Suryaa.co.in

Andhra Pradesh

అన్ని వర్గాల వారిని వంచించాక … మా నమ్మకం నువ్వే జగనన్న అంటారా?

-30 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి… ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు
-ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 30 వేలే
-ఈ ప్రభుత్వ హయాంలో కొట్టేసినన్నీ జీవోలు, ఆర్డినెన్స్ లు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కొట్టివేయలేదు
-రాజ్యాంగ ఉల్లంఘనలు అడ్డుకోవడమే గవర్నర్ విధి
-జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రజలు అండగా ఉండాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

సమాజంలోని అన్ని వర్గాల వారిని వంచించాక, నువ్వే మా నమ్మకం జగనన్న అని ఎవరైనా అంటారా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందడం లేదని, ఏ ఒక్క లబ్ధిదారునికి ఇంటిని నిర్మించి ఇచ్చిన పాపాన పోలేదని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యను దూరం చేసి… నాలుగేళ్ల పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేయకుండా, ఇప్పుడు అమలు చేస్తామంటే ప్రజలు విశ్వసిస్తారా??, మా నమ్మకం నువ్వే జగనన్న అని అంటారా??? అంటూ నిలదీశారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఇంకా మోసం చేయవచ్చుననే భ్రమలలో నుంచి, గారడీ విద్యల నుంచి తమ పార్టీ పెద్దలిప్పటికైనా బయటికి రావాలన్నారు. పల్లె నిద్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పేరిట ఏర్పాటు చేయదలచిన జగనన్న కాలనీలలో బస చేయాలని సూచించారు. జగనన్న కాలనీలలో ముఖ్యమంత్రి బస చేస్తే నైనా రోడ్డు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు ఆయా కాలనీలలో ఏర్పడతాయన్నారు . ఏమీ లేని దాన్ని ఉందనుకొని వై నాట్ 175 అని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. జగనన్న కాలనీలలో బస చేస్తే జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ పల్స్ అర్థమవుతుందన్నారు.

15 లక్షల మందికే పట్టాలు
30 లక్షల కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లయిన ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇవ్వలేదని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 30 లక్షల మందికి ఇళ్లను ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఇంటి స్థలాలను కేటాయిస్తూ పట్టాలను అందజేశారన్నారు. అందులోనూ ఓ ఏడు ఎనిమిది లక్షలమంది తమ పార్టీ నేతలకు డబ్బులు ఇచ్చి పట్టాలను కొనుగోలు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించలేదని చెప్పారు. పాలకొల్లులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందచేయకపోవడం దారుణమన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు అందజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 వేల రూపాయలను మాత్రమే అందజేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 30 వేల రూపాయలతో 450 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇప్పటికీ ఇప్పుడు ఇంటి నిర్మాణాలు చేపట్టకపోతే పట్టాలను రద్దు చేసి, ప్లాట్ లను వెనక్కి తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుచేసి ఎలాగో అలాగా ఇంటి నిర్మాణం చేపడితే, అక్కడ రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి వంటి కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎక్కడ కూడా మంచినీటి వసతి కోసం ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించిన దాఖలాలు లేవని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా పరిశీలించి, పర్యవేక్షించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా కాలనీలలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవాలని, అవసరమైతే గృహనిర్మానదారులకు ఇసుకను ఉచితంగా అందజేయాలన్నారు. గతంలో 30 లక్షల కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇస్తే ఇంటికి మూడు ఓట్ల చొప్పున కోటి ఓట్లు తమయేనన్న ధీమాతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్నారు. కానీ ఇప్పటివరకు ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించకపోవడంతో పరిస్థితి తిరగబడిందన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటి నిర్మాణానికి
కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలను మంజూరు చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పేరును ఎక్కడ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. తామే కష్టపడి ఇల్లు కట్టుకున్న ప్రజలు తాను ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ కి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. అలాగే టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసినంతమాత్రాన లబ్ధిదారుల మనుషుల్లో చోటు సంపాదించుకోవడం కష్టమని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు..

రాజ్యాంగ ఉల్లంఘనలకిక ఫుల్ స్టాప్
రాష్ట్ర నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ను నియమించడంతో రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు ఫుల్ స్టాప్ పడినట్లేనన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి వీడ్కోలు పలికిన 24 గంటల వ్యవధిలోనే గవర్నర్ కు వీడ్కోలు చెప్పాల్సి వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండరని ఎద్దేవా చేశారు. గవర్నర్ మార్పు వల్ల ముఖ్యమంత్రి కి నెగిటివ్ షాక్ తగలగా, తనలాంటి ప్రజాస్వామ్య వాదులకు, ప్రజలకు పాజిటివ్ షాక్ తగిలిందన్నారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా , గవర్నర్ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ నిపుణుల సలహాలను తీసుకొని, ముందే తిరస్కరించి ఉంటే బాగుండేది అన్నారు . గవర్నర్ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టి వేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యదేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న, గవర్నర్ స్పందించకపోవడం విస్మయాన్ని కలిగించిందన్నారు.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో చర్చిల నిర్మాణానికి 175 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తానంటే వారించాల్సిన గవర్నర్, స్పందించకపోవడం విడ్డూరమన్నారు. రాజ్యాంగం అంటే గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి , తాను చేసిందే రాజ్యాంగం అన్నట్లు వ్యవహరిస్తుంటే గవర్నర్ తన అధికారాలను సమర్థవంతంగా వినియోగించలేకపోయారని పేర్కొన్నారు . ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో జీవోలను, ఆర్డినెన్స్ లను గతంలో ఎప్పుడూ లేనివిధంగా హైకోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 -3 ప్రకారం, ఆర్టికల్ 266 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులను సమీక్షించే అధికారం గవర్నర్ కు ఉందన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేయకుండా చూడడమే గవర్నర్ విధి అని అన్నారు. తమ అనుమతి లేకుండానే ఇతరులకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అపాయింట్మెంట్ ఇచ్చారన్న కారణంగా ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బదిలీ చేయమని కోరగానే, బదిలీ చేశారన్నారు . న్యాయ కోవిదుడైన వ్యక్తి, ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ గా నియమితుడు కావడం రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు కూడా శుభ సూచకమన్నారు . వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పురోగతి వేగమందుకోవడం, విజయసాయి రెడ్డి అల్లుడి అన్న గతంలో అరెస్టయి జైలులో ఉండడం, రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ చేయడం వంటి పరిణామాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడడం లేదన్నారు. శివరామకృష్ణ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో తమ పార్టీ పెద్దలు వారి అనుయాయులతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని శివరామకృష్ణన్ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నప్పటికీ, న్యాయపరమైన వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ పది సలహాలు, సూచనలు చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ రాష్ట్ర రాజధాని ఏర్పాటు పై ఒక నిర్ణయం తీసుకుందన్నారు . జగన్మోహన్ రెడ్డితో సహా అందరి అభిప్రాయం మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. రాజధాని రైతుల వద్ద నుంచి రూపాయి ఖర్చు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూసేకరణ చేపట్టారని, భూమి ఇచ్చినవారికి భవిష్యత్తులో ఆర్థికంగా అండగా ఉండే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్నారు.

సకాలంలో జీతాలు అందించే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలి
జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలని రఘురామకృష్ణం రాజు కోరారు. జీతాలు అందక ఉద్యోగ ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి సకాలంలో జీతాలు అందించే విధంగా నూతన గవర్నర్ చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సాక్షి దినపత్రిక కథనాల వెనుకనున్న మర్మం ఏమిటని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను ప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరించడం సరి కాదన్నారు. సిబిఐ దర్యాప్తుకు సహకరించకుండా, గతంలో సిబిఐ అధికారిపై కేసులు నమోదు చేయడం, హైకోర్టులో సుదీర్ఘకాలం పాటు విచారణకు రాకుండా, సాక్షి దినపత్రికలో వాస్తవాలను వక్రీకరిస్తూ కథనాలు రాయడం వంటి అంశాలను పరిశీలిస్తే, తమ పార్టీ పెద్దలపై ప్రజల్లో అనుమానాలు నెలకొనే ప్రమాదం ఉందన్నారు . తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కానీ వ్యక్తికి కూడా 2 + 2 గన్మెన్లతో రక్షణ కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తగిన సలహాలు సూచనలు ఇచ్చిన వారికి మాత్రం సెక్యూరిటీ సిబ్బందిని కుదించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

LEAVE A RESPONSE