– మాట్లాడే స్వేచ్ఛను హరించడానికే రేవంత్ రెడ్డి ఆ బిల్లును తీసుకొచ్చాడు
– ఈ దేశంలో పేదవాడికి న్యాయం అందడం లేదు
– న్యాయం దక్కని పీడితుల పక్షాన గొంతై నిలబడండి
– అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర ఉస్మానియాది
– ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్న “DUCIMUS – WE LEAD” ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి. లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు something special.
ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు.మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ భాయి పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేడ్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగరహారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే.
ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ న్యాయవాదులు ఉంటారు. ఎక్కడ న్యాయవాదులు ఉంటారో ఆ పోరాటం గమ్యాన్ని చేరుతుంది. విజయం సిద్ధిస్తుంది. మార్టిన్ లూథర్ కింగ్ అన్న “Injustice anywhere is a threat to justice everywhere” అనే మాట గుర్తుపెట్టుకోండి. దేశంలో 5కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికీ ఈ దేశంలో పేదవాడికి న్యాయం అందడం లేదు. న్యాయం దక్కని పీడితుల పక్షాన గొంతై నిలబడండి.
ప్రభుత్వాలు పోరాటాలను అణిచివేయాలని చూస్తాయి. ఇలాంటి సమయంలో మీరు సమాజానికి అండగా నిలబడాలి. అసెంబ్లీకి హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారు. అది ఫ్రీజ్ స్పీచ్ బిల్లు. మాట్లాడే స్వేచ్ఛను హరించడానికే రేవంత్ రెడ్డి ఆ బిల్లును తీసుకొచ్చాడు. ప్రశ్నిస్తే కేసు, వేలు ఎత్తి ప్రభుత్వ తప్పిదాన్ని చూపిస్తే కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తే . శాసన సభ్యులంతా వ్యతిరేకిస్తే అది సెలెక్ట్ కమిటీకి పోయింది.
ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు అవి legislature, ఎగ్జిక్యూటివ్, Judiciary, ప్రెస్/మీడియా. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది Judiciary. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డా. బీఆర్ అంబెడ్కర్ గారు ఈ దేశ ప్రజలకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత యువ లాయర్లుగా మీ మీద ఉన్నది. ఠాకూర్ ఆడిటోరియంకు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. వేణుగోపాల్ రెడ్డి అనే తెలంగాణ బిడ్డ స్వరాష్ట్రం కోసం ఇక్కడే ప్రాణత్యాగం చేశారు.
అసెంబ్లీ ముట్టడికి వస్తుంటే NCC గేట్ దగ్గర యాదయ్య అనే యువకుడు చేసిన ప్రాణత్యాగం ఇంకా నా కండ్ల ముందు కనిపిస్తుంది. ఎన్నో పోరాటాల ఫలితం, ఎంతో మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పేషెంట్లకు ప్రాణం పోయడం డాక్టర్ల బాధ్యత..బాధితులకు అండగా నిలవడం లాయర్లుగా మీ బాధ్యత.
న్యాయం గెలవాలి, ధర్మం నిలబడాలి. బాధితుల పక్షాన వారి గొంతై నిలబడాలనేదే నా ఆకాంక్ష. ఒకప్పుడు అసెంబ్లీలో లాయర్లు ఎక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఎక్కువ అవుతున్నారు లాయర్లు తక్కువ అవుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి. దేశానికి ఒక కొత్త మార్గదర్శకం కావాలి. అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర ఉస్మానియాది. కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా పనిచేసిన శివ రాజ్ సింగ్ చౌహాన్ ఈ లా కాలేజీ స్టూడెంట్. మీరు కూడా రాజకీయంగా ఎదగాలి.