పులివెందుల కూడా ధైర్యం చేసి తిరగబడింది – కేసులు నమోదయ్యాయి!
సొంత ఇలాకా పులివెందుల జెడ్పీటీసీలో డిపాజిట్ పోవడం, ఇటీవలే భారతీ సిమెంట్స్ ముందు ఆ ఊరోళ్లు శాపనార్థాలు పెట్టడం వంటి వరుస ఘటనలతో జగన్ షాక్‌ల మీద షాక్‌లు తింటున్నాడు.
జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ ఇళ్లు పూర్తి చేయకపోవడంతో, అక్కడి లబ్ధిదారులు ‘రాక్రీట్’ సంస్థపై ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎంపీ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు.
రాక్రీట్ సంస్థ చేసిన పనులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించడం ఆపేసిందని, అందుకే ఆ సంస్థ కోర్టుకు వెళ్లిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి, కోర్టు అడ్డంకులు తొలగించి, పులివెందుల జగనన్న కాలనీలలో నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన వినయంగా అభ్యర్థించారు.
ఈ రాక్రీట్ సంస్థ తోపుదుర్తి బంధువులది. ఆ తోపుదుర్తి కుటుంబానికి భూమన కుటుంబంతో బంధుత్వం ఉంది. ఈ చుట్టాల కంపెనీకి రివర్స్ టెండర్లు లేవు సరే గదా, నేరుగా రూ. 1,100 కోట్ల విలువైన 63 వేల ఇళ్ల నిర్మాణాన్ని అప్పగించారు. చుట్టాల సంస్థ పేదల ఇళ్ల పనుల్ని అత్యంత నాసిరకంగా చేస్తున్నా జగన్ పట్టించుకోలేదు. వివిధ దశల నిర్మాణాలు పూర్తి కాకుండానే అయినట్లు చూపించి ప్రజాధనాన్ని దండుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికీ సుమారు రూ. 80 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు లెక్కలు తేలాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసింది.
వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి ఎంత అమాయకంగా నటించి చెప్పారో.. అలా చుట్టాల కంపెనీ కోర్టుకు వెళ్లి పనులు ఆపేసిందని అలాగే బడాయిలు పోయాడు. పరకామణి నుండి కల్తీ వరకు అన్నింటా మేసి, ఇప్పుడు హిందువులకు ప్రవచనాలు, సంస్కృతి నేర్పుతున్న భూమన బంధువులు.. రాబందుల్లా పేదల కొంపలను కూడా వదలలేదు.
తన భార్య పేరున భారతి సిమెంట్ ప్లాంటు కెపాసిటీకి మించి ఆర్డర్లు ఇచ్చి, నిర్మాణ కాంట్రాక్టులు కూడా బంధువులకే కట్టబెట్టి.. పేదవాడి కొంప నుండి దేవుడి కొండ వరకు అనకొండలా మింగేసి, ఇప్పుడు రెండు ప్యాలెస్‌ల మధ్య అరగక విమానాల్లో తిరుగుతూ, వళ్లు విరుచుకుంటూ ఎదురుదాడి చేస్తున్నారు.
ఇది చూసి కడప ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అందుకే పులివెందుల సైతం తిరగబడి ఫిర్యాదులు చేస్తోంది.
-చాకిరేవు