– వైసీపీ నాయకులపై మంత్రి సవిత ఆగ్రహం
పెనుకొండ: ఉగ్రవాదుల్లా వైసీపీ నాయకులు పెట్రేగిపోతున్నారని, ఆ పార్టీ కార్యకర్తలకు నరకండి, చంపండి అంటూ ప్రజలపైకి ఉసుకొల్పుతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రేషన్ బియ్యం దోచేసి పేదల కడుపుకొట్టిన ఘనుడు పేర్ని నాని అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అయిదేళ్ల పాటు పాలన సాగించిన వైసీపీ నాయకులు అధికారం శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలుసుకోకుండా చట్టాలను, నిబంధనలను అతిక్రమించి అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఆనాటి అక్రమాలు బయటపడుతుండడంతో, వారి వెన్నులో చలిపుడుతోందని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులు వణికిపోతున్నారు. జైలుకెళ్లాల్సి వస్తోందనే భయంతో కూటమి ప్రభుత్వంపైనా, అధికారులపైనా, ప్రజలపైనా కక్ష పెంచుకున్నారన్నారు. ఒక్కసారి ఛాన్స్ అంటూ కాళ్లావేళ్లా పడి అధికారంలోకి వచ్చిన తరవాత దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారన్నారు.
రప్పా…రప్పా …అని ఒకడు నరికేస్తామంటుంటే, చీకట్లో కన్నుకొడితే పని అయ్యిపోవాలి..అని మరొకడు అంటున్నాడని అన్నారు. చివరికి జగన్ కూడా రప్పా…. రప్పా…అని నరికితే తప్పు ఏముంది…? అని అంటున్నాడన్నారు. దళితుడైన సొంత పార్టీ కార్యకర్తను కారు కింద వేసి తొక్కించారన్నారు. పేదల కడుపుకొట్టి రేషన్ బియ్యం దోచేసిన వైసీపీ నాయకుడు పేర్ని నాని కూడా నోరు పారేసుకుంటున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. పౌరసరఫరాల సంస్థకు అద్దెకు ఇచ్చిన గోదాములో నిల్వ ఉంచిన 4 వేల రేషన్ బియ్యం బస్తాలను పేర్ని నాని మాయం చేశాడని, ఇదే విషయమై కోర్టులో కూడా కేసు నడుస్తోందని తెలిపారు.
మరో వైసీపీ నాయకుడు మహిళా ఎమ్మెల్యేను దూర్భాషలాడాడన్నారు. ఇలా పార్టీలోని నాయకులంతా తమ స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ కార్యకర్తలను పావులా వాడుకుంటున్నారన్నారు. ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మితే నష్టపోయేది వైసీపీ కార్యకర్తలే హితవు పలికారు. వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా కూటమి నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోబోమని, సంయమనంతో ఉంటామని, రాష్ట్రాభివృద్ధే తమ లక్ష్యమని వెల్లడించారు. ప్రజలు కూడా వారి మాటలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని మంత్రి సవిత స్పష్టంచేశారు.