.
గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తున్నది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఆయుష్మాన్ భారత్, హర్ ఘర్ నల్, గ్రామీణ రోడ్ల అభివృద్ధి, ఇలా అనేక పథకాల ద్వారా పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తోంది. ఉచిత బియ్యం, ధాన్యం కొనుగోలుతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. రానున్న కాలంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం.