– సీఎస్ విజయానంద్, సర్వశిక్ష అభియాన్ పిడి శ్రీనివాసరావుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు
– సీఎస్‌ను నాలుగురోజులు జైల్లో ఉంచితే మిగిలిన అధికారులు దారికొస్తారంటూ వ్యాఖ్యలు
– పిడి శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆయనపై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన హైకోర్టు
– ఏజీ తీరు కోర్టు ఉత్తర్వులు అమలు చేయని అధికారులను సమర్ధించేలా ఉందన్న వ్యాఖ్య
– మరి సీఎస్ రిటైరయిన తర్వాత కూడా మళ్లీ ‘పెద్దపీట’ వేస్తారా?
– పిడి శ్రీనివాసరావును ఇంకా అక్కడే కొనసాగిస్తారా? వేటు వేస్తారా?
– మరోసారి బయటపడిన ఏజీ దమ్మాలపాటి ప్రతిభ
– ఇది అధికారులను నెత్తిన పెట్టుకుంటున్న ఫలిత మేనంటున్న కూటమి నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ మా ఉత్తర్వులు అమలు చేయలేదంటే ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు సీఎస్‌ను మేనేజ్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ అధికారులతో ఆయన కుమ్మక్కయ్యారు. కోర్టు ఆదేశాల అమలుకు 11 నుంచి నేటి వరకూ ఏం చేశారో చూపించండి. ఇప్పటికే 15 రోజులయింది. ఏజీ సూచనలతోనే ఉత్తర్వులు అమలు చేయనట్లు కనిపిస్తోంది. సీఎస్‌ను నాలుగురోజులు జైల్లో ఉంచితే, మిగిలిన అధికారులు దారికొస్తారు. మా ఉత్తర్వు అమలు చేస్తారా? జైలుకెళతారా?
గ్రూప్-1 మెయిన్స్‌లో ఎంపికయిన అభ్యర్ధులను తక్షణం కీలక పోస్టుల నుంచి తప్పించాలని ఇచ్చిన ఆదేశాలు అమలు చేసి, రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌కు నివేదిక సమర్పించాలన్న మా ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు? తక్షణం అనే పదానికి అర్ధం తెలియదా? కోర్టు ఉత్తర్వులను సీఎస్ గౌరవించకపోతే, ఇక మిగిలిన ఉద్యోగులు ఎందుకు గౌరవిస్తారు? కోర్టు ఆదేశాలను గౌరవించాలన్న అవసరం లేదన్న సంకేతాలు మిగిలిన అధికారులకు ఇస్తున్నారా? ఏజీ తీరు కోర్టు ఉత్తర్వులు అమలు చేయని అధికారులను సమర్ధించేలా ఉంది.’’
– 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో నియమితులయిన అధికారులను తక్షణం అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలన్న హైకోర్టు ఆదేశాలను.. 15 రోజులయినా అమలుచేయని తీరుపై ఆగ్రహిస్తూ, సీఎస్‌ను స్వయంగా హైకోర్టుకు పిలిపించి తలంటుతూ ధర్మాసనం అసహనంతో చేసిన వ్యాఖ్యలివి.
***
‘‘ ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు లోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్ధినులను ఎలుకలు కొరికన ఘటనపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. దానితో అధికారులు అక్కడికి వెళ్లి విద్యార్ధినులను వెంటనే ఆదుకున్నారు. కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి జీతాలు పెంచడంతోపాటు, కేంద్రంతో చర్చించి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తున్నట్లు మంత్రి లోకేష్ శాసనసభలో చె ప్పినట్లు పత్రికల్లో చూశాం. మంత్రి ఈ స్ధాయిలో పనిచేస్తుండగా.. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి, మంత్రికి చెడ్డపేరు తెస్తున్నారు.
కోర్టు ఆదేశాలు అమలుచేయని దిగువ స్థాయి సిబ్బందిని రక్షించే విధంగా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసరావు తీరు ఉంది. ఆయన కోర్టును తప్పు దోవ పట్టించేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకునేందుకు డీఓపీటీకి లేఖ రాస్తాం. ఈ అఫిడవిట్‌తో మేం సంతృప్తిగా లేం. మరో అఫిడవిట్ వేయండి’’
– కేజీబీవీల్లో పీజీటీలుగా పనిచేస్తున్న వారిని తొలగించడాన్ని తప్పుపడుతూ, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుపై పీజీటీలు అపీలుకు వె ళ్లారు. ఆ సందర్భంగా పిటిషర్లను ఉద్యోగాల్లో కొనసాగిస్తామన్న సర్వశిక్ష అభియాన్, ఆమేరకు వ్యవహరించకపోవడంతో, పిడి శ్రీనివాసరావుపై నమోదైన కోర్టు ధిక్కార కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలివి.
* * *
‘విద్యుత్‌రంగ పితామహుడు’, ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్ శాఖను దేదీప్యమానంగా వెలిగించిన ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్‌ను హైకోర్టుకు పిలిపించి, అక్షింతలు వేసిన ధర్మాసనం వ్యాఖ్యలు ప్రభుత్వ పరువు తీసేవే. ఇక రోజు వారీ న్యాయ వ్యవహారాలు సమీక్షించి, ప్రభుత్వానికి తలవంపులు రాకుండా చూసే అడ్వకేట్ జనరల్‌ను పట్టుకుని.. ‘మీ సలహాతోనే మా ఆదేశాలు అమలుచేయాల్సిన పనిలేదని సీఎస్-అధికారులకు చెప్పినట్లు కనిపిస్తోంద’ంటూ ధర్మాసనం అసహనంతో చేసిన వ్యాఖ్యలు.. న్యాయవ్యవస్థలో దిగ్గజాలయిన జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ సర్కార్, జస్టిస్ సుబ్బారావు, జస్టిస్ వాంఛూ, జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పిఎన్ భగవతి, నారీమన్, నానీ ఫాల్కీవాలాకు మించిన ‘అపూర్వ న్యాయ కోవిదుడ’యిన అడ్వకేటక్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుకు వ్యక్తిగతంగా తలవంపులే.
ఆయన వ్యక్తిగత అప్రతిష్ఠను పక్కనపెడితే.. ఇది సర్కారుపై జనంలో పెంచుకున్న పరువుకు పెనుదెబ్బ. విపక్షంలో ఉండగా పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసి, కార్యకర్తలకు దన్నుగా ఉన్న అసలు సిసలు నిఖార్సయిన పార్టీ న్యాయవాదులున్నప్పటికీ, వారిని కాదని.. కొండంత నమ్మకంతో దమ్మాలపాటికి ఇచ్చిన పార్టీ-ప్రభుత్వానికే తలవంపులు.
* * *
ఇక హైకోర్టుకు ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోకుండా.. కోర్టునే తప్పుదోవపట్టించేలా వ్యవహరించిన సర్వశిక్ష అభియాన్ పీడీ శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆయనపై చర్యలకు డీఓపీటీకి రాస్తామన్న హైకోర్టు ధర్మాసనం హెచ్చరిక.. సర్వశిక్ష అభియాన్‌కు బాధ్యుడిగా ఉన్న శ్రీనివాసరావుకు చెంపదెబ్బగానే భావించక తప్పదు.
అంతకుముందు కోర్టు విచారణ సందర్భంలో బాధ్యులకు నోటీసులిచ్చినట్లు చెప్పి.. తాజా విచారణలో మాత్రం విచారణ తర్వాత నోటీసులివ్వడం ద్వారా, కోర్టునే పక్కదారి పట్టించిన పిడి శ్రీనివాసరావును, ఇంకా అదే స్ధానంలో కొనసాగించడం అనైతికమే. అత్యున్నత న్యాయస్థానాన్నే ఏమార్చిన సదరు అధికారికి, ఆయన శాఖ మంత్రిని ఏమార్చడం ఏమంత కష్టం కాదు. మంచినీళ్లు తాగినంత సులువు! ఇవన్నీ కొందరు అధికారులను ఏరికోరి తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నందుకు, పాలకులు చెల్లించుకుంటున్న మూల్యమే.
* * *
ఇక మూడురోజుల్లో రిటైరవుతున్న సీఎస్ విజయానంద్ వంటి అత్యంత ‘‘సమర్ధుడికి’’.. రిటైరయిన తర్వాత, మళ్లీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చి విద్యుత్ శాఖ అదనంగా అప్పగించబోతున్నారని.. అది కాకపోతే ఈఆర్సిలో నియమించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో.. హైకోర్టు వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణలోకి తీసుకుని, మళ్లీ ఆయనను మరోసారి అందలం ఎక్కిస్తుందా? లేదా అన్నది చూడాలి.
సహజంగా అయితే పరువు-ప్రతిషల్ఠు ఆలోచించే ఏ పాలకులూ.. కోర్టుతో అంత తీవ్రమైన హెచ్చరికలు అందుకున్న అధికారిని అందలమెక్కించి, విమర్శలు కొని తెచ్చుకోరు. ఒకవేళ జగన్ జమానాలో ఇలా లెక్కలేనన్ని సార్లు కోర్టు మందలించిన వారిని అందలమెక్కించారు కాబట్టి.. తాము కూడా ఆ పనిచేస్తే తప్పేమిటని భావిస్తే, దానికి ఎవరూ ఏమీ చేయలేరు. అది పాలకుల విజ్ఞత! స్వయంగా హైకోర్టు ధర్మాసనమే సీఎస్నుద్దేశించి అంత దారుణమైన వ్యాఖ్యలు చేసిందంటే, ఆయనెంత సమర్ధుడో, ఇంకెంత పనిమంతుడో మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.
ఒకవేళ హైకోర్టు వ్యాఖ్యలను పట్టించుకోకుండా, మళ్లీ ఆయన సేవలు కొనసాగిస్తే.. ఇప్పటివరకూ ఆయనకు-పాలకులకు మధ్య ఉన్న రకరకాల బంధాన్ని బలపరిచినట్లే అవుతుందన్నది కూటమి నేతల ఉవాచ. ఈ విషయంలో ప్రభుత్వం విజ్ఞతతో పాటు, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశిద్దాం.
** *
ఇప్పుడు మంత్రి నారా లోకేష్‌ను ధర్మాసనం అభినందిన తీరు పరిశీలిద్దాం. పాఠశాలలో విద్యార్ధినులను ఎలుకలు కొరిన వైనం పత్రికలో వచ్చిన వెంటనే ఆయన స్పందించి, అధికార యంత్రాంగాన్ని పురమాయించారు. దానితో కదిలిన యంత్రాంగం నష్టనివారణ చర్యలు చేపట్టిన వైనాన్ని కోర్టు గ్రహించి, అందుకు కారణమయిన లోకేష్‌ను మెచ్చుకుంది.
సహజంగా కోర్టులు వ్యక్తిగతంగా ఎవరినీ మెచ్చుకోవు. పైగా పాలక స్థానంలో ఉన్న వారిపై నిరంతరం అక్షింతలే తప్ప, అభినందనలు భూతద్దం వేసినా కనిపించవు. అందుకు భిన్నంగా.. తొలిసారి మంత్రి లోకేష్ అభినందనలు అందుకోవడం మెచ్చదగిందే.
అయితే ఆ సంతోషాన్ని ఆయన శాఖలో పనిచేసే సర్వశిక్ష అభియాన్ పిడి శ్రీనివాసరావు అదే రోజు నీరుకార్చడమే దౌర్భాగ్యం.
ఎవరినీ లెక్కచేయని నైజం.. అందరిపైనా నోరుపారేసుకునే అధికారిగా పేరున్న శ్రీనివాసరావు చివరాఖరకు కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ‘ఒకచోట పిత్తిన ముడ్డి మరోచోట రామకీర్తన పాడుతుందా’ అన్న వెనకటి ముతక సామెత మనుకు ఉన్నదే. కాబట్టి అలాంటి బేఫర్వా ఆఫీసర్లు, కోర్టును తూ.నా బొడ్డు అనడంలో వింతేమీ లేదు. అలాంటి అధికారిపై ధర్మాసనం అక్షింతలు వేసి, క్రిమినల్ కేసు నమోదు చేస్తామనడమూ సమంజసమే.
గతంలో లోకేష్ వద్ద ఓఎస్డీగా పనిచేసి, ఇదే సర్వశిక్షా అభియాన్‌లో సుదీర్ఘకాలం పీడీగా పనిచేసిన ఇదే అధికారి.. మళ్లీ ఇప్పుడూ అదే స్ధానం వెలగబెడుతున్నారంటే అది ఎవరిచ్చిన అలుసు? బహుశా తనకు లోకేష్‌తో సాన్నిహిత్యం ఉన్నందున.. ఏం చేసినా చెల్లుంతుదన్న ధీమాతో శ్రీనివాసరావు, కోర్టును తప్పుదోవపట్టించారేమో?!
మరి ఇది తనపై నమ్మకంతో ఆ స్థానం ఇచ్చిన మంత్రి లోకేష్ నమ్మకాన్ని వమ్ము చేయడమే కదా? ఆయనపై క్రిమినల్ కేసు పెట్టి, డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన తర్వాత కూడా, శ్రీనివాసరావును అదే స్థానంలో కొనసాగిస్తే పోయే పరువు ఆయనది కాదు. మంత్రి లోకేష్దేనన్నది కూటమి నేతల ఉవాచ. ఎందుకంటే.. ‘‘మీ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి, డీఓపీటీకి ఫిర్యాదు చేస్తా’’మని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినప్పుడే, సదరు శ్రీనివాసరావు పరువు కృష్ణానదిలో కలిసింది కాబట్టి! సహజంగా హైకోర్టు నుంచి అంతటి దారుణమైన వ్యాఖ్యలు విన్న తర్వాత, పరువున్న ఏ అధికారయినా సెలవుపై వెళ్లిపోతారు. మరి ‘పరువు ఉందనుకుంటున్న’ శ్రీనివాసరావు అక్కడే ఉంటారో, అవమాన భారంతో సెలవుపై వెళతారో చూడాలి!
* * *
సహజంగా కీలకమైన కేసుల్లో కోర్టులు ఇచ్చే ఆదేశాలపై, సీఎస్ నుంచి ఏజీ వరకూ ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారు. వెనువెంటనే ఆ ఆదేశాలు అమలు చేయడమో, లేదా పైకోర్టుకు అపీలుకు వెళ్లడమో చేస్తారు. దానికోసం సీఎస్-ఏజీ ఆఫీసులు ఆగమేఘాలమీద పనిచేస్తాయి. పరువున్న ప్రభుత్వాల్లో జరిగేదే ఇది. కానీ ప్రస్తుత సీఎస్ విజయానంద్-అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు తీరు మాత్రం, కోర్టును ఖాతరు చేయాల్సిన పనిలేదన్నట్లే ఉందన్న విషయం, ధర్మాసనం వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.
నిజానికి గ్రూప్-1 కేసు అత్యంత కీలకమైనదన్న విషయం సాధారణ లా డిగ్రీ తీసుకున్న న్యాయవాదులకే కాదు. చట్టం గురించి తెలిసిన ఎవరికయినా అర్ధమయ్యేదే. ఇదే కేసులో కీలక అధికారి అరెస్టయి జైలుకెళ్లారు. కాబట్టి సీఎస్-ఏజీ ఈ కేసులో ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఆ పరీక్షలు రాసి పాసయిన వారంతా ఇప్పుడు డీఎస్పీ, ఆర్డీఓ వంటి కీలకమైన స్థానాల్లో ఉన్నారు.
కాబట్టి ఈ కేసు విచారణలో ఉన్నందున, కీలక స్థానాల్లో ఉన్న ఆ అధికారులు అదే స్థానాల్లో ఉంటే.. అది కేసుపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, వారిని కేసు తేలే వరకూ ఆప్రాధాన్యమైన పోస్టుల్లో నియమించాలని, హైకోర్టు 15 రోజుల క్రితమే తీర్పు ఇచ్చింది. కోర్టు వారిని నాన్ ఫోకల్ పోస్టులో నియమించమని చెప్పిందే తప్ప, తొలగించమని చెప్పలేదు కదా? మరి అలాంటప్పుడు ఆ పని ఒకటి- రెండు రోజుల్లో పూర్తి చేసి, ఆ చర్యల నివేదికను కోర్టుకు సమర్పించడంలో మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం ఏముంది? కోర్టు ఆదేశించినా ‘తక్షణం’ ఆ ఆదేశాలు అమలుచేయలేదంటే ఏమనుకోవాలి?
మరి ఆ పని 15 రోజులయినా పూర్తి చేయకపోవడంతో ‘ఉద్యోగాలు పొందిన వారు సీఎస్‌ను మేనేజ్ చేసింద’ని హైకోర్టు వ్యాఖ్యానించడంలో తప్పేముంది? మెడ మీద తల ఉన్న ఎవరికయనా సహజంగా అలాంటి అనుమానాలే వస్తాయి కదా? మరి న్యాయమూర్తులకు అలాంటి సందేహం రావడంలో వింతేముంది? బహుశా సీఎస్‌గా ఉన్న విజయానంద్, తన ఉద్యోగ జీవితంలో ఎప్పుడో నాన్ ఫోకల్లో లేనందున… హైకోర్టు వాడిన ఫోకల్-నాన్ ఫోకల్ పదాలు ఆయనకు అర్ధం కాకపోవచ్చేమో?!
సీఎస్‌ను కోర్టుకు పిలిపించి అక్షింతలు వేస్తే తప్ప, ఆ అధికారులను జీఏడీకి రిపోర్టు చేయమని ఆదేశాలివ్వలేకపోయారంటే, ఇది ఎలాంటి లెక్కలేనితనానికి నిదర్శనం? అదేదో ఆ పని తీర్పు ఇచ్చిన రెండురోజుల్లో పూర్తి చేసి ఉంటే, ఇన్ని అవమానాలు పడాల్సిన పనిలేదు కదా?
అయినా.. విద్యుత్ కంపెనీలు-పాలకుల మధ్య ‘అంబికా దర్బార్ అగబత్తి’గా ఉంటూ, ‘పవర్’నే తన ఇంటిపేరుగా మార్చుకున్న పెద్దాఫీసరుకు, మరికొద్దిరోజుల్లో మరో ‘పెద్దపీట’ సిద్ధంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు పడతాయా? మన అమాయకత్వం కాకపోతే!?
* * *
ఇక ఈ కేసులో మరో పెను వైఫల్యం ఏజీ దమ్మాలపాటిది. హైకోర్టు ఆదేశాలను ఆగమేఘాలపై అమలుచేయించే బాధ్యత అయనదే. ఆ మేరకు సంబంధిత అధికారులు లేదా ప్రభుత్వంతో చర్చించి, ప్రభుత్వ పరువు కాపాడాల్సిన ఆయన.. ‘‘ఫోకల్-నాన్ ఫోకల్‌కు సంబంధించి నిర్వచనం కోసం జీఏడీని క్లారిఫికేషన్ కోరుతూ ఈ నెల 19న మెమో దాఖలు చేశాం. వివిధ కారణాల వల్ల మెమో నెంబరు కాలేదు. ఇందులో నా ఆఫీసు తప్పు కూడా ఉంద’’ని అంగీకరించారంటే.. ఏజీ ఆఫీసు ఏ స్థాయిలో.. అంటే ‘పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత’వేగంగా పనిచేస్తుందో అర్ధమవుతోంది.
కోర్టు ఆదేశాలు పాటించాల్సిన పనిలేదన్నట్లు ఏజీ పనితీరు ఉందని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేయడం- అలాంటి ఆలోచన తనకు లేదని ఏజీ చెప్పడం చూస్తుంటే, ఉద్యోగాలు పొందిన వారి విషయంలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నది న్యాయవాదుల ఉవాచ.
నిజానికి పనితీరుకు సంబంధించి దమ్మాలపాటిపై, ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద పుంఖానుపుంఖాల ఫిర్యాదులున్నాయి. వైసీపీ హయాంలో నియమించిన న్యాయాధికారులు-పీపీ-ఏపీపీలను ఇంకా కొనసాగిస్తున్నారన్నది వాటిలో ప్రధానమైన ఆరోపణ.
వాటికి సంబంధించి దాదాపు 70 పేజీల నివేదికను టీడీపీకి చెందిన గుంటూరు సీనియర్ న్యాయవాది, కొద్దినెలల క్రితమే సీఎంకు సమర్పించారు. ఆయన దమ్మాలపాటిపై మీడియాకెక్కారు. దానిపై మీడియాలో దమ్మాలపాటికి వ్యతిరేకంగా కొన్ని కథనాలు వస్తే-ఆయన కు రక్షణ కవచంలా మరికొన్ని యూట్యూబ్ చానెళ్లు-విశ్లేషకులు నిలిచారు. దమ్మాలపాటిపై ఆరోపణలు చేసిన టీడీపీ న్యాయవాదిపై వైసీపీ ముద్ర కూడా వేశారు. మరి దమ్మాలపాటి ‘అద్భుత పనితీరు’ను ప్రశంసిస్తూ, తాజాగా హైకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై ఆ రక్షక విశ్లేషకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
* * *
దీన్నిబట్టి అధికారుల విషయంలో మాజీ సీఎం జగన్ విధానమే రైటనే భావనకు రావలసిన పరిస్థితి. జగన్ జమానాలో అధికారులకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం-అవకాశం ఉండేది కాదు. జగన్-సీఎంఓ చెప్పింది చేయడమే. లేదని తలాడిస్తే, ఆ తల మరో చోటకు బదిలీ అవుతుంది. నాటి సీఎస్ ఎల్వీనే బదిలీ చేసిన ఘనత జగన న్నది.
కానీ చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ అధికారులను నెత్తిన పెట్టుకుంటున్నందుకు, వాళ్లు ఎవరి మాట వినడం లేదన్న గోల.. మంత్రుల నుంచి నాయకులు-ఎమ్మెల్యేల వరకూ ప్రతిసారీ వినిపించేదే. అధికారంలో లేనప్పుడు.. ‘‘మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం అధికారులకు ప్రాధాన్యం ఇచ్చి తప్పు చేశాం. ఈసారి అధికారం వస్తే తొలి ప్రాధాన్యం తమ్ముళ్లకే’’ అనడం.. అధికారం వచ్చిన ప్రతిసారీ మళ్లీ అధికారులనే అందలమెక్కించడం మాకు అలవాటయిందని తమ్ముళ్లు చెబుతుంటారు.
పోనీ అధికారులకు పెత్తనం ఇస్తే, వారేమైనా ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచుతున్నారా అంటే.. ఇదిగో.. కోర్టుల చేత తాము అక్షింతలు వేయించుకుని, ప్రభుత్వ పరువు తీస్తున్నారు. సో.. అధికారుల విషయంలో జగనన్నే రైటన్నది కూటమివాసుల ఉవాచ.