– బిల్లు కోసం ఆడవాళ్లతో మాట్లాడమన్నారు
– ఆమె ఆశ్చర్యపోయేంత పర్సంటేజీ అడిగారు
– అన్నీ అధికారులకు ఇస్తే కాంట్రాక్టర్లు అడుక్కుతినాలా?
– ఇదిగో వాట్సాప్ చాటింగ్ ఆధారాలు
– పార్టీకి ‘కాపు’ కాసే వారికి ఇదేనా గౌరవం?
– పార్టీలో చాలామందికి ఇలాంటి అవమానాలు
– పార్టీ నేతల పనులకూ బిల్లులివ్వని అధికారులు
– ఇంకా జగన్ హయాం నాటి అవినీతి అవశేషాలు
– వీరితోనే ప్రభుత్వానికి చెడ్డపేరు
– స్పెషల్ సీఎస్‌కు చెప్పినా దిక్కులేదు
– కమ్మగా భజన చేసేవారికి ప్రభుత్వం కమ్మగా ఉంది
– పార్టీ నాయకులకు చెప్పినా స్పందన శూన్యం
– మరి మేం ఎవరికి చెప్పుకోవాలి?
– అందుకే మీడియాకు ఎక్కక తప్పలేదు
– అవినీతి అధికారులను మార్చకపోతే పార్టీకి నష్టమే
– బలిజనాడు కన్వీనర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ ఓ.వి.రమణ ఆవేదన
తిరుపతి: ‘‘ గతంలో మా కంపెనీ చేసిన పనులకు సంబంధించిన బిల్లు చెల్లింపుల కోసం హౌసింగ్ ఎండి అరుణ్‌బాబు లంచం అడుగుతున్నారు. చివరకు ఈ విషయంలో హైదరాబాద్‌లోని వాళ్ల ఆడవారితో మాట్లాడమని పురమాయిస్తే, ఆమె డిమాండ్లు దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ నేను పార్టీ అగ్రనాయకులకు చెప్పా. స్పెషల్ చీఫ్ సెక్రటరీకి చెప్పా. అయినా దిక్కులేదు. కాంట్రాక్టర్లు టెండర్లకు డబ్బులిచ్చి, బిల్లులకూ ఇస్తే ఇక వాళ్లకు మిగిలేది ఏంటి? ఏళ్ల తరబడి పెండింగ్ లో పెడితే తెచ్చిన వడ్డీల సంగతేమిటి? నాకు రావలసిన 90 లక్షల బిల్లులో ఈరకంగా అందరికీ ముడుపులు చెల్లిస్తే, నాకు మిగిలేది 20 లక్షలు. వాటికి వడ్డీలు పోతే మిగిలేది నాలుగు లక్షలు. ఆ నాలుగు లక్షల కోసం ఇంత రిస్కు చేసి వ్యాపారం చేయాలా? ఇలాగైతే రాష్ట్రంలో ఎవరైనా పెట్టబడి పెట్టి వ్యాపారాలు చేస్తారా?
ఇప్పుడున్న చాలామంది అధికారులు టీడీపీ నాయకులకు పనిచేయడం లేదు. బిల్లులూ ఇవ్వడం లేదు. డబ్బులిచ్చిన వారికే ఇస్తున్నారు. జగన్ హయాంనాటి ఇలాంటి అవినీతి అధికారుల అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అలాంటి వారిని పక్కనపెట్టకపోతే పార్టీకే నష్టం. ఇవన్నీ నేరుగా సీఎంగారికి చెప్పాలని ఉన్నా ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టం. అందుకే పార్టీ ఆఫీసు నాయకులకు చెప్పా. అయినా నాకు న్యాయం జరగలేదు.
దేవగౌడ, కుమారస్వామితోపాటు ఇద్దరు సీఎంలతో కలసి జాతీయ స్థాయిలో పనిచేసిన నాకే ఇలాంటి దుస్థితి ఉంటే, ఇక స్థానికంగా చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే పార్టీ నాయకుల సంగతేమిటి? అందుకే మీడియా ముఖంగా నాకు జరిగిన అన్యాయం చెప్పాల్సి వస్తోంద’’ని టీడీపీ నాయకుడు, బలిజనాడు కన్వీనర్, టీటీడీ మాజీ సభ్యుడు డాక్టర్ ఓ.వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తన కంపెనికి హౌసింగ్ బోర్డు నుంచి రావలసిన 90 లక్షల రూపాయల బిల్లు చెల్లింపు కోసం తాను 11 నెలల నుంచి ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఓ.వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి బోర్డు ఎండి అరుణ్‌బాబును సంప్రదిస్తే ఆయన లెక్కలేకుండా మాట్లాడారని, పైగా హైదరాబాద్‌కు వెళ్లి ఆడవారితో మాట్లాడుకోమని పురమాయించారన్నారు. అక్కడికి వెళ్లగా ఆమె దారుణమైన పర్సంటేజీ చెప్పారని వెల్లడించారు.
మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో పాటు ఇద్దరు సీఎంలతో కలసి పనిచేసిన తనలాంటి వారికే ఈ మంచి ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి ఉంటే, ఇక గ్రామ-పట్టణ స్థాయిలో చిన్న చిన్న కాంట్రాక్ట్టులు చేసే టీడీపీ నాయకుల పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చన్నారు.
ఈ మంచి ప్రభుత్వంలో ఇంకా జగన్ ప్రభుత్వ అవినీతి అవశేషాలు ఉన్నాయని, వాటిని పక్కన పెట్టకపోతే పార్టీ-ప్రభుత్వం నష్టపోతుందని హెచ్చరించారు. కూటమి నాయకులనే డబ్బులు అడుగుతున్నారంటే, ఇక ఇలాంటి అధికారులు సామాన్యుల నుంచి ఎంత పిండుతున్నారో అర్ధం చేసుకోవాలన్నారు.
‘నేను గత మూడున్నరేళ్లుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, యువనేత లోకేష్‌పై, వారి కుటుంబంపై ఎవరు ఆరోపణలు చేసినా ఎదరుదాడి చేస్తున్నా. ముఖ్యంగా టీటీడీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నేనే ఎదురునిలిచి ఎదురుదాడి చేస్తున్నా. అలాంటి నాకే న్యాయం జరగకపోతే ఎలా? నేను నా బిల్లు విషయం గురించి టిడి జనార్దన్‌రావు, మాల్యాద్రితోపాటు, లోకేష్‌కు ట్వీట్ చేశా.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్‌కు చెబితే, బోర్డులో నిధులున్నాయి కదా ఎందుకు ఇవ్వడం లేదు? నేను చెబుతానని ఆయన కూడా ఎండికి ఫోన్ చేసి చెప్పారు. అయినా ఎంపి అరుణ్‌బాబు లెక్కచేయడం లేదంటే ఆయన వెనుక ఎవరున్నారు? ఎవరిని చూసుకుని ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎవరికి అవమానం? నాయకులకా? ప్రభుత్వానికా? ఆలోచించండి’ అన్నారు.
పార్టీ నాయకులు చేసే పనుల బిల్లులపై పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు కఠిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘సార్.. మాకూ కుటుంబాలున్నాయి. మేమూ బతకాలి. మాపై ఆధారపడే వారికి జీతాలిచ్చి బతికించాలి. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే డబ్బులు అవసరం కదా? పార్టీ నాయకుల బిల్లులు ఆపి, వాటి కోసం డబ్బులు అడుగుతున్నారంటే ఈ అప్రతిష్ఠ-అవమానం ఎవరికి?
నాయకులు-కార్యకర్తలకు అవమానం జరిగితే పార్టీకి-ప్రభుత్వానికి జరిగినట్లు కాదా? అయినా మా లాంటి వాళ్లు పనులుచేయకుండా బిల్లులు అడగటం లేదు కదా? చేసిన పనులకే బిల్లులు అడుగుతుంటే, ఈ రకంగా ఐఏఎస్ అధికారులు డబ్బులు పిండుతుంటే ఇక మేం వ్యాపారాలు చేయాలా? మానేయాలా? ఇప్పటికే మున్సిపాలిటీల్లో బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు పనులుచేయడం లేదు. పనులు కోసం డబ్బులిచ్చి, బిల్లుల కోసం డబ్బులిస్తే ఇక కాంట్రాక్టర్లు ఏం తినాలి’’ అని రమణ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న తనలాంటి బిల్లుల బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా అవినీతి పరులైన ఐఏఎస్ అధికారులకు ఎలాంటి కీలకమైన పోస్టింగులు ఇవ్వవద్దని, వారికి ముఖ్యమైన శాఖలు ఇచ్చినందుకే చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలని రమణ సూచించారు.